Munugode By Election: రేపు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-29T19:24:38+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్‌ఎస్‌ (TRS) తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది.

Munugode By Election: రేపు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న కేసీఆర్‌
kcr

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్‌ఎస్‌ (TRS) తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది. ఈ నెల 30వ తేదీన ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు వేదికగా సీఎం కేసీఆర్‌ (CM KCR) ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు లక్ష మందిని తరలించడమే లక్ష్యంగా మంత్రి జగదీష్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు ఆ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్న సీపీఎం, సీపీఐ (CPI CPM) శ్రేణులు సైతం పాల్గొననున్నాయి. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ సభకు హాజరుకానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే మునుగోడు కేంద్రంగా టీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగ సభ ఏర్పాటు చేయగా, తాజాగా చండూరులో మరోసారి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ చండూరులో సుదీర్ఘంగా ప్రసంగిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మునుగోడు ఓటర్లను టీఆర్‌ఎస్ వైపు మళ్లించే దిశగా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ (BJP) నేతలు రాష్ట్రంలో బలవంతంగా మునుగోడు ఉప ఎన్నికను తీసుకురావడం.. వెనువెంటనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి రావడం.. మునుగోడు ఉప ఎన్నిక తదుపరి టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందించడం వంటి పరిణామాలను తమ అధినేత మునుగోడు ఓటర్లకు వివరిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఫ్లోరైడ్‌ మహమ్మారి మూలంగా 30ఏళ్ల యువకుడు మూడేళ్ల బాలుడిలా కనిపించడం, నాటి బీజేపీ ప్రధాని టేబుల్‌పై ఫ్లోరైడ్‌ పీడితుడిని పడుకోబెట్టిన కరుణించలేదని, 70ఏళ్లలో సాధ్యం కానీ ఫ్లోరిన్‌ నిర్మూలన ఏడేళ్లలోనే మునుగోడులో తాము సాధించామని కేసీఆర్‌ వివరించనున్నారు.

Updated Date - 2022-10-29T19:24:40+05:30 IST