KCR Nutrition Kit: కేసీఆర్ పౌష్టికాహార కిట్
ABN , First Publish Date - 2022-12-19T02:55:10+05:30 IST
గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెడుతోంది. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్’ పథకాన్ని ప్రారంభిస్తోంది.
గర్భిణులకు సర్కారు మరో పథకం
ఈ వారంలో సీఎం చేతుల మీదుగా..
తొలుత 9 జిల్లాల్లో అమలు!
దశలవారీగా రాష్ట్రమంతటా పథకం!
గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్
మరో పథకం ప్రవేశపెడుతున్న సర్కారు
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెడుతోంది. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్’ పథకాన్ని ప్రారంభిస్తోంది. గర్భిణులకు రెండు సార్లు ఈ కిట్‌ను అందజేయనుంది. ఈ వారంలోనే పథకాన్ని ప్రారంభించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. వైద్య కళాశాలల మాదిరిగానే వర్చువల్ పద్ధతిలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ నెల 21న పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ కిట్‌ను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రారంభించేందుకు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో అది రద్దు అయినట్లు తెలుస్తోంది.
గర్భిణులకు ఈ కిట్‌ను ఐదో నెలలో ఒకసారి, 9వ నెలలో మరోసారి ఇస్తారు. తొలుత ఈ పౌష్టికాహార కిట్‌ను రక్తహీనత ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లోనే ఇవ్వనున్నారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రా ద్రి కొత్తగూడెం, గద్వాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూలు, ములుగు, వికారాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 9 జిల్లాల్లో 2.50 లక్షల కిట్లను అందజేయనున్నారు. మొత్తం 200 పైగా ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ జిల్లాల్లో వచ్చే ఫలితాల ఆఽధారంగా మిగతా జిల్లాల్లోనూ దశలవారీగా పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలోనే ఎక్కువ
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం తెలంగాణలో గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది. రాష్ట్ర మహిళల్లో 56.6 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. జాతీయ సగటు 53.1 శాతంగా ఉంది. అంటే దేశం మొత్తంలో తెలంగాణలోనే రక్తహీనత ఎక్కువగా ఉంది. అందుకే సర్కారు ఈ పౌష్టికాహార కిట్ పథకాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రసవం తర్వాత సర్కారు కేసీఆర్ కిట్‌ను అందిస్తోంది. ఇక నుంచి గర్భం దాల్చి, కాన్పు అయ్యేలోగా రెండుసార్లు పౌష్టికాహార కిట్‌ను అందించనున్నారు. తమిళనాడులో ‘అమ్మ మెటర్నిటీ పౌష్టికాహార కిట్’ పేరుతో పథకం కొనసాగుతుండగా.. రాష్ట్రానికి చెందిన మహిళా ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్లి, దానిపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే తమిళనాడు కంటే మెరుగ్గా కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిలో మూడున్నర లక్షల కాన్పులు సర్కారీ దవాఖానాల్లో జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీనాటల్ చెక్‌పకు వచ్చేవారి సంఖ్య దాదాపు 5 లక్షలకు పైగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లో అందించాల్సిన వస్తువులపై హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ సహకారం తీసుకున్నారు.
కిట్‌లో ఏమేం ఉంటాయంటే..
కిట్‌లో అన్నీ ప్రముఖ సంస్థల ఉత్పత్తులనే వాడుతున్నారు. 2 కిలోల హార్లిక్స్, అర కిలో విజయ నెయ్యి, కిలో లయన్ డేట్ ఖర్జూరం, 3 ఐరన్ సిరప్ బాటిల్స్, ఒక కప్పు, అల్బెండజోల్ ట్యాబ్లెట్లు.. వీటన్నిటినీ ఒక ప్లాస్టిక్ బుట్టలో పెట్టి ఇస్తారు. కాగా, ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద గర్భిణులకు పాలు, కోడిగుడ్లతో పాటు మరికొన్ని పోషకాహార పదార్థాలను అందజేస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూనే, కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ను అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న కేసీఆర్ కిట్ విలువ (రూ.13 వేలు నగదు, రూ.2 వేల కిట్) రూ.15 వేలు అవుతోంది. దానికి అదనంగా పౌష్టికాహార కిట్ జత కానుంది. ఈ కిట్ విలువ రూ.4 వేలు కావడంతో గర్భిణులకు మొత్తం రూ.19 వేల మేరకు లబ్ధి చేకూరనుంది.