అసలే చలి.. ఆపై చన్నీళ్లు!
ABN , First Publish Date - 2022-11-24T23:31:13+05:30 IST
రోజురోజుకూ చలిపంజా విసురుతున్నా సంక్షేమహాస్టళ్లపై ప్రభుత్వానికి పట్టింపులేదు. చలితో వసతిగృహాల్లో విద్యార్థులు గజగజలాడుతున్నా.. చన్నీటి స్నానం చేస్తున్నా.. అధికారుల్లో స్పందన కనిపించడంలేదు. రాత్రి ఉష్ణోగ్రతల ు20డిగ్రీల దిగువకు పడిపోతున్నా.. రగ్గులు, బెడ్ షీట్లు అందజేయాలనే ధ్యాసే లేదు. పగిలిన కిటికీలు, తలుపులు, తెరిచి ఉన్న వెంటిలేటర్ల నుంచి చలిగాలులు వస్తున్నా హాస్టల్ గదులను మరమ్మతు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. దోమలు విజృంభిస్తున్నా, ఈగలు ముసురుతున్నా జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నా మొద్దు నిద్ర వీడటం లేదు.
బాలుర హాస్టళ్లకు కిటికీలు, గోడ సరిగాలేని దృశ్యం
అశ్వారావుపేటలో చలిలో చన్నీళ్ల స్నానం చేస్తున్న చిన్నారులు
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల పాట్లు
వేడినీటి సరఫరా మరిచిన సర్కారు
పూర్తిస్థాయిలో అందని బెడ్‌షీట్లు, రగ్గులు
పడక ఏర్పాట్లు లేక నేలపైనే నిద్ర
తెరలు లేక విజృంభిస్తున్న దోమలు
మరమ్మతులకు నోచని తలుపులు, కిటికీలు, గదులు
రోజురోజుకూ చలిపంజా విసురుతున్నా సంక్షేమహాస్టళ్లపై ప్రభుత్వానికి పట్టింపులేదు. చలితో వసతిగృహాల్లో విద్యార్థులు గజగజలాడుతున్నా.. చన్నీటి స్నానం చేస్తున్నా.. అధికారుల్లో స్పందన కనిపించడంలేదు. రాత్రి ఉష్ణోగ్రతల ు20డిగ్రీల దిగువకు పడిపోతున్నా.. రగ్గులు, బెడ్ షీట్లు అందజేయాలనే ధ్యాసే లేదు. పగిలిన కిటికీలు, తలుపులు, తెరిచి ఉన్న వెంటిలేటర్ల నుంచి చలిగాలులు వస్తున్నా హాస్టల్ గదులను మరమ్మతు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. దోమలు విజృంభిస్తున్నా, ఈగలు ముసురుతున్నా జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నా మొద్దు నిద్ర వీడటం లేదు. దోమతెరలు అందించడం లేదు.. పారిశుధ్య చర్యలను సక్రమంగా చేపట్టడం లేదు. అయితే ఆశ్రమాలు, వసతిగృహాల్లో పరిస్థితులు ఒక రకంగా ఉంటే గురుకులాల్లో చాలీచాలని గదులు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో చిన్నారులు పడుతున్న ఇబ్బందులు మరోలా ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్నారులకు ప్రధానంగా అందివ్వాల్సిన దుప్పట్లను కూడా సకాలంలో అందించడం లేదు. దీంతో పాటు వసతిగృహాల్లో కిటికీలకు పూర్తిస్థాయిలో రెక్కలు కూడా ఉండకపోవడంతో చిన్నారులు గజగజ వణుకుతూనే చదువులు సాగిస్తున్నారు.
- ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం నెట్‌వర్క్
హీటర్లు లేవు
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి బీసీ, ఎస్టీ బాలురు, ఎస్సీ బాలికల హాస్టల్, నేలకొండపల్లి ఎస్సీ, బీసీ బాలికల హాస్టల్స్, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ గురుకుల హాస్టళ్లలో వాటర్ హీటర్లు లేవు. దీంతో విద్యార్థులు చన్నీటి స్నానాలతో అస్వస్థతకు గురవుతున్నారు.
ఆశ్రమాల్లో చలి పులి
అశ్వారావుపేటలోని ఎస్సీ ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో ప్రతిచోటా చిన్నారులు చన్నీళ్లతోనే స్నానాలు చేస్తున్నారు. బాలురు వసతిగృహాల్లో అయితే ఆరుబయట ట్యాంకు వద్దనే చిన్నారులు స్నానాలు ముగిస్తున్నారు. ఎస్టీ బాలుర వసతిగృహంలో ఒక గదిలో కిటికీకి రెక్క కూడా లేదు. దీంతో బయటనుంచి విపరీతమైన చల్లటి గాలి వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీసీ బాలుర వసతిగృహంలో చిన్నారులకు బెట్ షీట్స్ వచ్చినా దుప్పట్లు నేటికి అందలేదు. ఎస్సీ బాలుర వసతిగృహంలో చిన్నారులకు చన్నీళ్ల స్నానాలే దిక్కయ్యాయి. కొన్ని వసతిగృహాల్లో చిన్నారులకు మంచాలు ఉన్నా మరికొన్ని చోట్ల లేకపోవటంతో చలిలోనూ నేలమీదనే పడుకోవాల్సి వస్తోంది. దమ్మపేట మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో డార్మిటరీ సరిపోకపోవడంతో తరగతి గదుల్లోని విద్యార్థులు నిద్రిస్తున్నారు. రగ్గులు ఈ ఏడాది సరఫరా కాలేదు. చంద్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో కొన్ని కిటికీలకు తలుపులు పగిలిపోవడంతో చలిగాలిలోనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. ఇక్కడా చిన్నారులకు చన్నీళ్ల స్నానాలు తప్పడం లేదు. అన్నపురెడ్డిపల్లిలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులు చాపలపైనే పడుకున్నారు. హాస్టల్‌లోని 160 మంది విద్యార్థులకు దుప్పట్లు సరఫరా కాలేదు.
వసతిగృహాలు సమస్యల నిలయాలు
భద్రాచలంలో రెండు గిరిజన సంక్షేమ పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహాలు ఉండగా పలు గదులకు కిటికీలు, తలుపులు సవ్యంగా లేవు. దీంతో చలికి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గదుల పైకప్పులు సైతం పగుళ్లు వచ్చి పెచ్చులూడుతున్నాయి. విద్యార్థులకు కప్పుకోవడానికి చద్దర్లు లేక చలితో ఇబ్బంది పడుతున్నారు. దుమ్ముగూడెం కస్తూరిబా పాఠశాలలో సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో వేడినీళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. చర్ల బీసీ వసతిగృహంలో మంచాలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై పడుకుంటున్నారు. ఎస్టీ వసతిగృహం విద్యార్థులకు మూడేళ్లుగా స్వెట్టర్లు ఇవ్వలేదు. అంబేద్కర్‌నగర్, ఎస్‌ఎం వసతిగృహంలో కిటికీలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
గొంతునొప్పి, గవదబిళ్లలు
మణుగూరులోని ఎస్టీ ,ఎస్సీ బీసీ హాస్టళ్లతో పాటు పినపాక ఎల్సిరెడ్డి పల్లి గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, గొందిగూడెం ఆశ్రమ పాఠశాల, బూర్గంపహాడ్, ఆళ్లపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల ఇలా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో చలికాలం ప్రభుత్వం నుంచి అందాల్సిన వసతి సదుపాయాలు ఏవీ నేటికి అందలేదు. దీంతో వేలాదిమంది విద్యార్థులు ఎముకలు కొరికే చలిలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొందిగూడెం, భూర్గంపహడ్ హాస్టళ్లలో చిన్నారులు నేలపైనే పడుకుంటున్నారు. చలి వ్రత కు జలుబు, జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. గొంతునొప్పి, గవదబిల్లలై కనీసం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
వెంటలేటర్ల ద్వారా చలిగాలులు
ఇల్లెందు పట్టణంలోని గిరిజన బాలుర పాత హాస్టల్‌లో వెంటిలేటర్ల ద్వారా చలిగాలులు వీస్తుండటంతో విద్యార్థులు వణికిపోతున్నారు. 135 మంది ఆవాసం ఉంటున్న బాలుర హాస్టల్‌లో కప్పుకునేందుకు రగ్గులు, స్వెట్టర్లు సరఫరా చేయలేదు. బీసీ బాలుర హాస్టల్‌లో సైతం అదే పరిస్థితి. సరఫరా చేసిన బెడ్‌షీట్లు సైతం నాణ్యతలేక పలుచగా ఉన్నాయి.
నేలమీదే నిద్ర
ఏన్కూరు మండలంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 334మంది బాలికలు నేలమీదనే, దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నారు. 2018లో ఏర్పాటుచేసిన వేడినీటి సోలార్ సిస్టం ఏర్పాటుచేసిన ఏడాదికి పాడైపోయింది. బీసీ హాస్టళ్లలో 30మంది విద్యార్థులు, మూలపోచారం ఆశ్రమ పాఠశలలో 164మంది విద్యార్థ్ధలు నేలమీదనే పడుకుంటున్నారు. గురకుల పాఠశాలలో 7,8,9,10 తరగతి విద్యార్థులు బెడ్లులేక నేలమీదే పడుకుంటున్నారు.
ఆరుబయటే భోజనాలు
కొత్తగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాలు లేక పోవడంతో విద్యార్థులు ఆరుబైటనే చలిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. స్నానానికి వేడినీళ్ల సరఫరా లేక పోవడంతో ఉదయం చలినీళ్లు తప్పడం లేదు. సరిపడా స్నానపుగదులు లేక ఆరబైటనే స్నానం చేస్తున్నారు. పాల్వంచ ఎస్టీ వసతి గృహంలో విద్యార్దులకు దుప్పట్లు, బెడ్ షీట్స్ ఇచ్చినప్పటికి వేడినీళ్ల సరఫరా లేదు. కిటికీలు, తలుపులకు మరమ్మతులు చేప్పట్టడంతో గదుల్లో కూర్చొలేని పరిస్థితి ఉంది. అన్ని హాస్టళ్లలో బెడ్స్ సౌకర్యం లేక పోవడంతో నేలపైనే చిన్నారులు పడుకుంటున్నారు.