వాన వరద
ABN , First Publish Date - 2022-09-12T06:54:19+05:30 IST
వాన వరద
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న ప్రాజెక్టులు
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి
కిన్నెరసాని, తాలిపేరుకు భారీగా వరద
ఖమ్మం/కొత్తగూడెం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నదులు, ప్రాజెక్టులు, వాగులకు వరద పొటెత్తుతోంది. భద్రాద్రి జిల్లాలోని ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక సమీపానికి చేరింది. శనివారం అర్దరాత్రి 12 గంటలకు 25అడుగులున్న గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 29అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు 36.1 అడుగుకు చేరుకుంది. సోమవారం నాటికి తొలి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ దగ్గర 45 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో ఆ ప్రభావం భద్రాచలం వద్ద పడుతోంది. ఇప్పటికే భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాలు నీట మునిగాయి. కాగా ఎటువంటి అవాంచీనయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుండటంతో భక్తులు ఎవరు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి 1,30,000వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుం నీటి మట్టం 73.46 మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో 103195 క్యూ సెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటి మట్టం 404అడుగులకు చేరడంతో ఆదివారం సాయంత్రం ఒక గేటును ఎత్తారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఆళ్లపల్లి, కరకగూడెంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆళ్లపల్లి మండలంలో జల్లేరువాగుకు నీటి ప్రవాహం అధికం కావడంతో వాగు దాటేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకగూడెం మండలంలోని పెద్దవాగు పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఆదివారం 3.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పినపాక మండలంలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 2.40సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎర్రుపాలెంలో 6.52సెంమీల వర్షం కుసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. సత్తుపల్లిలోని ఓపెనకా్‌స్టలో బొగ్గు ఉత్పత్తికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది.