భద్రాద్రి ఏజెన్సీలో వైద్యుల కొరత
ABN , First Publish Date - 2022-12-14T00:07:47+05:30 IST
భద్రాచలం ఏజెన్సీ వాసులను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ఇక్కడ అధిక సంఖ్యలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 29ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన పీహెచసీలలో 65 వైద్య పోస్టులుండగా ఇప్పటికే 35 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పని చేస్తున్న ఆరుగురు వైద్యులకు పీజీ కోర్సులో సీటు లభించడంతో వారు ఉన్నత చదువుల కోసం ఈ వారంలో విధుల నుంచి రిలీవ్ కానున్నారు. ఇప్పటికే జిల్లా వైద్య
ఇప్పటికే 35 డాక్టర్ పోస్టులు ఖాళీ
తాజాగా పీజీ కోర్సుకు ఆరుగురు ఎంపిక
త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటున్న వైద్యాధికారులు
భద్రాచలం, డిసెంబరు 13: భద్రాచలం ఏజెన్సీ వాసులను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ఇక్కడ అధిక సంఖ్యలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 29ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన పీహెచసీలలో 65 వైద్య పోస్టులుండగా ఇప్పటికే 35 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పని చేస్తున్న ఆరుగురు వైద్యులకు పీజీ కోర్సులో సీటు లభించడంతో వారు ఉన్నత చదువుల కోసం ఈ వారంలో విధుల నుంచి రిలీవ్ కానున్నారు. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉండటంతో డా. దయానందస్వామి ఇనచార్జ్‌గా పనిచేశారు. అయితే ప్రభుత్వం ఆయన స్థానంలో మంగళవారం డాక్టర్ జేవీఎల్ శిరీషను డీఎం అండ్‌హెచవోగా నియమించింది. ఆరుగురు వైద్యులు పీజీ కోసం వెళ్తుండటంతో ఆ ప్రభావం జిల్లా వైద్య సేవలపై భారీగా పడే అవకాశం ఉంది. ఎర్రగుంట పీహెచసీ వైద్యుడిగా పని చేస్తున్న డా. జి. చేతన ఇప్పటికే ఎనసీడీ పోగ్రామింగ్ అధికారిగా, టీహబ్, పల్లెబస్తీ దావఖానాల జిల్లా అధికారిగా, టీ హబ్ జిల్లా అధికారిగా, ఈ సంజీవని జిల్లా బాధ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పీడియాట్రిషన కోర్సులో పీజీ సీటు లభించడంతో ఆయన తన విధుల నుంచి రిలీవ్ కానున్నారు. మోరంపల్లిబంజర పీహెచసీ వైద్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా. నాగేంద్రప్రసాద్ ప్రస్తుతం జిల్లా డీఐవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సైతం జనరల్ మెడిసినల్‌లో సీటు లభించడంతో ఆయన ఉన్నత చదువులకు వెళ్లనున్నారు. ఆళ్లపల్లి వైద్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.సుజాత, జిల్లా ఎంసీహెచ ప్రోగ్రామింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెకు సైతం గైనకాలజీలో పీజీ చదివేందుకు సీటు లభించడంతో ఆమె రిలీవ్ కానున్నారు. అదేవిధంగా గుండాలకు చెందిన డా. సుదీర్‌కు ఈఎనటీ రాగా, మరో వైద్యులు డా. రవిచంద్రకు సైతం పీజీలో సీటు లభించింది. అదేవిధంగా కొమరారం వైద్యురాలు కె.శ్రీలతకు సైతం జనరల్ మెడిసినలో సీటు లభించింది. దీంతో ఆమె సైతం రిలీవ్ కానున్నారు. ఈ క్రమంలో ఆరుగురు వైద్యులు ఈ వారంలో తమ చదువుల కోసం రిలీవ్ కానుండటంతో జిల్లాలో వైద్యుల పోస్టుల ఖాళీలు 35నుంచి 41కి పెరగనున్నాయని వైద్యాధికారులే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు వైద్యం ఏ విధంగా అందుతుందనేది ప్రశ్నగా మారింది.
డీఎంహెచవోగా డాక్టర్ శిరీష
భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ జేవీఎల్ శిరీష నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఖమ్మం అడిషనల్ డీఎం అండ్‌హెచవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో సైతం డాక్టర్ శిరీష భద్రాద్రి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా పనిచేశారు. అప్పుడు ఆమె ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సెలవులపై వెళ్లడంతో ఆమె స్థానంలో ఆనాడు భద్రాచలం అడిషనల్ డీఎం అండ్ హెచవోగా ఉన్న డాక్టర్ దయానందస్వామిని నియమించారు. ప్రస్తుతం డాక్టర్ శిరీష ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ దయానందస్వామిని కొత్తగూడెం మెడికల్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ ఆర్‌ఎంవో ఇనచార్జ్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త వైద్యులొస్తారంటున్న అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్యులను నియమిస్తున్న క్రమంలో జిల్లాకు సైతం వైద్యులు ఇప్పటికే రావాల్సి ఉందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇప్పటికీ వైద్యుల రాక కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో వైద్యుల పోస్టులు 65 ఉండగా 41ఖాళీల్లో కనీసం 30మంది వైద్యులనైనా జిల్లాకు కేటాయించే అవకాశం ఉందని, వారి రాకతో సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వారు ఇంకెప్పుడొస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.