కొంగుబంగారం కొమ్మాల లక్ష్మీనరసింహుడు
ABN , First Publish Date - 2022-03-10T05:51:23+05:30 IST
కొంగుబంగారం కొమ్మాల లక్ష్మీనరసింహుడు
నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు
14న కల్యాణోత్సవం, 18న జాతర, 22న రథోత్సవం
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్న భక్తులు
గీసుగొండ, మార్చి 9: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఎంతో ప్రాచీన విశిష్టత గల కొమ్మాల జాతర అనగానే నాటి రాజకీయాలు కళ్ల ముందు కదులాడుతాయి. జాతరలో ఎరుపెక్కేరాజకీయ ప్రభలు ఆకట్టుకునేవి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శేషగిరి, ఉత్సవ కమిటీ చైర్మన్ కుమారస్వామి తెలిపారు. భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకొని భక్తిప్రభలతో మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. రంగుల హోలి, నిండు పౌర్ణమి రోజు ఆలయం చుట్టు గోవింద నామస్మరణలతో ఎడ్లబండ్లపై ఒంటె, గుర్రం, మేక, ఏనుగు వంటి భక్తి ప్రభలతో భక్తిపారవశ్యంతో భక్తుల చేసే కోలాహలం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీంతో భక్తులు ఆనంద డోలికల్లో మునిగి తన్మయత్వాన్ని పొందుతారు.
ఆలయ స్థలపురాణం
కొన్ని వందల సంవత్సరాల క్రితం కొమ్మిడి వంశస్థులు ఆలయ గుట్ట సమీపంలో జీవనం సాగించేవారు. ఇదే ప్రాంతంలో మొక్కజొన్న పంటను ఓ రైతు సాగు చేశాడు. కొద్దిరోజుల అనంతరం కోతకు వచ్చి జొన్న చేనును రైతు కోయటం ప్రారంభించారు. ఎంతకు కోత పూర్తి కాకపోవటంతో అలసి అక్కడే చెట్టు నీడన కూర్చున్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక బాలుడు పంట చేనును తాను కోసిపెడతానని.. తనకు కొడవలి, తాగటానికి దూపబుడ్డి కావాలని రైతుకు చెబుతాడు. సరేనని ఆ బాలునికి కొడవలి ఇచ్చి దూపబుడ్డి కోసం రైతు వెళుతాడు. తిరిగి వచ్చే సరికి మొత్తం చేను కోసి ఉండటం చూసిన రైతు ఆశ్చర్యపోతాడు. బాలుడి కోసం వెదుకుతాడు. కానీ, ఆ బాలుడు కనబడకపోవటంతో రైతు ఇంటికి వస్తాడు. అదే రోజు రాత్రి ఆ రైతు కలలోకి బాలుడు వచ్చి తాను నరసింహాస్వామినని.. ఇక్కడ ఉన్న గుట్టపై వెలుస్తున్నాని, ఆలయం కట్టించాలని కోరుతాడు. ఈ విధంగా ఆలయ నిర్మాణం జరగిందని స్థల పురాణంలో ఉన్నట్లు ఆలయ అర్చకులు చెబుతారు. 40 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై గల రాతిగుహలో స్వామి వారు వెలియగా అప్పటి నుంచి కొమ్మాల జాతర కొనసాగుతున్నట్లు వారు చెబుతారు. పూర్వకాలంలో పాండవులు కూడా స్వామి వారిని పూజించినట్లు స్థల పురాణంలో ఉంది.
మైదాన ప్రాంత గిరిజనులు జాతరకు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ప్రాంతంలో పుట్టిన గిరిజనులు ఎక్కడ ఉన్నా ఈ జాతరకు బంధుమిత్రులతో కలిసివచ్చి స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. ఈ జాతర సమయంలోనే గిరిజనులు పెళ్లి సంబంధాలను కుదుర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రతి యేట 2 లక్షలకు ఫైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
నేటి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసాచార్యులు, ఈవో శేషగిరి తెలిపారు. 10న అధ్యయనోత్సవం, 11న బిందెతీర్థం, రాజభోగం, 12న నిత్యనిధి పరమపదోత్సవం, 13న అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ, 14న ఎదురుకోళ్లు, కల్యాణోత్సవం, 15 నుంచి 18 వరకు నిత్యవిధి హోమాలు, అర్చనలు, పర్వతబలి, 19న రాత్రి ఆలయం చుట్టూ బండ్లు తిరగటంతో జాతర ప్రారంభం, 22న రథోత్సవం, 23న పుష్పయాగం నాగబెళ్లి, పారువేట సేవ, 24న పండితసన్మానం ఉంటాయని వివరించారు.
పర్యాటక కేంద్రంగా మార్చాలి
కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయ గుట్ట వరకు సెంట్రల్ లైటింగ్‌తో డివైడర్‌లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. నాచినపెల్లి నుంచి ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మిస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల వసతి సౌకర్యార్ధం కాటేజీలు కూడా నిర్మిస్తే ఎక్కువ మంది భక్తులు బస చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. వరంగల్ మహా నగరానికి 20కి.మీ దూరంలో ఉన్న కొమ్మాల ఆలయాన్ని అభివృద్ధి పరిస్తే మంచి టూరిజం కేంద్రంగా మారుతుందని స్థానికులు కోరుతున్నారు.