MLA Rasamayi Balakishan: పేద దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డను నేను..
ABN , First Publish Date - 2022-12-07T03:08:00+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కన్నా తానే పెద్ద చదువులు చదినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే రసమయి
శంకరపట్నం, డిసెంబరు 6: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కన్నా తానే పెద్ద చదువులు చదినట్లు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. వారెవరూ డాక్టరేట్ చేయలేదని, తాను చేశానని తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో మంగళవారం ఆయన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాను పేద దళిత కుటుంబంలో పుట్టి ఎంఏ, బీఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీలో గోల్డ్ మెడల్ సాధించానన్నారు. ‘ఎమ్మెల్యే రసమయి అంటే ఎగురుకుంటూ, పాటలు పాడుకుంటూ వస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వారందరి కంటే పెద్ద చదువులు చదివాను’ అన్నారు. 20 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్లు తెలిపారు. కాగా, గద్దపాకలో రసమయికి చేదు అనుభవం ఎదురైంది. రేషన్ షాపు ప్రారంభోత్సవానికి వెళ్తుండగా, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో రసమయి ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు.