యూట్యూబ్‌ క్లాసులు వింటూ ఎంబీబీఎస్‌లో విద్యార్థిని ఘనత.. అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-11-09T20:41:24+05:30 IST

చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అండగా నిలిచారు. యూట్యూబ్‌ (Youtube)లో వీడియో క్లాసులు విని.. మెడిసిన్‌ సీటు సాధించిన నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాకేంద్రంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన హారికకు ఆర్థిక భరోసా కల్పించారు.

యూట్యూబ్‌ క్లాసులు వింటూ ఎంబీబీఎస్‌లో విద్యార్థిని ఘనత.. అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత
kavitha

నిజామాబాద్‌: చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అండగా నిలిచారు. యూట్యూబ్‌ (Youtube)లో వీడియో క్లాసులు విని.. మెడిసిన్‌ సీటు సాధించిన నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాకేంద్రంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన హారికకు ఆర్థిక భరోసా కల్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో హారిక ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ చదివేందుకు అవసరమైన లక్షా 35వేల రూపాయలను చెక్కు రూపంలో అందించారు. అలాగే ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయ్యేందుకు అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని హారిక నిరూపించిందన్నారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకుని ఎంబీబీఎస్‌ సీటు తెచ్చుకోవడం సంతోషకరమన్నారు. హారిక మున్ముందు రాణించి.. వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని కవిత ఆకాంక్షించారు.

యూట్యూబ్‌లోనే క్లాసులు విని ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయిలో హారిక 700వ ర్యాంక్‌ సాధించింది. హారిక తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో.. తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ కూతురిని చదివించింది. హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 942 మార్కులు సాధించింది. ఇంటర్‌ తర్వాత నీట్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇంట్లోనే యూట్యూబ్‌లో వీడియో క్లాసులు వింటూ నీట్‌కు సిద్ధమైంది. నీట్‌లో జాతీయ స్థాయిలో 40వేల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే ఉండిపోయింది. హారిక ఆర్థిక పరిస్థితి గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో.. విషయం తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆమె చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, ఎంబీబీఎస్‌ చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-09T20:41:26+05:30 IST