గడువులోగా ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి
ABN , First Publish Date - 2022-11-30T00:35:20+05:30 IST
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌లతో కలెక్టర్ సమీక్షించారు.
సంక్రాంతి రోజున అర్హులకు అందించాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్‌అర్బన్, నవంబర్ 29: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌లతో కలెక్టర్ సమీక్షించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. జనవరి 10వ తేదీ నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ, అప్రొచ్‌రోడ్ వంటి కనీస సదుపాయాలు సమకూర్చాలని అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా అరుర్హల ఎంపిక ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. ఆర్డీవోల నేతృత్వంలో తహసీల్దార్‌లు తమ నియోజకవర్గ శాసనసభ్యులను సంప్రదించి వారిని భాగస్వాములు చేయాలన్నారు. సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ప్రత్యేక రిజిస్ర్టార్‌లో నమోదు చేయాలన్నారు. మూడు రోజుల పాటు కార్యదర్శుల చేత దరఖాస్తులు స్వీక రించి వాటిని తమకు పంపించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. దరఖాస్తులను ప్రభుత్వ పరిశీలనకు పంపుతామన్నారు. ఇళ్ల సంఖ్యకంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే 3031 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తుది దశలో ఉన్న మిగతా 3849 ఇళ్ల నిర్మాణాలు సైతం జనవరి 10లోగా పూర్తిచేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని, నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సమకూర్చేందుకు తహసీల్దార్‌లు తోడ్పాటు అందించాలన్నారు. ఇళ్ల పనులు వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రతిరోజూ సమీక్ష చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, ఆర్‌డీవో రవి తదితరులు పాల్గొన్నారు.