కల్లుకాదది.. విషయం!
ABN , First Publish Date - 2022-10-29T00:57:01+05:30 IST
జిల్లాలో కల్తీకల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కనీస నిబంధనలు పాటించకుండా కల్లు తయారు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ప్రమాదకర రసాయనాలతో పెద్ద ఎత్తున తయారీ
పట్టనట్లు వ్యవహరిస్తున్న జిల్లా ఎక్సైజ్ అధికారులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలతో బయటపడుతున్న కల్తీ ‘దందా’ వ్యవహారం
జిల్లాలో కల్తీకల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కనీస నిబంధనలు పాటించకుండా కల్లు తయారు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎక్సైజ్‌శాఖ స్టేషన్‌లకు దగ్గరగానే ఉన్నా పట్టించుకోవడం లేదు. లోపాయికారీ ఒప్పందాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప.. జిల్లా అధికారుల్లో కదలిక రావడం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు పేద, మధ్యతరగతి వారు తాగే మద్యం అలవాటు.. కొందరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆల్పాజోలం, సిట్రిక్‌యాసిడ్, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ వంటి విషపదార్థాలను కలుపుతూ.. శ్రమజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో కల్లుతాగుతున్న వారు వ్యాధుల బారిన పడుతున్నారు.
నిజామాబాద్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కల్తీ కల్లు తయారీపై నిఘాలేదు.. అమ్మకాలపై కట్టడిలేదు.. మత్తునిచ్చే రసాయనాలతో కల్లు తయారు చేస్తున్న వారిపై చర్యలు లేవు. ఎక్సైజ్‌శాఖ స్టేషన్‌లకు ఇవి దగ్గరగానే ఉన్నా పట్టించుకునేవారు లేరు. కిందిస్థాయిలో ఉన్న ఒప్పందాలతో యథేచ్ఛగా దందా కొనసాగుతోంది. క్లోరోహైడ్రేడ్, డైజోఫాం, ఆల్పాజోలం వంటి రసాయనాలతో కల్లు తయారుచేసి అమ్ముతున్నా పట్టించుకోవడంలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తనిఖీలు చేస్తే తప్ప జిల్లా అధికారుల్లో కదలికలేదు.
జిల్లాలో 307 టీఎఫ్‌టీ సొసైటీలు
జిల్లాలో టీఎఫ్‌టీ సొసైటీలు 307ఉన్నాయి. జిల్లాలో గీత కార్మికుల కోసం చెట్ల నుంచి కల్లు తీసేందుకు అనుమతి ఇచ్చారు. వీటి పరిధిలో గీత కార్మికులు చెట్లను పెంచుతూ కల్లు అమ్మకాలు చేస్తున్నారు. తాటి చెట్లతో పాటు ఈత చెట్ల నుంచి కల్లును తీస్తున్నారు. ఇవేకాకుండా వీటి పరిధిలో 184 టీసీఎస్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 440 వరకు కల్లు దుకాణాలు ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో సొసైటీల ద్వారా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. చెట్ల నుంచి తీసిన కల్లును కొన్ని డిపోల పరిధిలో అమ్మకాలు చేస్తున్నారు. కల్లు దుకాణాల ద్వారా ప్రతిరోజూ ఈ కల్లును అమ్ముతున్నారు. జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో చెట్ల నుంచి తీసిందేకాకుండా కల్తీ కల్లు అమ్మకాలను చేస్తున్నారు. రసాయనాల ద్వారా కృత్రిమంగా కల్లు తయారుచేస్తూ ఈ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. చెట్ల నుంచి పారే కల్లును సొసైటీలకు తరలించి అమ్మకాలు చేయాల్సి ఉన్నా కొన్నిచోట్ల చేయడంలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కల్లు యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నారు.
రసాయనాలతో తయారీ
క్లోరోహైడ్రేడ్, డైజోఫాం, ఆల్పాజోలంతో పాటు ఇతర రసాయనాలు ఉపయోగించి కల్లును తయారు చేస్తున్నారు. ఈ రసాయనాలు నిషేధిత జాబితాలో ఉన్నా.. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారు చేస్తున్నారు. ఈ కల్లు తాగిన వారికి ఆరోగ్యపరమైన పలు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకవడంలేదు. గతంలో ఈ దుకాణాలను మూసివేసినప్పుడు నిత్యం కల్లు తాగేవారు రకరకాల జబ్బులు వచ్చి ఇబ్బందులు పడ్డారు. దీర్ఘకాలికంగా ఈ కల్లుతాగిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించినా ఎక్సైజ్‌శాఖ అధికారులు మాత్రం నియంత్రించడంలేదు.
అధికారుల సహకారంతో
జిల్లాలో అధికారుల సహకారంతో యథేచ్ఛగా కల్తీ కల్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. కల్లు దుకాణాల నుంచి వారికి పరిచయాలు ఉండడం, అవసరాలు తీరుతుండడంతో పట్టించుకోవడంలేదు. ఏయే దుకాణాల పరిధిలో చెట్ల కల్లు అమ్మకాలు జరుగుతున్నాయో? వేటి పరిధిలో జరగడంలేదో వివరాలు అన్ని తెలిసిన కనీసం తనిఖీలు చేయడంలేదు. చివరకు కల్లు నాణ్యత పరీక్షలు కూడా నిర్వహించడంలేదు. నగరం పరిధిలో ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేస్తున్నారు. కళ్ల ఎదుటనే కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వచ్చి కల్లు దుకాణాలు తనిఖీ చేస్తే తప్ప.. జిల్లా ఎక్సైజ్ అధికారులు కదలడంలేదు. నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని సారంగాపూర్‌లో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వచ్చిన తర్వాతే తనిఖీలను చేపట్టి క్లోరోహైడ్రేడ్‌ను సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని కల్లు దుకాణాలను తనిఖీలు చేసేందుకు 15 బృందాలను నియమించారు.
కల్తీకల్లు తయారీపై ప్రత్యేక దృష్టి..
ఫ మల్లారెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్
జిల్లాలో కల్తీకల్లు తయారీపై ప్రత్యేకంగా నజర్‌పెట్టాం. సొసైటీల పరిధిలో తనిఖీల కోసం 15 బృందాలను నియమించాం. నిషేధిత రసాయనాలు పట్టుబడితే చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తాం.