జిల్లా నేతలపై మునుగోడు ప్రభావం

ABN , First Publish Date - 2022-10-28T00:18:12+05:30 IST

జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం పడింది.

జిల్లా నేతలపై మునుగోడు ప్రభావం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన వెంటనే నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు

ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్న బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌

జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల

నిజామాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం పడింది. ఆ ఎన్నిక ప్రచారం పూర్తికాగానే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. రాష్ట్రస్థాయిలో మారుతున్న సమీకరణాలకు అను గుణంగా నియోజకవర్గాల్లో ఉంటూ గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బోధన్‌ ఎమ్మెల్యే మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం పేరుమీద గ్రామాలబాట పట్టగా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అర్బన్‌ ఎమ్మెల్యే పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతుండగా జిల్లాలోని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కూడా నవంబరు నుంచి పూర్తిస్థాయిలో గ్రామాల్లో ఉండేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

మునుగోడు ప్రచారంలో జిల్లా నేతలు

జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డితో పాటు ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు కీలకం కానుండడంతో మూడో దఫా గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అనేక పనులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ పేరుతో గ్రామాల్లో పర్యటన చేపట్టారు. నాళేశ్వరం నుంచి పర్యటన ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టరు. అలాగే నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త కూడా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. ఆయా సంఘాలతో మాట్లాడుతూ మరింత బ లోపేతం అయ్యే ప్రయత్నాలు మొలుపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ నియోజకవర్గాల్లో జోరుగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాన్సువాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే అన్ని మండలాలు కలియతిరుగుతున్నారు. గ్రామాల్లో పర్యటి స్తూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల చెక్కులను పంపిణీ చేయడంతో పాటు ఇతర సమస్యలపై దృష్టిపెడుతున్నారు. ప్రజలతో చర్చిస్తున్నారు.

అధికార పార్టీకి దీటుగా

జిల్లాలో అధికార పార్టీ నేతలకు దీటుగా ప్రచారంలో ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా ఉన్న ఇరు పార్టీల నేతలు ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గడగడప పేరుమీద ప్రజల వద్దకు వెళ్లేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంపీ అర్వింద్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, దినేష్‌, వినయ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్‌, వడ్డీ మోహన్‌రెడ్డి, మల్యాద్రిరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, పల్లె గంగారెడ్డితో పాటు ఇతరనేతలు కార్యక్రమాల్లో పాల్గొనేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలా గే కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు రాహూల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర పూర్తికాగానే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, నియోజకవర్గాల ఇన్‌ చార్జీలు తాహెర్‌బిన్‌ హుందాన్‌, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, డాక్టర్‌ భూపతిరెడ్డితో పాటు కేశవేణు, గడుగు గంగాధర్‌, ఇతర నేతలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షు డు మానాల మోమన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్‌ నేతలు జిల్లా అధ్యక్షుడిఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో షర్మిల పర్యటన

జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. బాన్సువాడ, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌అర్బన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేశారు. ఈ పార్టీతో పాటు బీఎస్పీ నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబరు నుంచి వచ్చే సాధారణ ఎన్నికల సమయం వరకు నియోజకవర్గాల్లో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు.

సంక్షేమ పథకాల అమలులో అగ్రగామి

నవీపేట: సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. గురువారం మండలంలోని నాళేశ్వర్‌, తుంగినిలలో జరిగిన ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం బినోలా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, రాంకిషన్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజితా యాదవ్‌, ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, జడ్పీటీసీ సవిత, వైస్‌ ఎంపీపీ హరీష్‌కుమార్‌, బినోలా సొసైటీ చైర్మన్‌ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలువకపోతే రాజీనామా చేస్తా..

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలువకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. గురువారం మండలంలోని నాళేశ్వర్‌లో జరిగిన ‘మన ఊరు మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పడగొట్టడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Updated Date - 2022-10-28T00:18:47+05:30 IST