బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి

ABN , First Publish Date - 2022-10-27T02:02:21+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి

నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 26: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతిఒక్కరిపై ఉందన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల సమావేశమందిరంలో జడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. బాలల హక్కులపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమం నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి వాటిని ప్రోత్సహించడం చట్టరీత్య నేరమని అన్నారు. బాలలపై ఆకృత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దని, బాలలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు చొరవచూపాలని, సమస్య తీవ్రతను బట్టి జిల్లా కమిటీ దృష్టికి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసిందని తల్లిదండ్రులు ఆడపిల్లలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా తోడ్పాటునందిస్తుందన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి.. జిల్లాలో మండల, గ్రామ, వార్డుస్థాయిల్లో వారం రోజుల్లో బాలల పరిరక్షన కమిటీలను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. అన్ని నివాస ప్రాంతాల్లోని 18 సంవత్సరాలలోపు బాలబాలికల పేర్లు, ఆధార్‌, తల్లిదండ్రుల పేర్లు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారో వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా పక్కాగా సేకరించాలన్నారు. వారం పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రాంతాల్లో ఉండే బాలలను గుర్తించి ఆనంద నిలయంలో చేర్పించాలన్నారు. బాల్యవివాహాలను అరికడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేదింపులను నిరోదించేందుకు ఆయాశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మావతి, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి సౌందర్య, జడ్పీ సీఈవో గోవింద్‌, జిల్లా బాలల రక్షణ అధికారి చైతన్య, ఏసీపీ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-27T02:02:27+05:30 IST