రాజ్యాంగం అమలు దినోత్సవం రోజే.. గొత్తికోయల గ్రామ బహిష్కరణ
ABN , First Publish Date - 2022-11-26T19:07:44+05:30 IST
పౌరులు దేశంలో ఎక్కడైయినా జీవించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఓ గ్రామం నుంచి గిరిజనులైన గొత్తికోయలను బహిష్కరించారు.
భద్రాచలం: పౌరులు దేశంలో ఎక్కడైయినా జీవించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఓ గ్రామం నుంచి గిరిజనులైన గొత్తికోయలను బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) నుంచి వలసవచ్చిన 40 కుటుంబాలకు చెందిన సుమారు 200మంది గొత్తికోయలు బెండాలపాటు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం కొన్నేళ్ల కిత్రం ఓటు హక్కు, ఆధార్‌కార్డులు ఇచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం బెండాలపాడు గ్రామపరిధిలో అటవీ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు గురికావడంతో ఆ గ్రామ పరిధిలో ఉండే గొత్తికోయలే ఈ హత్య చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు గొత్తికోయలనుంచి ప్రాణహాని ఉందని, వారిని గ్రామంనుంచి బహిష్కరించాలని శనివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామకార్యదర్శి సమక్షంలో బెండాలపాడు ప్రజలు గ్రామసభ నిర్వహించి తీర్మానం చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి పంపించాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. బహిష్కరణ తీర్మాన పత్రంపై ఆ గ్రామ సర్పంచ్ కూసం వెంకటేశ్వర్లుతో పాటు గ్రామ కార్యదర్శి సతీష్ సంతకాలు చేశారు. అయితే ఈ చర్యలను పలువురు తప్పు పడుతున్నారు. ఎవరైనా తప్పుచేస్తే వారిని చట్ట ప్రకారం శిక్షించాలనే తప్ప ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఇటువంటి చర్యలకు పూనుకోవటం నేరమని పేర్కొంటున్నారు. ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై చండ్రుగొండ ఎంపీడీవో అన్నపూర్ణ, తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ గొత్తికోయలపై బహిష్కరణ చర్యలకు పాల్పడవారిపై చర్యలకు ఉన్నతాధికారుకు నివేదిస్తామన్నారు.