ఇనాం భూములు కొన్నోళ్ల గుండెల్లో రైళ్లు!
ABN , First Publish Date - 2022-11-26T03:49:57+05:30 IST
యాజమాన్య హక్కు పత్రం (ఓఆర్సీ- ఓనర్ షిప్ రైట్స్ సర్టిఫికెట్) లేకుండా ఇనాందారుల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు
యాజమాన్య హక్కు పత్రంపై హైకోర్టు తీర్పుతో ఆందోళన
భూమిని వదులుకోవాలేమోనని భయం
ఐదు లక్షల ఎకరాలకుపైగా
చేతులుమారిన ఓఆర్సీ లేని భూములు
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): యాజమాన్య హక్కు పత్రం (ఓఆర్సీ- ఓనర్ షిప్ రైట్స్ సర్టిఫికెట్) లేకుండా ఇనాందారుల నుంచి భూమిని కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇనాందారుల నుంచి భూమి కొన్న వారు ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని రాష్ట్ర హైకోర్టు నవంబరు 21న ఇచ్చిన తీర్పే ఇందుకు కారణం. యాజమాన్య హక్కు పొందే వీలు లేకపోవడంతో ఆయా కొనుగోలుదారుల కంటిపై కనుకు లేకుండా పోయింది. ఏళ్లుగా అనుభవిస్తున్న భూమిని వదులుకోవాల్సి వస్తుందనే ఆందోళన పెరిగింది. ఇనాం రద్దు చట్టం-1955 ప్రకారం నిజాం రాజులు ఇనాందారులకు ఇచ్చిన భూములన్నీ ప్రభుత్వానికి సంక్రమించాయి. ఇనాందారుల వారసులు, కొన్ని కేటగిరీల్లో వారికి యాజమాన్య హక్కు పత్రాలిచ్చారు. ఓఆర్సీ పొందిన కొందరు తమ అవసరాల మేరకు భూమిని విక్రయించారు. మరికొందరు ఓఆర్సీ లేకుండానే తమ ఆధీనంలో ఉన్న భూమిని అమ్మేశారు. ఆయా కొనుగోలుదారులు ఏళ్లుగా ఆ భూములను అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మ డి పది జిల్లాలో 8,05,618 ఎకరాల ఇనాం భూమికి92,250 మంది ఇనాందారులు ఉన్నట్లు 1966లో జాతీయ భూసంస్కరణల అమలు కమిటీ పేర్కొంది. ఇనాం భూములకు ఓఆర్సీ పొందేందుకు ఇనాం దారుల వారసులు మాత్రమే అర్హులని హై కోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే దాదాపు 6 లక్షల ఎకరాల భూమి చేతులు మారినట్లు తెలుస్తోంది.