పూటకోమాట!

ABN , First Publish Date - 2022-09-15T08:51:39+05:30 IST

కేంద్ర సర్కారు తాను ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు తొలి ముసాయిదాలో మీటర్ల ప్రస్తావన తెచ్చింది.

పూటకోమాట!

  • సాగు మోటార్లకు మీటర్లపై కేంద్రం దోబూచులాట
  • మీటర్లు పెట్టాలని విద్యుత్తు సవరణ బిల్లులో ప్రతిపాదన
  • విమర్శలతో రెండో ముసాయిదాలో ఉపసంహరణ
  • మూడేళ్లలో వ్యవసాయ కనెక్షన్లన్నింటికీ 
  • మీటర్లు పెట్టాలని జాతీయ విద్యుత్తు పాలసీలో నిబంధన
  • జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాలకు, మీటర్లకు 
  • లంకె పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ
  • రీ వ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో మళ్లీ ప్రస్తావన 
  • ప్రతి కొత్త కనెక్షన్‌కు ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలని 
  • ఎలక్ట్రిసిటీ రైట్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ రూల్స్‌లో షరతు


వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని కేంద్రం అంటోందని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో సాగు మోటార్లకు మీటర్ల ప్రస్తావన ఉందని, తాను చెప్పిన విషయం అబద్ధమైతే రాజీనామాకు సిద్ధమని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లులో ఈ మాట ఉంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ మీటర్ల గోల ఏమిటి? వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై కేంద్రంలోని బీజేపీ ధోరణి ఏమిటి? దానిపై సీఎం కేసీఆర్‌ చెబుతున్న అభ్యంతరాలు ఏమిటి? 


హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సర్కారు తాను ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు తొలి ముసాయిదాలో మీటర్ల ప్రస్తావన తెచ్చింది. అయితే సర్వత్రా విమర్శలు రావడంతో తొలగించింది. విద్యుత్తు సవరణ బిల్లులో ప్రస్తుతం ఆ అంశం లేనప్పటికీ కేంద్రం వెలువరించే పలు విధానాల్లో మీటర్లు విధిగా పెట్టాల్సిందే అనే నిబంధనలు ఉన్నాయి. తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, విపక్షాల నిరసనలతో స్టాండింగ్‌ కమిటీకి చేరిన విద్యుత్తుసవరణ బిల్లు-2022లో కూడా డిస్కమ్‌లు సరఫరా చేసే కరెంట్‌కు అయ్యే పూర్తి వ్యయాన్ని వసూలు చేసుకోవాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం బిల్లు గనుక పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. పరోక్షంగా దాన్ని అనుసరించి, విడుదల చేసే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడికి మీటర్‌ బిగించి, ఆ వినియోగదారుడి కి కరెంట్‌ అందించడానికి అయ్యే పూర్తి వ్యయం వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ నిబంధన అమలు చేయాలన్నా రాష్ట్రంలోని విద్యుత్తు నియంత్రణ మండలి ఆమోదం/రాష్ట్రప్రభుత్వ పరోక్ష అంగీకారం తప్పనిసరి. వివాదాలు, వాదనల నేపథ్యంలో వాస్తవాలేమిటి అనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


2020 ఏప్రిల్‌ 17(విద్యుత్తు చట్ట 

సవరణ తొలి ముసాయిదా బిల్లు)

దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు విద్యుత్తు సబ్సిడీలను చెల్లించే విధానం అమల్లో ఉంది. తెలంగాణలో డిస్కంలు సబ్సిడీపై గృహ వినియోగదారులకు తక్కువ టారి్‌ఫతోనూ, వ్యవసాయానికి ఉచితంగానూ విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీతోనే సెలూన్లు, దోభీ ఘాట్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందుతోంది. కానీ ఇకపై వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యుత్తు సబ్సిడీలను అందించాలని 2020 ఏప్రిల్‌ 17న తెచ్చిన విద్యుత్తు చట్ట సవరణ తొలి ముసాయిదాలో కేంద్రం పొందుపర్చింది. విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారం వినియోగదారులకు బిల్లులను జారీ చేయాలని విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌-65కు సవరణలను ప్రతిపాదించింది. దీంతో బిల్లుల జారీ కోసం వ్యవసాయ పంపుసెట్లకు సైతం మీటర్లను ఏర్పాటు చేయాల్సి రానుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఇప్పటివరకు ప్రభుత్వ విద్యుత్తుసబ్సిడీలతో ప్రయోజనం పొందుతున్న రైతులు, గృహ, ఇతర వినియోగదారులు సబ్సిడీ లేకుండా తమ పూర్తిస్థాయి బిల్లులను ప్రతినెలా డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం నేరుగా వినియోగదారులకు సబ్సిడీలను బదిలీ చేయాల్సి ఉంటుంది. రైతులు, గృహాలు, ఇతర సబ్సిడీ వినియోగదారులకు ఇది భారంగా మారుతుందని తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ర్టాలు అప్పట్లో నిరసన వ్యక్తం చేశాయి.


2021 ఫిబ్రవరి 5 (విద్యుత్తు చట్ట సవరణ 

రెండో ముసాయిదా బిల్లు-2021)

2020 ఏప్రిల్‌ 17న కేంద్రం ప్రకటించిన విద్యుత్తు చట్ట సవరణ తొలి ముసాయిదా బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. 2021 ఫిబ్రవరి 5న రాష్ట్రాలకు పంపిన ‘విద్యుత్తు చట్ట సవరణ రెండో ముసాయిదా బిల్లు-2021’లో సెక్షన్‌-65కు సవరణలేవీ ప్రతిపాదించలేదు. దీంతో ప్రస్తుత విద్యుత్తుసబ్సిడీల విధానంపై తొలి ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన సవరణలను కేంద్రం ఉపసంహరించుకుంది. 


2020 డిసెంబరు 31 

(కొత్త విద్యుత్తు కనెక్షన్లకు మీటర్‌ తప్పనిసరి)

మీటర్‌ లేకుం?డా ఎలాంటి కొత్త విద్యుత్తు కనెక్షన్‌ జారీ చేయరాదు. స్మార్ట్‌ మీటర్‌/ప్రీపెయిడ్‌ మీటర్‌తోనే కొత్త కనెక్షన్‌ ఇవ్వాలి’ అని 2020 డిసెంబరు 21న కేంద్ర విద్యుత్తు శాఖ విద్యుత్తు వినియోగదారుల హక్కుల నిబంధనలు-2020 ప్రకటించింది. కొత్తగా ఏ కనెక్షన్‌ జారీ చేసినా... ఆ కనెక్షన్‌కు మీటర్‌ ఉండాలి. అది కూడా ప్రీపెయిడ్‌ మీటర్‌ ఉండాలని ఈ నిబంధనల్లో ఉంది. దీన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబంధనలు చదివి వినిపించారు.  ఈ నిబంధన దేశంలో యథాతథంగా అమల్లో ఉంది. 


2021 ఏప్రిల్‌ 27( జాతీయ విద్యుత్తు 

ముసాయిదా విధానం-2021)

జాతీయ విద్యుత్తు ముసాయిదా విధానాన్ని 2021 ఏప్రిల్‌ 27న కేంద్ర విద్యుత్తు శాఖ ప్రకటించి అన్ని రాష్ట్రాల సూచనలు కోరింది. ముసాయిదా విధానంలోని సెక్షన్లు-7.17, 7.18లు వ్యవసాయం సహా 100 శాతం వినియోగదారులకు మూడేళ్లలోగా ప్రీపెయిడ్‌ మీటర్లను బిగించాలని పేర్కొంటున్నాయి. వినియోగదారులందరికీ మీటర్లు బిగించాలని విద్యుత్తు చట్టంలోని 43, 45 సెక్షన్లు పేర్కొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మీటర్ల బిగింపులో ఎలాంటి పురోగతి లేదని ఈ ముసాయిదాలో కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది.  


2021 జూన్‌ 9 (పంపుసెట్లకు మీటర్లు 

పెడితే అదపు రుణానికి అనుమతి)

సంస్కరణల అమలుతో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు తగ్గించుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలు 2021-22 నుంచి 2024-25 వరకు ఐదేళ్లపాటు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతం అదనపు రుణాలను తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎంలో అనుమతిస్తామని ప్రకటించారు. ఈ కింది సంస్కరణల అమలులో రాష్ట్రాలు చూపిన ప్రతిభ ఆధారంగా అదనపు రుణ సదుపాయాన్ని కల్పిస్తామంటూ 2021 జూన్‌ 9న ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ నిబంధనల అమలు తప్పనిసరి కాదు. రాష్ట్రాలే వీటిపై నిర్ణయం తీసుకోవచ్చు. దీనికి పొరుగు రాష్ట్రం ఏపీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించి... శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టగా... ఆ మీటర్లను రైతులు కుప్పగా పోసి... చేసిన నిరసనల ఫొటోలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో సభ్యులకు చూపించారు.

 

2021 అక్టోబరు 6

(మూడేళ్లలో అందరికీ మీటర్లు)

డిస్కంలు సరఫరా చేసే విద్యుత్తు కచ్చితమైన ఆడిట్‌ నిర్వహించేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలోని ‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ’ 2021 అక్టోబరు 6న కొత్త ఆడిట్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రతి మూడునెలలకు వ్యవసాయంతో సహా అన్ని రకాల కేటగిరిల వినియోగదారుల వినియోగం ఎన్నో లెక్కలు కేంద్రానికి పంపించాలి. కేటగిరీల వారీగా బిల్లులు జారీ చేసే విద్యుత్తు ఎంత? వచ్చే సబ్సిడీలు ఎంత?  మీటర్‌ ఉన్న వినియోగదారులకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది? మీటర్‌ లేని వ్యవసాయ వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తుందో వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(ఎనర్జీ ఆడిట్‌ నిబంధనలు)- 2022ను గత జూన్‌ 22న కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది.  ఎవరెంత విద్యుత్తు వినియోగిస్తున్నారో కచ్చితంగా తెలిసేలా వినియోగదారులందరికీ దశలవారీగా వచ్చే మూడేళ్లలో కమ్యూనికెబుల్‌ మీటర్లు బిగించాలని ఇందులో పేర్కొంది.

 

2021 డిసెంబరు 3 

(వ్యవసాయ కనెక్షన్లకు ఐచ్ఛికం)

దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ కోసం కేంద్ర విద్యుత్తు శాఖ రివాంప్డ్‌ డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డీఎ్‌సఎ్‌స)ను 2021 జూలై 29న ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన తుది మార్గదర్శకాలను 2021 డిసెంబరు 3న వెల్లడించింది. ఈ పథకం ప్రకారం తొలి విడతలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతాలు, 15 శాతానికిపైగా విద్యుత్తు నష్టాలుగల అమృత్‌ నగరాలు, 15 శాతానికిపైగా విద్యుత్తు నష్టాలు కలిగి 50 శాతం పట్టణ జనాభా కలిగిన  ప్రాంతాల్లోని అందరు వినియోగదారులతోపాటు అన్ని ప్రాంతాల్లోని పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ కార్యాలయాలకు 2023 డిసెంబర్‌ నాటికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలి. అయితే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అనేది ఐచ్ఛికం. డిస్కంలు ఆప్షనల్‌గా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టుకోవచ్చు.



వ్యవసాయ వినియోగం కొండంత.. సబ్సిడీ గోరంత..

‘సాగుకు ఒక యూనిట్‌ విద్యుత్తును అందించడానికి అయ్యే వ్యయం (2022-23లో) రూ.9.20లు.. అదే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల యూనిట్‌కు డిస్కమ్‌లకు వచ్చేది రూ.1.06లు.. అంటే ఒక యూనిట్‌ కరెంట్‌ వ్య వసాయ పంపుసెట్లకు అందించడం వల్ల రూ.8.14లు నష్టం’ ఇవీ ఎవరో చెప్పిన లెక్కలు కావు. దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌) తెలంగాణ రాష్ట్ర వి ద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి అందించిన నివేదికలోని వాస్తవాలు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ చార్జీలు పెంచే క్రమంలో ఏ వర్గాల నుంచి ఏ మేర ఆదాయం వస్తుంది? ఏ వర్గాల కు కరెంట్‌ అందించడానికి అయ్యే వ్యయం ఎంత అనే లెక్కలు సమగ్రంగా తీయగా.. ఈ వివరాలు బయటపడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11182 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయ పంపుసెట్లకు అందించాల్సి ఉంటుందని అంచనావేసిన ఎస్పీడీసీఎల్‌, దీనివల్ల ప్రభుత్వం నుంచి రూ.1130 కోట్ల మేర సబ్సిడీ వస్తుందని పేర్కొంది. 


వాస్తవానికి వ్యవసాయ విద్యు త్తు వినియోగం పెరిగినా.. ఆ మేరకు సబ్సిడీ ఇవ్వడం లేదనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి. ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీల్‌)లో 2022-23లో సాగు విద్యుత్తు కు 7525 మిలియన్‌ యూనిట్లు అవసరమని అంచనా వేశారు.  దీనికి ప్రభుత్వంఇచ్చే సబ్సిడీ రూ.3285 కోట్లు కాగా.. వినియోగదారుల చార్జీ ల రూపేణా వచ్చేది రూ.56 కోట్లు కలుపుకొని ఎన్పీడీసీఎల్‌కు రూ.3340 కోట్ల ఆదాయం రానుంది. ఎన్పీడీసీఎల్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ కరెంట్‌ అందించడానికి రూ.8.96 యూనిట్‌కు అవుతుండగా వచ్చే ఆదాయం సబ్సిడీ, ఇతరత్రా రూపేణా కలుపుకొని యూనిట్‌కు రూ.4.44లు రానున్నాయని లెక్క తీశారు. ఇక సాగు విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రం మెలికల వెనుక డిస్కమ్‌ల స్వయం కృతపరాదమూ ఉంద నే విమర్శలున్నాయి. డిస్కమ్‌లు తమ లోపాలను కప్పిపుచ్చడానికి నష్టాలను సాగు విద్యుత్తు ఖాతాలోనే జమచేస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.  

Updated Date - 2022-09-15T08:51:39+05:30 IST