రామచంద్రభారతి విడుదల

ABN , First Publish Date - 2022-12-10T03:10:28+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు.

రామచంద్రభారతి విడుదల

హైదరాబాద్‌, సైదాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంతవరకు ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బయటకు వచ్చిన వెంటనే అప్పటికే జైలు బయట వేచి ఉన్న వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. ఈ కేసులో గురువారమే బెయిల్‌పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చిన రామచంద్రభారతితో పాటు మరో నిందితుడు నందకుమార్‌లను బంజారాహిల్స్‌ పోలీసులు ఇంకో కేసులో అరెస్ట్‌ చేశారు. బోగస్‌ ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసె్‌స్సలు కలిగి ఉన్నారంటూ కేసు పెట్టారు. విచారణ అనంతరం పోలీసులు సాయంత్రం వీరిద్దరని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రామచంద్రభారతికి బెయిల్‌ మంజూరు చేస్తూ రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ష్యూరిటీలు సమర్పించడం అలస్యం కావడంతో ఆయనతో పాటు నందకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ పత్రాలు అందడంతో ఉదయం 7.30 గంటల సమయంలో విడుదలయ్యారు. నందకుమార్‌పై ఇతర కేసులు ఉండటంతో మేజిస్ర్టేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఏ3 సింహయాజి బుధవారం విడుదలైన విషయం తెలిసిందే.

రామచంద్ర భారతి ఉన్న బ్యారక్‌లోకి నందు..!

ఏ-1 రామచంద్ర భారతి చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో 40 రోజులపాటు ఉన్న బ్యారక్‌లోకి ఇప్పుడు నందకుమార్‌ వెళ్లాడు. తొలి కేసులో రామచంద్ర భారతిని గోదావరి బ్యారక్‌లో, నందును కృష్ణ బ్యారక్‌లో ఉంచారు. రెండో కేసులో మాత్రం గతంలో రామచంద్ర భారతి ఉన్న గోదావరి బ్యారక్‌లో ప్రస్తుతం నందును ఉంచారు. హైకోర్టు విధించిన షరతుల ప్రకారం నిందితులు ప్రతి సోమవారం సిట్‌ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. దాంతో బెయిల్‌పై విడుదలైన రామచంద్రభారతి, సింహయాజి ఇద్దరు సోమవారం బంజారహిల్స్‌లోని సిట్‌ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరుకానున్నారు. కేరళకు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు సమాచారం.

Updated Date - 2022-12-10T03:10:29+05:30 IST