బైబై.. గణేశా
ABN , First Publish Date - 2022-09-10T05:05:16+05:30 IST
బైబై.. గణేశా
- గంగమ్మ ఒడిలోకి గణనాథులు
- వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఘనంగా వినాయక నిమజ్జనం
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్, సెప్టెంబరు 9 : విఘ్నాలను తొలగించే గణనాథుడు మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాతో పాటు, వికారాబాద్ జిల్లాలోని పరిగి, కొండగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లో తొమ్మిదో రోజు జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అశేష భక్తజనావళితో నవరాత్రులు విశేష పూజలందుకున్న లంబోదరుడు మళ్లొచ్చే ఏడాది వస్తానంటూ భక్తులకు వీడ్కోలు పలికాడు. కోలాటాలు, మంగళహారతులతో నిమజ్జనోత్సవానికి బయల్దేరిన గణనాఽథులను మహిళలు వాడవాడలా ఎదురేగి సాగనంపారు. భారీ ఏర్పాట్ల మధ్య శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా గణనాథుడి చేతిలోని లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ వినాయక లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో రూ.2.61 లక్షలకు బీసీ మల్లయ్య గౌడ్ కైవసం చేసుకున్నారు. పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలో లడ్డూనూ రూ.2.25లక్షలకు మంగలి శ్రీనివాస్ దక్కించు కున్నాడు. కాగా మోమిన్‌పేట మండలం, టేకులపల్లి హనుమాన్ యూత్ వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని రూ.7,100లకు ముస్లిం యువకుడు ఫయాస్ దక్కించుకున్నాడు.