రూ.వంద కోట్లతో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధి
ABN , First Publish Date - 2022-11-13T23:49:06+05:30 IST
దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
కీసర రూరల్, నవంబరు 13: దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ 9, 11, 13, 14, 15 వార్డుల్లో రూ.7.11కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో దమ్మాయిగూడ, నాగారం, జవహర్‌నగర్ మున్సిపాలిటీల్లో పనులు చేపట్టేందుకు రూ.వందల కోట్లు వెచ్చిస్తామన్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు పరిసర ప్రాంతాల అన్ని ప్రధాన రోడ్లను వంద అడుగులకు విస్తరిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డు దిగువనున్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దమ్మాయిగూడలో రూ.7కోట్లు, నాగారంలో రూ. 8కోట్లతో పైపులైన్ వేస్తామని చెప్పారు. పాలకులు ప్రజలతో మమేకం కావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మల్లారెడ్డి సూచించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ వి.ప్రణిత, వైస్‌చైర్మన్ నరేందర్‌రెడ్డి, కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కుల వృత్తుల వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కీసర: కుల వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కీసరగుట్టలో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం పా ల్గొన్నారు. రాష్ట్రంలోని కుల వృత్తుల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి అన్నారు. గొల్ల కురుమలకు గొర్లను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మల్లేశం మాట్లాడుతూ.. గొల్ల, కురుమలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. జిల్లాలో కురుమ సంఘం భవన నిర్మాణానికి ఎకరం స్థలం, నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి నివేదిస్తానన్నా రు. అనంతరం మంత్రి, మల్లేశం సహపంక్తి భోజనాలు చేశారు.