Palamuru : ‘పాలమూరు’ గట్టెక్కేనా..!?
ABN , First Publish Date - 2022-11-04T05:56:04+05:30 IST
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైడ్రాలజీ అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) ఆశ్రయించింది. ఈ పథకానికి రెండో దశ
హైడ్రాలజీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి..
అవి దక్కితేనే పర్యావరణ అనుమతులు
హైదరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైడ్రాలజీ అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) ఆశ్రయించింది. ఈ పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఇటీవలే పక్కనపెట్టింది. నీటి లభ్యతపై విధిగా నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఈ పథకం ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇవ్వడానికి వీలుగా పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ ఇస్తామని తెలంగాణ తెలిపింది. అందుకోసం ఈ నెల 18 నుంచి 21 మధ్యలో సమయం ఇవ్వాలని కోరగా సీడబ్ల్యూసీ నుంచి సమాధానం రాలేదు. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి వీలుగా 60 రోజుల పాటు రోజుకు 1.5 టీఎంసీల నీటిని తరలించేలా 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌లో 8.51 టీఎంసీలు, ఏదులలో 6.55, వట్టెంలో 16.74, కరివెనలో 17.34, ఉద్దండాపూర్‌లో 16.03 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉండడంతో సీడబ్ల్యూసీ అనుమతులు ముఖ్యమని ఈఏసీ గుర్తు చేసింది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీల నీటిని కేటాయించుకుంటూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌పై అభ్యంతరం తెలుపుతూ సీడబ్ల్యూసీకి ఏపీ లేఖలు రాసింది. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ నీటిని వాడుకోవడానికి ఇచ్చిన వెసులుబాటుపై బ్రిజే్‌షకుమార్ ట్రెబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున, తీర్పు వెలువడేదాకా పాలమూరుకు అనుమతి ఇవ్వకూడదని ఏపీ కోరుతోంది. ఇక ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ నేతృత్వంలోని కమిటీ వేసిన జరిమానా సహేతుకమైందా? కాదా? వంటి అంశాలను తేల్చడానికి గౌరప్పన్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆయన కూడా పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పరిశీలించిన తర్వాతే జరిమానాపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గట్టెక్కుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.