Munugode Bypoll: అసత్య సర్వే రిపోర్ట్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కన్నెర్ర
ABN , First Publish Date - 2022-11-01T18:58:49+05:30 IST
హైదరాబాద్: మునుగోడు (Munugode) ఉపఎన్నికల నేపథ్యంలో అంతరిక సర్వేక్షణ సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన నకిలీ పత్రం ద్వారా..
హైదరాబాద్: మునుగోడు (Munugode) ఉపఎన్నికల నేపథ్యంలో అంతరిక సర్వేక్షణ సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన నకిలీ పత్రం (Forgery document) ద్వారా ప్రజలను గందరగోళ పరచడానికి సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) మండిపడింది. తాము అటువంటి సర్వే ఏదీ నిర్వహించలేదని స్పష్టం చేస్తూ, ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యక్తి నిర్మాణము ద్వారా దేశ వైభవము సాధించాలనే మౌలికమైన లక్ష్యముతో 97 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ అని, సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాలుపంచుకోదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ నిర్భయంగా, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది.
సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థ అయిన తమపై ఇటీవల కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన, అసత్యమైన వార్తలు, కథనాలు, వ్యాఖ్యానాల ద్వారా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేయడం సరికాదని ఆర్ఎస్ఎస్ హెచ్చరించింది. ఈ విధంగా వ్యవహరించడం బాధ్యతాయుతమైన ఏ సంస్థకుగాని, వ్యక్తికి గాని తగదని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని, సామాజిక విలువలను అగౌరపరచడమే అవుతుందని సంఘ్ అభిప్రాయపడింది. ఈ నకిలీ పత్రం ద్వారా జరుగుతున్న తప్పుడు వార్తలకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట బద్దమైన చర్యలు తీసుకోవాలని కాచం రమేశ్ ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.