‘రైస్‌’ రగడ

ABN , First Publish Date - 2022-03-22T09:37:04+05:30 IST

ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) ఇస్తాం.. తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. అదేం కుదరదు ముడి బియ్యం (రా రైస్‌) మాత్రమే తీసుకుంటామని కేంద్రం తేల్చిచెప్పడం.. మొత్తానికి బియ్యం సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న..

‘రైస్‌’  రగడ

  • ‘డీసీపీ’పై తెలంగాణ వైఖరేంటో?
  • ఎంవోయూ నుంచి బయటకు వస్తుందా?
  • రాష్ట్ర సర్కార్‌ నిర్ణయంపై సర్వత్రా చర్చ


హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) ఇస్తాం.. తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం.. అదేం కుదరదు ముడి బియ్యం (రా రైస్‌) మాత్రమే తీసుకుంటామని కేంద్రం తేల్చిచెప్పడం.. మొత్తానికి  బియ్యం సేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. గడిచిన మార్కెటింగ్‌ సీజన్‌తోపాటు యాసంగి సీజన్‌ ఆరంభంలో ఇరు ప్రభుత్వాల మధ్య జరిగిన రచ్చ అంతాఇంతాకాదు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం తేల్చిచెప్పడంతో.. యాసంగిలో వరి సాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ రైతులు వరి సాగు చేయటం, మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుండటంతో.. ధాన్యం కొనుగోలు అంశాన్ని సీఎం కేసీఆర్‌ మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ‘డీ సెంట్రలైజ్‌డ్‌ ప్రొక్యూర్మెంట్‌ సిస్టమ్‌(డీసీపీ- వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ)’లో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం అనుసరించే వైఖరి ఏమిటి? కేంద్రంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందం మేరకు ‘డీసీపీ’లో తెలంగాణ కొనసాగుతుందా? లేకపోతే ఎంవోయూ నుంచి బయటకు వస్తుందా? అనేది ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


కేంద్రం 2012 సెప్టెంబరు 13 తేదీన డీసీపీని   తెచ్చింది. ఆ ప్రకారం కేంద్రం నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలే కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. ఆ ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కింద రైస్‌మిల్లర్లకు అప్పగించి, మిల్లింగ్‌ చేయించి.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తాయి. ఇందుకు కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు చెల్లిస్తుంది. డీసీపీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 23 రాష్ట్రాలున్నాయి. ప్రధానంగా 15 రాష్ట్రాల నుంచి బియ్యం, 8 రాష్ట్రాల నుంచి గోధుమలను భారత ఆహార సంస్థ సేకరిస్తుంది. రాష్ట్రాల నుంచి తీసుకున్న బియ్యాన్ని.. కేంద్రం ‘ఆహారభద్రత చట్టం’ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వలు అధికంగా ఉంటే.. వాటిని కూడా సెంట్రల్‌ పూల్‌ కింద ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుంది.


‘డీసీపీ’ని ఉల్లంఘించినట్లే!

డీసీపీ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఎఫ్‌సీఐ టార్గెట్‌కు అనుగుణంగా బియ్యం సరఫరా చేయాలనే నిబంధన ఉంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంవోయూ కూడా ఉంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అయితే ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవటానికి నిరాకరిస్తున్నదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోదని సీజన్‌ ప్రారంభంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేశంలో బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో.. ఏ రాష్ట్రం నుంచి కూడా బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదని, ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణకు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం అంటే డీసీపీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ఎఫ్‌సీఐ సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


ప్రొక్యూర్మెంట్‌ ఇష్టంలేకపోతే.. ఎంవోయూ నుంచి బయటకు వెళ్తామని కేంద్రానికి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తుందా? డీసీపీ నుంచి బయటకొచ్చే సాహసం చేస్తుందా? బయటికొస్తే పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఎంవోయూ ఉల్లంఘనకు పాల్పడితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రైతులకు మద్దతు ధర ఎలా అందుతుంది? ఈ యాసంగిలో రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలున్నాయి. దీంతో ధాన్యాన్ని ఎవరు కొనుగోలుచేస్తారు? అన్నప్రశ్నలు ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ అధికారుల నుంచే వ్యక్తమవుతున్నాయి.


పౌరసరఫరాల సంస్థ మనుగడ ప్రశ్నార్థకం!

తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకంటే.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. సేకరించిన ధాన్యంపై 2.5ు కమీషన్‌ రూపంలో చెల్లిస్తుంది. నిరుడు యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,914 కోట్ల విలువైన 92.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌరసరఫరాల సంస్థకు రూ.447.85 కోట్ల ఆదాయం వచ్చింది. కార్పొరేషన్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణ, డీసీవోల ఖర్చులు, రవాణా చార్జీలు, కంప్యూటర్‌ ఆపరేటర్ల వేతనాలకు కూడా ఈ నిధుల నుంచే చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కూడా వేతన గ్రాంటు ఇవ్వటంలేదు. ఒకవేళ ధాన్యం సేకరణను నిలిపివేస్తే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారక తప్పదు.

Updated Date - 2022-03-22T09:37:04+05:30 IST