Munugode: మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2022-10-30T17:31:10+05:30 IST
మునుగోడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
మునుగోడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరులో జరిగిన టీఆర్ఎస్ రణభేరీ సభలో ఆయన మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ విశ్వగురువు కాదని విష గురువని కేసీఆర్ చెప్పారు. దేశ కరెన్సీ అధ్వానంగా పడిపోవడానికి కారకులెవరని ఆయన సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన వారికి ఓటెయ్యవద్దని సూచించారు. వడ్లు కొనుడు చేత కాని వారు ఎమ్మెల్యేలను మాత్రం కొంటారని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర విధానాలతో కరెంట్, నీళ్లు రావని చెప్పారు. రైతులపై కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. 14 లక్షల కోట్లు కార్పొరేట్లకిస్తారు కానీ రైతులకు విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. కేంద్రం తీసుకువస్తోన్న విద్యుత్ సంస్కరణల వెనుక మోసం ఉందన్నారు. నేతన్నలపై జీఎస్టీ వేసిన బీజేపీకి ఓటు వేయొద్దని కేసీఆర్ చెప్పారు.
మునుగోడులో గెలిచినోడు పత్తాలేకుండా పోయాడని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ చురకలంటించారు. అదే సమయంలో నాడు ఓడిన ప్రభాకర్ రెడ్డి నేడు ప్రజల మధ్యే ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ గెలిస్తే అరాచకాలు తలెత్తుతాయని, తర్వాత ఏమీ చేయలేమని కేసీఆర్ చెప్పారు. వంద కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్నారని, అయితే తమ ఎమ్మెల్యేలు ఆ ఆఫర్లను తిరస్కరించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని చెప్పారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ సభకు పరిచయం చేస్తూ వారికి చప్పట్లు కొట్టాలని సభకు హాజరైన వారిని కోరారు. రెండుసార్లు ప్రధానిగా చేసిన మోదీకి ఇంకా ఏం కావాలని, ఎందుకు అరాచకాలు చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో విచారణ జరగాలన్నారు. ఢిల్లీ పీఠం బద్దలవ్వాల్సింది చానా ఉందన్నారు. మున్ముందు విచారణలో తేలుతుందని చెప్పారు.