Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2022-11-09T16:37:07+05:30 IST

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరైంది.

Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
Raja Singh

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్‌ (Raja Singh)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పీడీ యాక్ట్‌ను ఎత్తివేసింది. అంతేకాదు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. మూడు నెలలు పాటు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకూడదని ఆదేశించింది. జైలు నుంచి రిలీజ్ అయ్యే సందర్భంలో ఏలాంటి ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేసింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలాంటి అభ్యంతరకర పోస్ట్‌లు, కామెంట్స్ చేయకూడదని ఆదేశించింది. రాజాసింగ్‌పై ఆగస్టు 25 తేదీన పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు.

రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ నిన్న హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ విధించడంపై హైకోర్టులో నిన్న వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇప్పటికే 101 కేసులు ఉన్నాయని, అందులో18 కేసులు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా చేసిన కేసులు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో రాజసింగ్ బయటికి వస్తే లా ఆర్డర్ సమస్య తలెత్తుతుందన్నారు. గతంలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో ఓ వర్గం వారు నిరసనలు తెలియజేశారని ఏజీ హైకోర్టుకు గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాజసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం సరైనదేనని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ వాదించారు.

మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవి చందర్ వాదించారు. రాజాసింగ్ ఏ మతాన్నీ కించపరిచలేదని, ఏ మతాన్ని టార్గెట్ చేయలేదని వివరించారు. కేవలం బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త అనే పదాన్ని ఎక్కడ కూడా రాజాసింగ్ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష తోనే రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేశారని చెప్పారు. నాంపల్లి కోర్టు రీమాండ్ చెల్లదని రిజెక్ట్ చేసిందని, అందుకే పీడీ యాక్ట్‌ను పోలీసులు నమోదు చేశారని రవి చందర్ కోర్టుకు తెలిపారు.

మునావర్‌ ఫారూఖీ షోకు అనుమతిపై రాజాసింగ్ మండిపాటు

హిందూ దేవతలను కించపరిచిన వివాదాస్పద స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ షో తెలంగాణలో జరిగితే.. తాను చేసే పనికి ఇబ్బంది తప్పదంటూ ఈ ఏడాది ఆగస్ట్‌లో రాజాసింగ్‌ హెచ్చరించారు. అయినా తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించి మునావర్‌ ఫారూఖీ షోకు అనుమతిచ్చింది. దీనిపై మండిపడిన రాజాసింగ్ ఆగస్ట్ 22న ఓ కామెడీ వీడియో విడుదల చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రజలు హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టారు. దీంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేశారు.

Updated Date - 2022-11-09T18:17:07+05:30 IST