Trs Vs Bjp: యాడ్స్ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-09-13T23:21:23+05:30 IST
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా నిర్వహించేందుకు బీజేపీ (Bjp) సిద్ధమైంది. అదే రోజు నుంచి తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు...
హైదరాబాద్: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినం (Telangana Liberation Day)గా నిర్వహించేందుకు బీజేపీ (Bjp) సిద్ధమైంది. అదే రోజు నుంచి తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు (Unity Vajrotsavam) చేపట్టేందుకు అటు టీఆర్ఎస్ కూడా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు భారీగా ప్రచారాన్ని నిర్వహించాలని రెండు పార్టీలు ప్లాన్ చేశాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో మెట్రో, ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాలనుకున్నాయి. కానీ ఈ విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మెట్రో, ఆర్టీసీ సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాడ్స్ మాత్రమే ప్రచారం చేసేలా యాడ్ ఏజెన్సీల ద్వారా ఏర్పాట్లు చేసింది.
దీంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ప్రచారానికి అటు యాడ్ ఏజెన్సీలు నో చెప్పాయి. టీఆర్‌ఎస్ యాడ్స్‌కు మెట్రో, ఆర్టీసీ ఓకే చెప్పడంతో బీజేపీ విజ్ఞప్తిని తోసిపుచ్చాయి. దీంతో టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్స్ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తమకు అవకాశం ఇవ్వకుండా పిల్లర్లు, ఆర్టీసీని టీఆర్ఎస్ బుక్ చేసుకుందని.. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ‘‘తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఆర్టీసీ బస్సులు అడిగితే మాకు ఇవ్వమన్నారు. లెటర్ అడిగితే భయపడ్డారు. బస్ అద్దె 6 వేల నుంచి 18 వేలు పెంచారు. అసద్‌ను ఒప్పించి సీఎం కేసీఆరే సమైక్యతా దినోత్సవం లేఖ రాయించారు.’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రాడు?. మోదీ హయాంలో పైరవీలు లేకుండా పోయాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు ఎందుకు కరోనా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను వాళ్ళను కలవక చాలా రోజులు అయింది. చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారంలో కేసీఆర్‌ను కలిశాను. కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీట్లు అందుకే తగ్గాయి. గట్టిగా కొట్లాడేవారుంటే ప్రజలు టీఆర్ఎస్‌కు ఓటేయ్యరు. నాగార్జునసాగర్‌లో మాకు అభ్యర్థి సరిగా లేకనే ఓడిపోయాం. అంబర్ పేటపై నాకు జీవితాంతం అఫెక్షన్ ఉంటుంది.’’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ గ్రామాల్లో బీజేపీ లేకపోతే కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లో ఎంపీ సీట్లు ఎలా గెలిచామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పాపులారిటీ ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తామనడం సరైంది కాదన్నారు. తమ కార్యకర్తలు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా కష్టపడుతున్నారని.. సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారని.. లాఠీ దెబ్బలు తింటున్నారని చెప్పారు. ఎవరు గట్టిగా పోరాడితే వాళ్ళే గెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ వచ్చే ఎన్నికల్లో జార్ఖండ్, బీహార్, రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తోంది. మేం నేషన్ ఇంట్రెస్ట్‌తో పని చేస్తాం.. వాళ్ళు కుటుంబం కోసం పని చేస్తారు. కార్యకర్తలను కేంద్రమంత్రులను చేసే పార్టీ మాది. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు రాజకీయ వాతావరణం క్రియేట్ చేశాం. ఎవరిని కలిసినా ఈసారి బీజేపీ గెలుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోతుంది. బెంగాల్‌లో డబ్బు పట్టుబడిన తర్వాత మమతా వీక్ అయ్యారు. కలగూర గంప రాజకీయాలు దేశాన్ని బ్రష్టు పట్టిస్తాయి .. వాటి వల్ల ఏమీ కాదు.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.