శ్రీశ్రీ మాటలను నిజం చేసిన కవి ‘కుందుర్తి’

ABN , First Publish Date - 2022-12-12T04:25:35+05:30 IST

సామాన్యుల నోళ్లలో నానే అలంకారాలు, పోలికలే కవిత్వంలోకి రావాలని తుది వరకు పరితపించిన కవి కుందుర్తి ఆంజనేయులు అని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి కన్వీనర్‌, ప్రముఖ కవి కె. శివారెడ్డి అన్నారు.

శ్రీశ్రీ మాటలను నిజం చేసిన కవి ‘కుందుర్తి’

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి కన్వీనర్‌ కె. శివారెడ్డి

తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన మజిలీ ‘కుందుర్తి’

ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌

కుందుర్తి సమగ్ర కవితా సంకలనాలు ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : సామాన్యుల నోళ్లలో నానే అలంకారాలు, పోలికలే కవిత్వంలోకి రావాలని తుది వరకు పరితపించిన కవి కుందుర్తి ఆంజనేయులు అని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి కన్వీనర్‌, ప్రముఖ కవి కె. శివారెడ్డి అన్నారు. కవిత్వాన్ని ఆకాశపు దారుల నుంచి భూమార్గం పట్టిస్తానన్న శ్రీశ్రీ మాటలను కుందుర్తి నిజం చేశారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ, కవిసంధ్య సాంస్కృతిక సంస్థ, యానాం సంయుక్త నిర్వహణలో కుం దుర్తి ఆంజనేయులు శతజయంతి సభ ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో స్వాగతోపన్యాసం చేసిన శివారెడ్డి.. కవిత, కథ, నాటకం వంటి పలు సాహిత్య ప్రక్రియల్లో కుందుర్తి అనేక ప్రయోగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌.. ‘హోరు’ ప్రచురించిన ‘కుందుర్తి సమగ్ర కవిత్వం’ రెండు సంపుటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్య ప్రయాణంలో ‘కుందుర్తి’ ఒక ముఖ్యమైన మజిలీ అని శ్లాఘించారు. చిన్నచిన్న మాటలతో కుందుర్తి రాసిన కవితాపంక్తులు చదువుతుంటే కవిత్వాన్ని ఇంత సరళం చేయవచ్చా.. అనే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కుందుర్తి ప్రారంభించిన ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు ఆయన తదనంతరం కూడా వచన కవితా పరిణామాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషమని ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా శీలా సుభద్రాదేవి కూర్పు ‘యాభైవసంతాల ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డులు’, కవిసంధ్య ‘కుందుర్తి’ శత జయంతి ప్రత్యేక సంచికలను తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. అంతేకాక, కుందుర్తి సాహిత్యంపై రోజంతా జరిగిన సదస్సులో పాల్గొన్న పలువురు కవులు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఇక, ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్‌.. కుందుర్తితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కుందుర్తి మనుమరాలు కవిత మాట్లాడుతూ తెలుగు కవిత్వాన్ని తన తాత ప్రజాస్వామీకరించారని అన్నారు. కుందుర్తి సమగ్ర కవితా సంకలనాలను ప్రచురించిన హోరు నిర్వాహకులు శ్రీరాం పుప్పాల, అనీల్‌ డ్యానీ కృషిని వక్తలు అభినందించారు.

Updated Date - 2022-12-12T04:31:34+05:30 IST