Sharmila: టీఆర్ఎస్ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లే
ABN , First Publish Date - 2022-12-02T16:37:24+05:30 IST
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) మండిపడ్డారు. తెలంగాణ (Telangana)లో తాలిబాన్ల రాజ్యం కొనసాగుతోందని, టీఆర్ఎస్ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లేనని ధ్వజమెత్తారు.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) మండిపడ్డారు. తెలంగాణ (Telangana)లో తాలిబాన్ల రాజ్యం కొనసాగుతోందని, టీఆర్ఎస్ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లేనని ధ్వజమెత్తారు. తాను ఎక్కడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదని తెలిపారు. నర్సంపేటలో తమపై టీఆర్ఎస్ (TRS) గూండాలు దాడి చేశారని, నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారని షర్మిల దుయ్యబట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌తో గురువారం ఆమె భేటీ అయిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలను వివరించడంతోపాటు టీఆర్‌ఎస్, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వేల్లో వైఎస్సార్‌టీపీకి ఆదరణ పెరిగినట్లు తేలిందని, దీనిని తట్టుకోలేక తమపై వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నర్సంపేటలో పోలీసులే విధ్వంసం సృష్టించారని, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను ఇష్టానుసారం కొట్టారని మండిపడ్డారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి తనను హైదరాబాద్ తీసుకొచ్చారని తెలిపారు. ధ్వంసమైన వాహనాలను కేసీఆర్‌కు చూపడానికి ప్రగతి భవన్‌కు తీసుకెళ్తుంటే.. మరోసారి అడ్డుకున్నారని, తాను ఉండగానే వాహనాన్ని క్రెయిన్‌తో తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అనే ఇంగితం పోలీసులకు లేదా? అని షర్మిల ప్రశ్నించారు.
డీజీపీని కలిసిన షర్మిల
డీజీపీ మహేందర్‌రెడ్డి (DGP Mahender Reddy)ని షర్మిల కలిశారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. ఈనెల 4 నుంచి తిరిగి పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. సీఎం కేసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ నేత, రెడ్కో చైర్మన్ వై.సతీష్‌రెడ్డి వనస్థలిపురం ఏసీపీ పురుశోత్తంరెడ్డికి ఫిర్యాదు చేశారు.