Kishan Reddy: టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
ABN , First Publish Date - 2022-11-03T21:35:35+05:30 IST
ఢిల్లీ: ‘మునుగోడు ఉప ఎన్నికలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అంగబలం, అర్థబలంతోపాటు పోలీసులను, ఇతర అధికారులను తమ పార్టీకోసం విచ్చలవిడిగా వినియోగించుకున్నారని, టీఆర్ఎస్ వ్యవహరించిన తీరును, అధికారులు, పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘మునుగోడు ఉప ఎన్నిక ద్వారా మరోసారి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. ఎన్నికలకు 36 గంటలముందు స్థానికేతరులు మునుగోడు నియోజకవర్గాన్ని ఖాళీ చేసి పోవాలన్న నిబంధనను కూడా టీఆర్ఎస్ పార్టీ యథేచ్చగా గాలికొదిలేసింది. నాతోపాటుగా బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ నిబంధనల ప్రకారం నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే మునుగోడును ఖాళీ చేశాము. కానీ టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం ఎన్నికకు ముందు రెండు రాత్రులు అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో తిరుగుతూ డబ్బులు పంచడంతోపాటు, ప్రజలను బెదిరించడం, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడటం వంటి అరాచకాలకు పాల్పడటం దురదృష్టకరం. దీని కారణంగా పారదర్శకంగా జరగాల్సిన ఎన్నిక పక్షపాతంగా మారింది. ఎన్నికకు ఒకరోజు ముందు రాత్రి, ఎన్నిక జరుగుతున్న సమయంలోనూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే, స్థానికేతరులు యథేచ్ఛగా డబ్బు, మద్యం పంచుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం అత్యంత దారుణం. ఫిర్యాదుచేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపైనే ఉల్టా కేసులు బనాయించి, బెదిరించడం గర్హనీయం. దీనికితోడు వివిధ గ్రామాల్లో ఫంక్షన్ హాళ్లలో అక్రమంగా ఉన్న స్థానికేతరులు ఉంటున్న విషయాన్ని తెలియజేసిన, అధికార పార్టీ డబ్బులు పంచడాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, ఓటర్లపైనే పోలీసులు కేసులు పెట్టడం, లాఠీ చార్జ్ చేయడం అమానుషం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు, పోలీసులు అన్యాయంగా అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధం. టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరును, అధికారులు, పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.