ఆధ్యాత్మిక నగరి యాదగిరి

ABN , First Publish Date - 2022-12-30T00:48:18+05:30 IST

భక్తుల కొంగుబంగారంగా.. ఇల వైకుంఠంగా.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభు పాంచ నృసింహుడి క్షేత్రం మహా దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంది. సహజసిద్ధ కొండగుహల్లో వెలసి భక్తజనుల పూజలందుకుంటున్న నృసింహు డి క్షేత్రం విశ్వనగరిగా కొత్తరూపు సంతరించుకుం ది.

ఆధ్యాత్మిక నగరి యాదగిరి

రూ.1280కోట్లతో ఆలయ పునర్నిర్మాణం

ఈ ఏడాది ఉద్ఘాటన అనంతరం భక్తుల కు దర్శనభాగ్యం

కొండకిందే సకల సౌకర్యాలు

రికార్డుస్థాయిలో ఆదాయం, భక్తులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): భక్తుల కొంగుబంగారంగా.. ఇల వైకుంఠంగా.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభు పాంచ నృసింహుడి క్షేత్రం మహా దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంది. సహజసిద్ధ కొండగుహల్లో వెలసి భక్తజనుల పూజలందుకుంటున్న నృసింహు డి క్షేత్రం విశ్వనగరిగా కొత్తరూపు సంతరించుకుం ది. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్తగోపురాలు, శ్రీవైష్ణవ ధర్మప్రచార ఆచార్యులు 12 మంది ఆళ్వార్‌ స్వాముల విగ్రహాలు, కాకతీయుల కాలంనాటి శిల్పకళాసౌరభాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరిసేలా రూపుదిద్దుకున్న ప్రధానాలయ ముఖమండపం, స్వామివారి విమాన గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయ ముఖద్వారాలు స్వర్ణతాపడంతో భక్తజనబాంధవుడి ఆలయం బంగారుమయమైంది. విశాలమైన పుష్కరిణి, బ్రహ్మోత్సవ మండపం, ప్రసాదాల తయారీ కాంప్లెక్స్‌, ఆధునిక సదుపాయాలతో దర్శన క్యూ కాంప్లెక్స్‌, వేద పారాయణాలతో ఆధ్యాత్మిక శోభతో పాటు ఆహ్లాదాన్ని పంచే పచ్చదనాన్ని పరుచుకుంది. 14ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండే కాదు.. పరిసరాల నవగిరులతో 2వేల ఎకరాల ఆధ్యాత్మిక విశ్వనగరి గా, దేశంలో పేరొందిన ఆలయంగా దినదినాభివృద్ధి చెందుతోంది.

తిరుమల స్థాయిలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించి సుమారు రూ.1280కోట్లు కేటాయించారు. యాదగిరిగుట్ట టెంపుల్‌డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని ఏర్పాటు చేయడమేగాక ఆయనే చైర్మన్‌గా అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. స్వయంభువు లక్ష్మీనారసింహుడి ఆలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయాలను ఆగమశాస్త్రరీత్యా ఎటువంటి మార్పులు చేయకుండా ముఖమండప, ప్రాకారాలను అద్భుత కట్టడాలుగా మలిచారు. ప్రధానాయలంతో పాటు విస్తరణ పనులు చేపట్టేందుకు 66నెలలు పట్టగా పూర్తిగా కృష్ణరాతి శిలతో ఆలయాన్ని నిర్మించారు. 2016 అక్టోబరు 11న విజయదశమి రోజున యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. మొత్తం 2.5లక్షల టన్నుల కృష్ణరాతి శిలలను ఏపీ రాష్ట్రం ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి సేకరించారు. ఆలయ నిర్మాణంలో స్థపతులతో పాటు 800మంది శిల్పులు, 8మంది కాంట్రాక్టర్లు, 2వేల మంది కార్మికులు పాలుపంచుకున్నారు. ప్రధానాలయంలో 6వేలకు పైగా శిల్పాలను చెక్కా రు. ప్రధానాలయ నిర్మాణానికి రూ.250కోట్లు వెచ్చించగా, మరో రూ.1000కోట్లతో కొండ చుట్టూ రింగ్‌రోడ్డు, సుందరీకరణ పనులు చేపట్టారు.

19సార్లు దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆల య పునర్నిర్మాణానికి 2016 అక్టోబరులో శిలాన్యాసపూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మొత్తం 19సార్లు గుట్ట ను సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న 17వ సారి పనులను పరిశీలించి ఆలయ ఉద్ఘాటనకు పూర్తిచేయాల్సిన పనులను సమీక్షించారు. అంతరం ఫిబ్రవరి 12న గుట్టకు 18వ సారి వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్లను ప్రారంభించారు. 19వ సారి మార్చి 28న నిర్వహించిన స్వామివారి ఆలయ ఉద్ఘాటన వేడుకల్లో పాల్గొన్నారు.

పెరిగిన భక్తులు, ఆదాయం

యాదగిరిగుట్ట: ఆలయ ఉద్ఘాటన అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. భక్తుల రాక పెరగడంతో స్వామి వారికి ఆదాయం కూడా పెరిగింది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో ఒక్క రోజులో కార్తీక మాసంలో నవంబరు 13న రూ.1.09కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా సుమారు 60వేల మంది భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో రికార్డుస్థాయిలో హుండీల ఆదాయం వచ్చింది. నవంబరు 24 నిర్వహించిన 15 రోజుల హుండీల లెక్కింపులో రూ.1.88కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా కార్తీక మాసంలో ఎన్నడూ రానంతగా ఆలైటైమ్‌ రికార్డు ఆదాయం సమకూరింది. కార్తీక మాసంలో అక్టోబరు 25 నుంచి నవంబరు 23వ తేదీ వరకు నెల రోజుల ఆదాయం రూ.14.66కోట్లు సమకూరింది.

మహాకుంభాభిషేకంతో ఉద్ఘాటన

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన సందర్భంగా సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రపద్ధతిలో సప్తాహ్నిక దీక్షతో ఈ ఏడాది మార్చి 21న పంచకుండాత్మక మహాసుదర్శన యజ్ఞంతో మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఏడురోజుల పాటు వైదిక పర్వాలు కొనసాగాయి. బాలాలయంలో మార్చి 28న ఉదయం 7.30గంటల నుంచి నిత్యహోమాలు, 9గంటలకు మహాపూర్ణాహుతి తదితర వైదిక పర్వాలు నిర్వహించారు. 9.30 నుంచి 10గంటల వరకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర నిర్వహించగా, ఈ యాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. 11.55 గంటలకు శ్రవణ నక్షత్రం, మిథునలగ్న అభిజిత్‌ ముహూర్తాన మహుకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. మధ్యాహ్నం 12.10గంటలకు ప్రధానాలయ ప్రవేశం చేశారు. మహాకుంభ సంప్రోక్షణలో మొత్తం 15మంది రుత్వికులు పాల్గొనగా, సాయంత్రం శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించి భక్తులకు స్వయంభు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి శివాలయాన్ని కృష్ణరాతి శిలలతో పునర్నిర్మించగా, ఏప్రిల్‌ 25న నిర్వహించిన శివాలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు.

కొండకిందే సకల సౌకర్యాలు

ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాట కేత్రంగా అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం అదేస్థాయిలో సదుపాయాలు కల్పిస్తోంది. కొండ కింద గండిచెరువు సమీపంలో విశాల భవనాల్లో అధునాతన వసతులతో కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, ఉచిత అన్నప్రసాద భవనం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్ష్మీపుష్కరిణి, ఆర్టీసీ బస్టాండ్‌, టెంపుల్‌ బస్‌టర్మినల్‌ నిర్మించింది. కొండమీద, కొడకింద నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు సివేజ్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. కొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై 250 ఎకరాల్లో రూ.207కోట్లతో టెంపుల్‌సిటీ లేవుట్‌ను అధికారులు అభివృద్ధి చేశారు. మరో 800ఎకరాల్లో ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లు, ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీశాఖకు చెందిన 500 ఎకరాల్లో నారసింహ అభయారణ్యం, జింకల పార్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి ఉత్తరదిశగా 13ఎకరాల కొండపైన రూ.105కోట్లతో 14 అధునాతన విల్లాలు, కొండపైన ఒక ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లా నిర్మించారు. వైటీడీఏ పరిధిలోని రాయిగిరి, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, మల్లాపురం చెరువులను మినీ ట్యాంకు బండ్‌లుగా అభివృద్ధి చేశారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద 250ఎకరాల్లో థీమ్‌పార్క్‌ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. ఆలయానికి నలువైపులా రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించడమేగాక, రాయిగిరి వద్ద మినీ శిల్పారామం నిర్మిస్తున్నారు.

వివాదాలు సైతం

ఆలయ ఉద్ఘాటన అనంతరం గుట్ట కింది నుంచి కొండపైకి ఆటోలను నిలిపివేసి కేవలం ఆలయం సమకూర్చిన బస్సుల్లోనే యాత్రికులు రావాలని నిబంధన విధించడం వివాదాస్పదమైంది. దీంతో ఏళ్లుగా భక్తులను కొండపైకి తరలించి స్వామి వారి సేవలో ఉన్న తమ ఉపాధిని కోల్పోతున్నామని ఆటో కార్మికులు ఈ ఏడాది మార్చి 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అదేవిధంగా స్థానికుల వాహనాలను సైతం కొండపైకి అనుమతించకూడదని ఈవో నిర్ణయం తీసుకోవడంతో భక్తులు భగ్గుమన్నారు. వారం తరువాత ఈ నిబంధనను ఈవో సడలించారు. జూలై మాసంలో కురిసిన వర్షాలకు ప్రధాన ఆలయ దక్షిణ దిశలోని తిరువీధి ఫ్లోరింగ్‌ కుంగింది. అష్టభుజి ప్రాకార మండం నుంచి వర్షపు నీరు లీకైంది. బ్రహ్మోత్సవ మండపానికి పగుళ్లు వచ్చాయి. దీంతోపాటు దర్శన క్యూకాంప్లెక్స్‌, ప్రసాదాల తయారీ భవనంలోనికి వరద వచ్చి చేరింది. ఇక ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఈవో తీరు వివాదాస్పదమైంది. యాదగిరిగుట్టను గవర్నర్‌ తమిళిసై దర్శించుకోగా, ఆ సమయంలో ఈవో స్వాగతం పలకపోగా, ఆమె పర్యటన ఆసాంతం పాల్గొనకపోవడం వివాదాస్పదమైంది.

ఉద్ఘాటనకు చిన్నజీయర్‌ దూరం

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనను చినజీయర్‌స్వా మి నిర్ణయించిన ముహూుర్తం ప్రకారం మహాకుంభ సంప్రోక్షణను నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించలేదు. ఆలయ ఉద్ఘాటనకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవ్వరినీ ఆహ్వానించడం లేదని, జీయర్‌స్వామికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఆలయ పునర్నిర్మాణం మాత్రం ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. ఆయన్ను సంప్రదించకుండా, శిలాఫలకం లేకుండానే మహాకుంభసంప్రోక్షణను ముఖ్యమంత్రి నిర్వహించారు.

నేడు యాదగిరిగుట్టకు రాష్ట్రపతి

హెలీకాప్టర్‌లో రానున్న ద్రౌపది ముర్ము

ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు

1400 మంది పోలీస్‌లతో నిఘా : రాచకొండ సీపీ

యాదగిరిగుట్ట, డిసెంబరు 29: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి దివ్యక్షేత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శుక్రవారం సందర్శించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ఆమె హెలీక్యాప్టర్‌ ద్వారా శుక్రవారం ఉదయం 9.30 నిమిషాలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. పాతగోశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద ఆమెకు జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగ తం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఆమె కాన్వాయ్‌లో రోడ్డు మార్గం గుండా మూడో ఘాట్‌రోడ్డు లో కొండపైకి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక పూజ ల్లో పాల్గొని ఆమె తిరుగు పయనమవుతారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ ఆలయం పునర్నిర్మాణం అనంతరం విచ్చేస్తున్న ప్రథమ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కావడంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనకోసం ప్రత్యేకంగా కొండకింద పాత గోశాల ఆవరణలోని సుమారు 75ఎకరాల సువిశాల ప్రదేశంలో 100మీటర్ల వ్యాసంతో మూడు హెలీప్యాడ్‌లను నిర్మించా రు. హెలీప్యాడ్‌ నిర్మాణ సమయంలోనే ఏవియేషన్‌ అధికారులు పలుమార్లు హెలీక్యాప్టర్ల ల్యాండింగ్‌ ట్రయల్‌ విజయవంతంగా పూర్తిచేశారు. రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ యం భగవత్‌ ఆధ్వర్యంలో సుమారు 1400 మంది పోలీసు బలగాలతో నిఘాను అప్రమత్తం చేశారు. కొండపైన, కొండకింద హెలీప్యాడ్‌ ప్రాంతంలో డా గ్‌, బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీ లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వర కూ కొండపైకి భక్తులను అనుమతించడంలేదని, మధ్యా హ్నం తర్వాత భక్తులకు ఇష్టదైవాల దర్శనాలు, ఆర్జిత సేవల నిర్వహణకోసం అనుమతిస్తామని, సుప్రభాతం మొదలు మధ్యాహ్నం రాజభోగం నివేదన వరకు అన్ని కైంకర్యాలు ఆస్థానపరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి విడిది ప్రెసిడెన్షియల్‌ విల్లాలో ఏర్పాట్లు

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండదిగువన సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలోని కొండపై ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లాతోపాటు మరో 14 వీవీఐపీ విల్లాను రూ.120కోట్లతో నిర్మించిన సంగతి తెలిసిందే. ఆలయ ఉద్ఘాటనకు ముందస్తుగానే అత్యంత విలాసవంతంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా నిర్మించిన విల్లాలను సీఎం కేసీఆర్‌ సంప్రదాయరీతిలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. నాటి నుంచి ఆలయ ఉద్ఘాటన అయిన తర్వాత సీఎం మినహా మిగతా విశిష్ట వ్యక్తులు ఈ విల్లాల్లో బస చేయలేదు. కాగా రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లాలో విడిది చేయనుండటంతో విల్లాను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-12-30T00:48:34+05:30 IST