ISRO: ఇక ఏడాదికి 12 ప్రయోగాలు: సోమ్‌నాథ్‌

ABN , First Publish Date - 2023-04-21T20:10:45+05:30 IST

ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యం పెట్టుకొంటుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ (ISRO Chairman Somnath) తెలిపారు...

ISRO: ఇక ఏడాదికి 12 ప్రయోగాలు: సోమ్‌నాథ్‌

సూళ్లూరుపేట: ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యం పెట్టుకొంటుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ (ISRO Chairman Somnath) తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ (PSLV-C) 55 రాకెట్‌ విజయం కోసం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయోగాలకు తగినట్టుగా అధునాతన వసతులను కూడా సమకూర్చుకొన్నట్లు తెలిపారు. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది తొలి ప్రయోగం కాగా.. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 57వ ప్రయోగమన్నారు. వాణిజ్య రంగ ప్రయోగాల్లో ఇది ఐదో ప్రయోగమని చెప్పారు. ఈ ప్రయోగానంతరం జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ (GSLV Rocket) ద్వారా నావిక ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత కీలకమైన చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగాలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇకపై ప్రతి నెలా ప్రయోగం ఉంటుందని సోమనాథ్‌ ప్రకటించారు.

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌ దేశానికి చెందిన 741 కిలోల బరువు గల టెలియోస్‌-2 ఉగ్రహం, 16 కిలోల బరువు గల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహం రోదసీలోకి పంపనున్నారు. శుక్రవారం 12:50 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 25.30 గంటల పాటు కొనసాగుతుంది. రాకెట్‌లోని 2, 4 దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ పూర్తయింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది.

Updated Date - 2023-04-21T20:10:45+05:30 IST