Foreign Scotch prices : ఫారిన్ స్కాచ్.. మ్యాచ్ ఫిక్స్?
ABN , First Publish Date - 2023-11-22T05:01:14+05:30 IST
మద్యం కంపెనీలకు వీలైనంతగా మేలు చేసేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో దేశీయ మద్యం విషయంలో ఆదాయం మాత్రమే నష్టపోగా, విదేశీ మద్యం(ఎ్‌ఫఎల్) విషయంలో అటు ఆదాయం
విదేశీ మద్యం ధరలు 20 శాతం పెంపు
ప్రభుత్వ ఖజానాకు రెండు వైపులా చిల్లు
ఒక్కో సీసాపై రూ.300పైగా నష్టం
లేని బ్రాండ్లకే రేట్లు తగ్గింపు
అంతుపట్టని పన్నుల రేషనలైజేషన్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం కంపెనీలకు వీలైనంతగా మేలు చేసేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో దేశీయ మద్యం విషయంలో ఆదాయం మాత్రమే నష్టపోగా, విదేశీ మద్యం(ఎ్‌ఫఎల్) విషయంలో అటు ఆదాయం నష్టపోవడంతో పాటు, ఇటు ఆ కంపెనీలకు పెద్దఎత్తున ధరలు పెంచుతూ అడ్డగోలు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ఎక్సైజ్ శాఖ జీవో 557ను జారీచేసింది. గత కొన్నేళ్లుగా స్కాచ్ తరహా ఫారిన్ లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలకు ధరలు సవరించలేదని, దాంతో 2023-24 సంవత్సరంలో చాలా కంపెనీలు ఒప్పందాలు రెన్యువల్ చేసుకోలేదని తెలిపింది. పెరుగుతున్న ధరలు, రవాణా ఖర్చుల నేపథ్యంలో ఆ కంపెనీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాల్సిన అవసరం వచ్చిందంటూ సమర్థించుకుంది. ఎఫ్‌ఎల్ కంపెనీలకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎలాంటి చర్చలూ లేకుండానే ఏకపక్షంగా 20శాతం పెంచేసింది. అంటే ప్రస్తుతం ఓ ఎఫ్‌ఎల్ సీసాకు ప్రభుత్వం రూ.వెయ్యి చెల్లిస్తుంటే, ఇకపై రూ.1,200 చెల్లించాలి. ఫారిన్ లిక్కర్ ధరలు చాలా ఎక్కువ కాబట్టి ఆ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించే మొత్తాలు కూడా భారీగానే ఉంటాయి. కంపెనీలు అడిగిన ధర లేదా ప్రస్తుత ధరపై 20శాతం అదనం.. రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లిస్తామని ప్రభుత్వం వివరించింది. కొత్తగా వచ్చే ఎఫ్‌ఎల్ బ్రాండ్ల విషయంలో మరీ విడ్డూరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే బ్రాండ్లకు వారు అడిగిన ధర లేదా పక్క రాష్ర్టాలో వారికి ఇస్తున్న ధర రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తామని తెలిపింది. ఒకవేళ పక్క రాష్ర్టాల్లో అలాంటి బ్రాండ్లు లేకపోతే రాష్ట్రంలోనే వాటికి సమానమైన బ్రాండ్ల స్థాయిలో ధరలు నిర్ణయిస్తామని స్పష్టంచేసింది. వాటికి సమానమైన బ్రాండ్లు కూడా లేకపోతే వారు అడిగినంత ధర ఇచ్చేస్తామని నిర్ణయం తీసుకుంది.
ఎమ్మార్పీల్లో కోత
విదేశీ మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను 20శాతం పెంచేసిన ప్రభుత్వం, వాటి బ్రాండ్ల ఎమ్మార్పీని తగ్గించేసింది. తాజాగా ఇచ్చిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఏఆర్‌ఈటీ) రేషనలైజేషన్‌తో ధరల్లో ఈ మేరకు మార్పులు వచ్చాయి. రాష్ర్టానికి 109 ఎఫ్‌ఎల్ బ్రాండ్లు మద్యం సరఫరా చేస్తుంటే, వాటిలో 68 బ్రాండ్లకు ప్రభుత్వం ఎమ్మార్పీ తగ్గించేసింది. అంటే మొన్నటి వరకూ రూ.2,680కు అమ్మిన ఒక ఎఫ్‌ఎల్ బాటిల్ ఇకపై రూ.2,320కే వినియోగదారులకు లభించనుంది. దీనివల్ల ఒక్క బాటిల్‌పై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.360 తగ్గుతుంది. మరోవైపు అదే సీసాపై కంపెనీకి ఇచ్చే ధర 20శాతం పెంచడం వల్ల సుమారు రూ.200 కంపెనీకి అదనంగా ఇవ్వాలి. దీంతో అటు రూ.360 పన్నుల్లో నష్టం, ఇటు రూ.200పైగా అదనపు చెల్లింపులు వెరసి రూ.560పైగా ఒక్క సీసాపై ప్రభుత్వానికి నష్టం ఏర్పడుతుంది. తాజాగా 68 రకాల బ్రాండ్ల ధరలను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవంగా ఫారిన్ లిక్కర్ బాటిళ్ల ధర భారీగా ఉంటుంది. సగటున ఒక్కో బాటిల్ రూ.4వేల పైనే ఉంటుంది.
ధనవంతులు తాగే మద్యం కోసం రెండు వైపులా ఖజానాకు నష్టం జరిగేలా ఎక్సైజ్ జీవో జారీచేసింది. ఫారిన్ లిక్కర్ కంపెనీలపై అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం దేశీయ మద్యం కంపెనీలను మాత్రం ముప్పతిప్పలు పెడుతోంది. అందులోనూ మన అనుకున్న కంపెనీలకు ఎక్కువ మేలు చేస్తూ, కప్పం కట్టని కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా పాపులర్ బ్రాండ్లు కనిపించకుండా పోయాయి. ఆర్డర్లు ఇచ్చినా షాపుల్లో అమ్మకపోవడంతో మొదట్లో కింగ్‌ఫిషర్ కంపెనీ ఏకంగా బ్రూవరీనే చాలా కాలం మూసేసుకుంది. ఇప్పటికీ అనేక పాపులర్ బ్రాండ్లు ఆర్డర్లు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయట్లేదు. ఎందుకంటే ఆర్డర్లు ఇచ్చి మద్యం తీసుకుంటున్న ప్రభుత్వం, వాటిని షాపుల్లో పెట్టి అమ్మకుండా గోడౌన్లలోనే మగ్గిపోయేలా చేస్తోంది. తీసుకున్న మద్యం అమ్మితేగానీ ఆయా కంపెనీలకు ప్రభుత్వం నగదు చెల్లించదు. అదేమంటే మీ బ్రాండ్లు ఎవరూ అడగటం లేదని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఫారిన్ లిక్కర్ కంపెనీలకు మాత్రం అడ్డగోలుగా రేట్లు పెంచేశారు.
ఖజానాకు నష్టం లేదు: ఏపీ బేవరేజెస్
ఉత్పత్తి చేయని, మార్కెట్‌లో అందుబాటులో లేని బ్రాండ్లకే ధరలు తగ్గాయని, వాటి వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తెలిపారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఆ కిక్కు ఎవరి ఖాతాలోకి’ కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. అన్ని బ్రాండ్లకు సమానంగా పన్నులు వర్తించాలనే ఉద్దేశంతోనే పన్నులు రేషనలైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ఫలితంగా ఈ నెల 19న ప్రభుత్వానికి అదనంగా రూ.కోటి ఆదాయం పెరిగిందన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఉత్పత్తి, మార్కెట్‌లో అందుబాటు సంగతి ఎలా ఉన్నా.. ఒక్కో బాటిల్‌పై భారీగా ధరలు ఎందుకు తగ్గించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ప్రశ్నించింది. ఒక్క బాటిల్‌పై రూ.330 తగ్గడం ఏ విధమైన రేషనలైజేషన్ అనే ప్రశ్నకు వాసుదేవరెడ్డి సమాధానమివ్వలేదు. 250కు పైగా బాటిళ్లపై ధరలు తగ్గించగా, అందులో ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఒకవేళ తక్కువ అమ్మకాలున్న బ్రాండ్లు అని రేట్లు తగ్గించి ఉంటే.. మిగిలిపోయిన స్టాకు అంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఇవన్నీ మేళ్లు కాదని ఎలా అనగలరో ప్రభుత్వానికే తెలియాలి.