బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

ABN , First Publish Date - 2023-03-21T03:17:55+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు.

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

వారి కోసం ప్రత్యేక పారిశ్రామిక భూములు

గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో చోటు

మైనారిటీల అభివృద్ధికి ముస్లిం బ్యాంకు: లోకేశ్‌

యువగళం 48వ రోజు 9.8 కిలోమీటర్లు నడక

పుట్టపర్తి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. యువగళం పాదయాత్ర 48వ రోజు(సోమవారం) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట నుంచి కదిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వరకు 9.8 కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీసీ, మైనార్టీ మహిళలు ఆయన వెంట నడిచారు. కదిరి మండలం మొటుకుపల్లిలోని దివ్యాంగ చిన్నారుల ఆశ్రమాన్ని లోకేశ్‌ సందర్శించారు. వారితో ముచ్చటించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కదిరి పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో బీసీలతో మాటామంతీ నిర్వహించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, వారి న్యాయపోరాటానికీ తమ ప్రభుత్వమే సాయం అందిస్తుందని లోకేశ్‌ చెప్పారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు శాసన మండలిలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. కల్లుగీత కార్మికులకు రూ.పది లక్షల బీమా కల్పిస్తామని, మద్యం షాపుల్లో వారికి కొంతభాగం కేటాయిస్తామని తెలిపారు. బీసీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, కార్పొరేషన్‌న్లు ఏర్పాట్లు చేసి కూర్చీలు కూడా లేకుండా చేసిందని విమర్శించారు. దిశ చట్టం ఒక మోసమని, ఒక్క కేసులోనూ 21 రోజుల్లో శిక్షపడేలా చేయలేదని లోకేశ్‌ తెలిపారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెరిగి, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేలా చేశారని మండిపడ్డారు. ‘మాట మార్చడం, మడమ తిప్పడం జగన్‌కు అలవాటుగా మారింది. సొంత బాబాయిని చంపేసి, చంద్రబాబు చంపేశాడంటూ నటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో జగన్‌ నటించి ఉంటే ఆయనకు బెస్ట్‌ అవార్డు వచ్చేది’ అని ఎద్దేవా చేశారు. జగన్‌ ఒకసారి ఢిల్లీ వెళ్లిరావడానికి రూ.కోటి ఖర్చవుతుందపి. ఆయనకు సౌండ్‌ ఎక్కువ, పని తక్కువ అని విమర్శించారు.

వైసీపీ ముస్లింలకు ఏం చేసింది?

కదిరిలో ముస్లింలతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో ముస్లింలకు ఏం మేలు చేశారో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సిద్ధమా? అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

Updated Date - 2023-03-21T03:17:55+05:30 IST