లారీని ఢీకొని.. మరో లారీ కింద పడి..
ABN , First Publish Date - 2023-02-27T02:18:51+05:30 IST
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.
కుప్పంలో అదుపు తప్పిన కారు
ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
మృతుల్లో ఇద్దరు మెడికోలు.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి
కుప్పం/గుడుపల్లె, ఫిబ్రవరి 26: చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మెడికోలు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ మండలానికి చెందిన సి.శ్రీవికా్‌సరెడ్డి (21), అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన టి.ప్రవీణ్‌కుమార్ (24) కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్నారు. కళాశాలకు సమీపంలోని గుడుపల్లె మండలం నలగాంపల్లెలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన సాయికృష్ణ తేజ కూడా పీఈఎస్ వైద్య కళాశాలలోనే ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతూ నలగాంపల్లెలోనే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో మదనపల్లెలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాయికృష్ణ తేజ తమ్ముడు కల్యాణ్ (20) శనివారం తన అన్న దగ్గరికి వచ్చాడు. తమ స్నేహితుల్లో ఒకరి బర్త్‌డే సందర్భంగా శనివారం అందరూకలిసి పార్టీ చేసుకున్నారు. తర్వాత ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సాయికృష్ణతేజ కారులో శ్రీవికా్‌సరెడ్డి, ప్రవీణ్‌కుమార్, కల్యాణ్ నలగాంపల్లె నుంచి కుప్పంవైపు బయలుదేరారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లె సమీపంలో ఓ లారీని వీరి కారు వెనుక నుంచి ఢీకొని, ఎగిరి కుడివైపు పల్టీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో లారీ, ఈ కారుపైనుంచి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న శ్రీవికా్‌సరెడ్డి, ప్రవీణ్‌కుమార్, కల్యాణ్ తలలు పగిలి, మెడలు, కాళ్లూ చేతులు విరిగి, శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను గుడుపల్లె పోలీసులు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.