Amaravati railway line: మళ్లీ.. తెరపైకి అమరావతి రైల్వే లైన్
ABN , First Publish Date - 2023-03-10T03:06:14+05:30 IST
అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టు మరోసారి తెరమీదకొచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పట్లో రాజధానిలో కనెక్టివిటీ కోసం ప్రతిపాదన
కాస్ట్ షేరింగ్‌కూ అంగీకరించిన గత ప్రభుత్వం
ఆపై వైసీపీ అధికారంలోకి.. ప్రాజెక్టుపై అయిష్టత
భూసేకరణ సాకుతో తొక్కిపెట్టిన వైసీపీ సర్కారు
సొంతంగా నిర్మించాలని యోచిస్తున్న రైల్వే శాఖ
విజయవాడ బైపాస్‌లైన్‌లో అంతర్భాగంగా నిర్మించే యోచన త్వరలోనే
రైల్వే బోర్డు దృష్టికి..ఆమోదముద్రకు చాన్స్!
విజయవాడ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైల్వేలైన్ ప్రాజెక్టు మరోసారి తెరమీదకొచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడపై రద్దీ బారాన్ని తగ్గించేందుకు అనేక అంశాలపై ఉన్నతాధికారులు కొంతకాలంగా దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ బైపాస్ రైల్వేలైన్ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అయిష్టం కారణంగా ఇంతవరకు పట్టాలెక్కని అమరావతి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. విజయవాడ బైపాస్ రైల్వేలైన్ కింద దీన్ని సొంతంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని త్వరలోనే రైల్వే బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్టు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయంలో నవ్యాంధ్ర నూతన రాజధానిలో రైల్వే కనెక్టివిటీ కోసం.. కేంద్రం నుంచి నూతన రైలు మార్గం ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్ కేటాయించగా.. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు. విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. 2017-18 బడ్జెట్‌లో బడ్జెట్‌ను కేటాయించారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని ఎలా విధ్వంసం చేసిందో.. అమరావతి నూతన రైలు ప్రాజెక్టు పట్ల కూడా అంతే చిన్నచూపు చూపింది.
రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని కాస్ట్ షేరింగ్ అడగగా.. అందుకు అంగీకరించింది. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత భూసేకరణ భారం భరించలేమన్న సాకుతో ఈ అంశాన్ని తొక్కిపట్టింది. అప్పట్లో అమరావతి రైల్వే లైన్ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కి.మీ. సింగిల్ లైన్, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కి.మీ. సింగిల్ లైన్, కృష్ణా నది మీదుగా 3 కి.మీ. మేర నూతన బ్రిడ్జి నిర్మాణం వంటివి ప్రతిపాదించారు. ఈ నాలుగు ప్రాజెక్టులకు కలిపి 2017-18 బడ్జెట్‌లో రూ.2800 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు వరకు 28 కి.మీ. సింగిల్ లైన్ చేపట్టాలన్నది విజయవాడ రైల్వే డివిజన్ అధికారుల ఆలోచన. ఈ ప్రాజెక్టును విజయవాడ బైపాస్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ముందుకు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే ఏడీఆర్‌ఎం డీ శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడ బైపాస్ వల్ల విజయవాడ స్టేషన్ మీద రద్దీ తగ్గించవచ్చు. మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచవచ్చు.