K. Srinivas: కులవ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి
ABN , First Publish Date - 2023-06-11T03:16:24+05:30 IST
దేశంలో కులవ్యవస్థ వల్ల అట్టడుగు కులాల వారు ఎంతగా బాధపడుతున్నారో అగ్రకులాల వారు కూడా అంతే బాధపడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్
అమలాపురం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): దేశంలో కులవ్యవస్థ వల్ల అట్టడుగు కులాల వారు ఎంతగా బాధపడుతున్నారో అగ్రకులాల వారు కూడా అంతే బాధపడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్ అధ్యక్షతన శనివారం జరిగిన స్వయం పాలన సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కులవ్యవస్థ నిర్మూలన ఎంతో అవసరమన్నారు. ‘కులాల మధ్య వివక్ష ఉండకూడదు... మనుషులంతా సమానమే’ అన్న అంబేడ్కర్ భావజాలంతో వీసీకే పార్టీ ముందుకు సాగుతోందన్నారు. సామాజికన్యాయం కోసమేకాకుండా ఆర్థిక న్యాయం, జాతీయవాదం కోసం కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం కొత్తవిముక్తి సిద్ధాంతాన్ని, కొత్త విముక్తి మార్గాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్న వీసీకే పార్టీని అందరూ ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
ఆ పార్టీ ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో అంబేడ్కర్ పేరిట అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తొలుత వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో కె.శ్రీనివా్‌సకు బాబాసాహెబ్ అంబేడ్కర్ సూర్యుడు అవార్డు, అప్పికట్ల భరత్ భూషణ్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే కాగడా అవార్డు, కవి గోరటి వెంకన్నకు జాషువా సాహిత్యమణి అవా ర్డు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ విప్లవ కవి గద్దర్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, బొంతు రమణ, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.