Share News

Anganvadi: అంగన్‌వేడి!

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:37 AM

అంగన్వాడీలు కదం తొక్కారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

Anganvadi: అంగన్‌వేడి!

కదం తొక్కిన అంగన్వాడీలు

రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇళ్లు ముట్టడి

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల గృహాలు, కార్యాలయాలు కూడా..

అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు

విజయవాడలో రణరంగం.. 600 మంది అరెస్టు

సమ్మె విరమించేదిలేదని స్పష్టీకరణ

గుండెపోటుతో కార్యకర్త మృతి

ప్రభుత్వ వైఖరే కారణమంటూ కార్యకర్తలు, ఆయాల నిరసన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అంగన్వాడీలు కదం తొక్కారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. వాటి ముందు బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు, తోపులాటలు అరెస్టులు జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్త మార్గ మధ్యలోనే గుండెపోటుతో మరణించారు. కాకినాడ జిల్లాలో అంగన్‌వాడీ సహాయకురాలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అంగన్వాడీల సమ్మె 16 రోజుకి చేరుకుంది. ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు విఫలంకావడంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల ఇళ్ల ముట్టడికి బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీగా బయలుదేరారు. వారి ఇళ్లు, కార్యాలయాల ముందు బెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వినతిప్రతాలు అందించారు. అందుబాటులో లేకుంటే, గోడలకు, గేట్లకు వినతిప్రతాలు అతికించి వెనుదిరిగారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పలాసలో పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇళ్ల వద్ద అంగన్వాడీలు బైఠాయించారు. దీంతో పోలీసు బలగాలు భారీగా మొహరించాయి.

మంత్రి ధర్మాన, స్పీకర్‌ తమ్మినేని అందుబాటులో లేరు. దీంతో మంత్రి ధర్మాన కుమారుడు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు అంగన్వాడీల వినతిపత్రం స్వీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. మంత్రి ఇంట్లో లేకపోవటంతో వినతిపత్రాన్ని ఇంటి గేటుకు కట్టి వచ్చారు. కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. అక్కడ రాష్ట్ర మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములుకు వినతి పత్రం అందజేశారు. కడపలో ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి సుమారు రెండుగంటల పాటు ధర్నా నిర్వహించారు. ఏలూరుజిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ నుంచి ర్యాలీగా నాని ఇంటికి చేరుకోగా, పోలీసులు బారికేడ్‌లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. తోసుకుని వెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు రేషన్‌ వాహనాన్ని అడ్డుపెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఐదుగురు ప్రతినిధులను లోనికి అనుమతించారు. వారు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. విజయనగరం జిల్లాలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, గరివిడిలోని మంత్రి బొత్స క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే కోన రఘుపతి వాహనాన్ని అంగన్వాడీలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చడానికి కృషి చేస్తోందని తెలిపారు. రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఇంటిని ముట్టడించి, ఆయన బయటకు రావడంతో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్‌ ఇంటిని, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. తిరుపతి జిల్లాలో మంత్రి రోజా ఇంటికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీటీడీ చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించిన అంగన్వాడీలు మధ్యాహ్నం ఆయన ఇంటికి రాగానే వినతిపత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాకేంద్రంలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి లేకపోవడంతో ఆయన పీఏకు వినతిపత్రాన్ని అందజేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ భట్నవిల్లిలో రవాణా మంత్రి పినిపే విశ్వరూప్‌, రామచంద్రపురంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇళ్లను ముట్టడించారు. మంత్రి వేణు అంగన్వాడీలతో మాట్లాడి వినతిపత్రం స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి వినతిపత్రం ఇచ్చారు. కాకినాడ జిల్లా తుని రూరల్‌ మండలం ఎస్‌.అన్నవరంలో మంత్రి దాడిశెట్టి రాజా ఇంటి ముట్టడి ఉద్రికత్తకు దారితీసింది. విజయవాడలోని ధర్నాచౌక్‌ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా ఎమ్మెల్యేల ఇళ్లకు బయలుదేరడంతో పోలీసులు అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ అంగన్వాడీలు రోడ్డు మీదకు రాగా, సుమారు 500 నుంచి 600 మందిని అరెస్టు చేసి వ్యాన్‌లలో వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ధర్నా శిబిరంలోని టెంట్‌ను పోలీసులు కూల్చివేసి పక్కన పడేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. విశాఖపట్నంలో అంగన్వాడీలు ప్లేట్లపై గరిటెలతో మోగించి నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే వామపక్ష పార్టీలన్నింటితో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గుండెపోటుతో అంగన్‌వాడీ కార్యకర్త మృతి

నెల్లూరు జిల్లా తరుణవాయి ఎస్సీకాలనీకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త ఇండ్ల వనమ్మ(45) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన వనమ్మ రోడ్డుపై ఆటో కోసం వేచిచూస్తూ గుండెల్లో నొప్పిఅంటూ కుప్పకూలిపోయారు. అంగన్వాడీ ఆయాలు ఆమెను కారులో బుచ్చిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే వనమ్మ మరణించారని, ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అంగన్‌వాడీలు డిమాండ్‌ చేశారు. అలాగే, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జి.వేమవరం అంగన్‌వాడీ సహాయకురాలు వెంకటలక్ష్మి వైసీపీ కార్యాలయ ముట్టడి సందర్భంగా సొమ్మసిల్లి పడిపోయారు.

Updated Date - Dec 28 , 2023 | 08:31 AM