Viveka's murder case: కుట్రలు బట్టబయలు!

ABN , First Publish Date - 2023-07-22T01:55:47+05:30 IST

అటు కీలక వ్యక్తుల వాంగ్మూలాలు... ఇటు సాంకేతిక ఆధారాలతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు! వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని కుట్రలు, వాస్తవాలు బయటపడుతున్నాయి.

Viveka's murder case: కుట్రలు బట్టబయలు!

వివేకా హత్య కేసులో మరో చార్జిషీటు దాఖలు

కీలక వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు

టెక్నాలజీతో బయటికి లాగుతున్న సీబీఐ

ఫొటోలతో సహా నిందితుల లొకేషన్‌

హత్యకు ముందు, తర్వాత వారంతా

అవినాశ్‌, భాస్కర్‌ రెడ్డితో ‘టచ్‌’లోనే

కాల్స్‌, వాట్సాప్‌ యాక్టివిటీ గుర్తింపు

వివేకా ఇంట్లో వైఫైకి

ఎవరెవరు కనెక్ట్‌ అయ్యారు?

ఆధారాల కోసం అమెరికా దాకా!

మొబైల్‌ ఫోన్‌లు త్రివేండ్రం సీడాక్‌కు

ఆ నివేదికలు రావాల్సి ఉందన్న సీబీఐ

సీబీఐ చెప్పిన వైఎస్‌ కుటుంబ కథ

ఇంటి పేరు ఒకటే అయినా... వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కుటుంబాలు వేర్వేరు. రాజారెడ్డి హయాం నుంచే వాళ్లకు సరిపడదు. వైఎస్‌ వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు చిన్న కొండారెడ్డి. రెండో భార్య కుమారుడు రాజారెడ్డి. చిన్న కొండారెడ్డికి రాజారెడ్డి ఆర్థికసాయం చేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చిన్న కొండారెడ్డికి చెందిన కొన్ని ఆస్తులను రాజారెడ్డి తన పేరిట రాయించుకున్నారు. ఈ వ్యవహారంపై చిన్న కొండారెడ్డి కుమారులైన వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (అవినాశ్‌ తండ్రి) తదితరులు రాజారెడ్డి కుటుంబంపై కోపంగా ఉండేవారు.

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): అటు కీలక వ్యక్తుల వాంగ్మూలాలు... ఇటు సాంకేతిక ఆధారాలతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు! వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని కుట్రలు, వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో సీబీఐ మరో రెండో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. జూన్‌ 30న హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు 145 పేజీల సప్లిమెంటరీ చార్జిషీటును సమర్పించింది. అందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. అదే సమయంలో... జగన్‌ సోదరి, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురి వాంగ్మూలాలు బయటికి వచ్చాయి. అన్నింటి సారాంశం ఒక్కటే... వివేకాను హత్య చేయించింది అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి! హత్యకు కుట్రపన్నింది దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి! 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అంతకుముందు, ఆ తర్వాత హత్యలోప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో ఎప్పుడెప్పుడు, ఎలా ‘టచ్‌’లో ఉన్నారో సీబీఐ తన చార్జిషీటులో వెల్లడించింది.

గతంలో కాల్‌ డేటా రికార్డ్‌, గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ వంటి సాంకేతిక ఆధారాలు ప్రస్తావించిన సీబీఐ... నిందితులు వివేకా హత్యకు ముందు, తర్వాత అవినాశ్‌ రెడ్డి ఇంట్లో, బయటి పరిసరాల్లోనే ఉన్నారని నిర్ధారిస్తూ ‘లొకేషన్‌’ ఫొటోలను కూడా చార్జిషీటులో పొందుపరిచింది. నిందితులను, కుట్రదారులను పక్కాగా ఫిక్స్‌ చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. హత్యకేసులో సాంకేతిక సహాయం కోసం సీబీఐ అమెరికాను కూడా సంప్రదిస్తోంది. ‘‘వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన నివాసంలోని వైఫై రౌటర్‌కు ఎవరెవరు కనెక్ట్‌ అయ్యారు?’’ అనే విషయం తెలుసుకునేందుకు... అమెరికాతో భారత్‌కు ఉన్న మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ (ఎంఎల్‌ఏటీ) కింద గత ఏడాది జూన్‌ 20న కేంద్ర హోంశాఖ ద్వారా సీబీఐ విజ్ఞప్తి పంపింది. సీబీఐ కోరిన వివరాలపై అమెరికా అధికారులు మూడుసార్లు అదనపు సమాచారం కోరగా... సీబీఐ వాటిపై స్పష్టత ఇచ్చింది. అమెరికా అధికారుల నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ.. సదరు ఆధారాలు అందిన తర్వాత కోర్టుకు అందజేస్తామని పేర్కొంది. వివేకాతో రాయించిన లేఖను ఇప్పటికే నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎ్‌ఫఎ్‌సఎల్‌ నుంచి నివేదిక రావాల్సి ఉందని.. దానిపై స్పష్టత వస్తే నివేదికను కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ పేర్కొంది. ఇక... దర్యాప్తులో భాగంగా సీజ్‌ చేసిన పలువురి మొబైల్‌ ఫోన్లను త్రివేండ్రంలోని సీడాక్‌కు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం పంపామని, ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. సీబీఐ చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు...

ఎమ్మెల్సీ టికెట్‌ రగడ..

2014 సాధారణ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ భాస్కర్‌రెడ్డి కుమారుడు అవినాశ్‌ రెడ్డికి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వివేకాకు ఎమ్మెల్యే, ఎంపీ ఏ టికెట్‌ దక్కలేదు. 2017లో కడప ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారు. ఈ ఎమ్మెల్సీ టికెట్‌ను వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి తన సన్నిహితుడైన డి.శివశంకర్‌ రెడ్డి (ఏ-5)కి ఇప్పించాలనుకున్నా... కుదరలేదు. దీంతో వివేకాను ఓడించేందుకు అంతా ఒక్కటయ్యారు. వివేకాతో సన్నిహితంగా మెలిగే గంగిరెడ్డి సహాయంతో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వివేకా భాస్కర్‌రెడ్డికి ఇంటికి వెళ్లి.. తన ఓటమికి మీరే కారణమని తిట్టారు. గంగిరెడ్డిని కూడా నమ్మడం మానేశారు.

1.jpg

ఎంపీ టికెట్‌తో తారస్థాయికి..

2019లో కడప ఎంపీ టికెట్‌ అవినాశ్‌రెడ్డికి ఇవ్వరాదని.. విజయలక్ష్మికి లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారు. జగన్‌ తనకు టికెట్‌ ఇవ్వడని తెలిసినప్పటికీ... వివేకా ప్రతిపాదన మేరకు కడప ఎంపీగా పోటీచేయడానికి షర్మిల అంగీకరించారు. కడప ఎంపీ టికెట్‌ తమకు రాకుండా అడ్డుకుంటున్న వివేకాను హత్య చేయాలని భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కుట్ర చేశారు. ఇందుకు వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డిని ఎంచుకున్నారు. బెంగళూరు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో వివేకాతోపాటు గంగిరెడ్డి (ఏ-1), సునీల్‌యాదవ్‌(ఏ-4) సైతం పలుమార్లు వెళ్లారు. కమీషన్‌లో 50 శాతం వాటా ఇవ్వాలని గంగిరెడ్డి డిమాండ్‌ చేయడంపై వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే వాటా అడిగేంత పెద్దవాడివి అయ్యావా అని తిట్టారు. వీరిద్దరూ పరస్పరం దూషించుకున్న వ్యవహారాన్ని అక్కడి సాక్షులు నిర్ధారించారు.

ఇంకా... వివేకాతో వివిధ అంశాల్లో విభేదాలున్న సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిని గంగిరెడ్డి ఎంచుకున్నాడు. వివేకాను హత్య చేస్తే భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారని ఇతర నిందితులను గంగిరెడ్డి ఒప్పించాడు. తన ఇంట్లోనే ముగ్గురు నిందితులతో సమావేశాలు నిర్వహించాడు. ‘‘భయపడొద్దు. దీని వెనుక చాలా శక్తివంతమైన వ్యక్తులున్నారు’’ అని భరోసా ఇచ్చాడు. ‘వాళ్లెవరు’ అని దస్తగిరి (అప్రూవర్‌) అడగ్గా... భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌ రెడ్డి పేర్లు చెప్పాడు. ‘‘శివశంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను. వివేకా వద్ద చాలాకాలం డ్రైవర్‌గా చేసి ఏం సంపాదించావు. ఈ పనిచేయి నీ లైఫ్‌ సెటిల్‌ చేస్తా’’ అని దస్తగిరికి భరోసా ఇచ్చాడు. దస్తగిరికి నమ్మకం కలిగించేందుకు... నేరుగా శివశంకర్‌రెడ్డితో మాట్లాడించారు. ‘‘గంగిరెడ్డి చెప్పినట్లు చేయండి. మేం ఉన్నామని చెప్పాను కదా! నీకెందుకు అనుమానం’’ అని శివశంకర్‌ రెడ్డి భరోసా ఇచ్చాడు.

రెక్కీ ఇలా...

వివేకా హత్యకు ముందు నిందితులు పక్కాగా రెక్కీ నిర్వహించారు. గూగుల్‌ టేకౌట్‌ సమాచారం ప్రకారం 2019 మార్చి 13, 14 తేదీల్లో దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, శివశంకర్‌ రెడ్డిల లొకేషన్‌ భాస్కర్‌రెడ్డి ఇంటివద్ద కనిపించింది. వివేకా ఇంట్లో ఉంటూ వారి వ్యవసాయ పనులు చూసే పెండంటి రాజశేఖర్‌ కాణిపాకం వెళ్లేందుకు సెలవు పెట్టారు. వాచ్‌మన్‌ రంగన్న ద్వారా రాజశేఖర్‌కు ఫోన్‌ చేయించి... 15వ తేదీనే అతను తిరిగి వస్తాడని నిర్ధారించుకున్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి కూడా 14వ తేదీ సాయంత్రం తనకు ఫోన్‌ చేసి ఎప్పుడు తిరిగి వస్తావని అడిగినట్లు రాజశేఖర్‌ తెలిపాడు. వివేకా ఒక్కరే ఇంట్లో ఉంటారని నిర్ధారించుకుని... 14వ తేదీ రాత్రి ఆయనను హత్య చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

గొడ్డలి.. వేటు..

పులివెందులలో గొడ్డలి కొంటే అందరికీ అనుమానం వస్తుందని... కదిరి నుంచి తీసుకురావాలని దస్తగిరిని సునీల్‌ యాదవ్‌ అక్కడికి పంపించాడు. గంగిరెడ్డి 14న మైదుకూరు ప్రచారానికి వెళ్లిన వివేకాతోనేఉన్నాడు. సునీల్‌ యాదవ్‌ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంట్లో దస్తగిరి కోసం వేచి ఉన్నాడు. సాయంత్రం సమయంలో ఉదయ్‌కుమార్‌ రెడ్డి కూడా అక్కడికి వచ్చాడు. వీరంతా రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా తేలింది. వివేకా ఎక్కడ ఉన్నారు.. పులివెందులకు ఎప్పుడు వస్తారనే విషయాలను గంగిరెడ్డి ద్వారా శివశంకర్‌ రెడ్డి తెలుసుకున్నారు. వివేకా హత్యకు ముందు తర్వాత శివంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఒకే టవర్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. రాత్రి 11.24 గంటలకు వివేకా పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకు సునీల్‌ యాదవ్‌, దస్తగిరి, ఉమాశంకర్‌ రెడ్డి వివేకా ఇంటి సమీపంలో మద్యం తాగుతూ వేచి ఉన్నారు. గంగిరెడ్డి తనతోపాటే రాత్రి అక్కడే పడుకుంటాడని.. నువ్వు వెళ్లి పడుకోవాలని వివేకా తన వాచ్‌మన్‌ రంగన్నతో చెప్పారు. అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ముగ్గురు నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించడానికి గంగిరెడ్డి సాయం చేశాడు. వాళ్లు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెటిల్‌మెంట్‌ గురించి మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి చెప్పాడు. ‘‘నీకు చాలాసార్లు చెప్పాను. ఇచ్చేవాడినైతే ఎప్పుడో ఇచ్చేవాడిని. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. తర్వాత కావాలంటే ఇస్తాను’’ అని బదులిచ్చారు. ఆ తర్వాత ఉమాశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారు.

Updated Date - 2023-07-22T03:00:19+05:30 IST