AP Lorry Owners Association : ఈ బాదుడు భరించలేం
ABN , First Publish Date - 2023-05-17T03:11:29+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పెంపుదల నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోకపోతే లారీల బంద్‌కు వెనకాడమని, తమకు మరో గత్యంతరం కూడా లేదని ఏపీ లారీ
● త్రైమాసిక పన్ను పెంపు వద్దు
● కాదంటే లారీల బంద్!
● రోడ్డు సెస్ పేరుతో బాదుడు..రోడ్లు అధ్వానం
● గ్రీన్ ట్యాక్స్ పేరుతో 20 వేలు వసూలు చేస్తున్నారు
● దేశంలోనే ఎక్కడా ఇంత భారీగా లేదు
● ఏపీ లారీ యజమానుల సంఘం ఆగ్రహం
విజయవాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పెంపుదల నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోకపోతే లారీల బంద్‌కు వెనకాడమని, తమకు మరో గత్యంతరం కూడా లేదని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు అన్నారు. త్వరలోనే లారీ యజమానుల జిల్లా సంఘాలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పన్ను పెంచుతూ జారీచేసిన జీవోకి వ్యతిరేకంగా మంళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ద్వారా ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇచ్చిందని, అందులో త్రైమాసిక పన్ను 25 – 35 శాతం పెంచుతామని పొందుపరిచారన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ పై రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. తమిళనాడులో రూ. 200, కర్ణాటకలో రూ. 500 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం 7–10 ఏళ్ల వాహనాలకు త్రైమాసిక పన్నులో సగం, 10–12 సంవత్సరాల వాహనాలకు పూర్తి త్రైమాసిక పన్ను, 12 సంవత్సరాలు దాటిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నుల చొప్పున గ్రీన్ ట్యాక్స్ భారం వేస్తున్నారని చెప్పారు. నేషనల్ పర్మిట్ వాహన యజమానులు ఇతర రాష్ట్రాలతో పోటీలు పడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు డబ్బులు కట్టినా కార్డులు ఇవ్వటం లేదని తెలిపారు. ఏపీకి చెందిన రవాణా వాహనాలు సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన ఎన్‌ఐసీ డేటాబేస్‌లో ఉంటేనే ఇతర రాష్ట్రాలలో దానిని చూసి వే బిల్లు ఇస్తారని తెలిపారు. కానీ ‘వాహన్ పరివాహన్’ సైట్‌లో ఏపీ లారీల వాహనాల నంబర్లు కనిపించటం లేదన్నారు. దీనివల్ల ప్రతిసారీ ఉన్నతాధికారుల చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో త్రైమాసిక పన్నును 25 శాతం నుంచి 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల చేయటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని త్రైమాసిక పన్ను పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని , లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ రూ. 200 కడితే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు గ్రీన్ ట్యాక్స్ వసూలు చే స్తోందన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో తాము అప్పటి ఉమ్మడి గవర్నర్‌ను కలిసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఇచ్చినందున పదేళ్లపాటు తెలంగాణాకు మాకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తే కేవలం ఒక్క ఏడాదే ఇవ్వటం జరిగిందన్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చున్నది లేదని, పరిష్కరించినదీ లేదన్నారు. తెలుగు రాష్ట్రాలలో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వటానికి 9 సంవత్సరాలుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వటానికి పాసెంజర్ బస్సులు, లారీలకు ముడిపెడుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో బళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవటమే లారీ యజమానులు చేసుకున్న దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ప్రభుత్వానికి సాధారణంగా వచ్చే ఆదాయం పోతుందన్నారు. ధరల పెరుగుదల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఆయిల్‌ను లారీ యజమానులు కొనటం లేదన్నారు. ధరలు తగ్గిస్తే ఇక్కడే ఆయిల్ కొంటారని, అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వానికి చెప్పామన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకు వెళ్లామని, రవాణా ప్రిన్సిపల్ సెక్ర టరీ క్రిష్ణబాబుకు చెప్పారని, ఆ తర్వాత అది మరుగున పడిపోయిందన్నారు.
ఆర్టీసీ కర్ణాటక నుంచి తెచ్చుకుంటోంది
రాష్ట్రంలో డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఏపీఎస్‌ఆర్‌టీసీ కర్ణాటక నుంచి ఆయిల్ తెచ్చుకుంటోందని ఈశ్వరరావు అన్నారు. ఈ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ సమస్య పరిష్కరించకుండా లేనిపోని సమస్యలను సృష్టిస్తోందన్నారు. లారీ రవాణా రంగంప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నదన్నారు. రోడ్ల మీద లారీలు తిరుగుతున్నాయని, వాటిని అభివృద్ధి చేయటం కోసమని డీజిల్ సెస్ విధించారని, వసూలు చేస్తున్న సెస్‌తో రోడ్లు వేస్తున్నారంటే అదీ లేదన్నారు. రాష్ట్రంలోని రోడ్లపై వాహనాలు వెళ్లాలంటే కమాన్ కట్టలు విరిగిపోయే పరిస్తితి నెలకొందన్నారు. లారీలకు ఎంత పెంచినా ఇబ్బంది లేదని, ఆ డబ్బుని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారని అధికారులు భావిస్తున్నార ని అన్నారు. మాకు గిట్టినా గిట్టకపోయినా.. వాహనాలు తిప్పాలని, ఫైనాన్స్‌లు కట్టాలని, అడ్వాన్స్‌గా త్రైమాసిక పన్నులు, పర్మిట్ ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం 16 నుంచి 9 శాతం రోడ్డు ఖర్చును తగ్గించాలని చెబుతోందని టోల్ ఛార్జీల పేరుతో నడ్డి విరుస్తోందన్నారు. కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం కూడా లారీ రవాణా రంగాన్ని పట్టించుకోవట లేదన్నారు. రవాణా రంగాన్ని పెద్ద పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్యం కింద ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తాము భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అయిందని, 23 ఉమ్మడి జిల్లాలకు త్రైమాసిక పన్ను చెల్లిస్తున్నామని, రెండు రాష్ట్రాలు విడిపోయాక జిల్లాలు తగ్గినా అవే పన్నులు వసూలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిదీ తెలంగాణతో పోల్చి చూస్తోందని, అలాంటి తెలంగాణలో కూడా రూ. 1500 మేర గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు. రేట్లు పెంచమని అడిగితే అది కూడా చేయటం లేదన్నారు. అది చేస్తే ప్రజలలో తిరుగుబాటు వస్తుందని భయపడుతోందన్నారు. నేషనల్ పర్మిట్ అనేసరికి కలకత్తాకు లోడింగ్ ఉంటే.. ఎవరు తక్కువ రేటుకు కిరాయికి వస్తారో వారికి ఇస్తారే తప్ప.. ఆంధ్రానా తమిళనాడా అన్నది పార్టీలు చూడవన్నారు. లీటర్‌కు రూ.9 చొప్పున రోడ్డు సెస్ తీసుకుని లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని, టోల్ ఎందుకు వసూలు చేస్తోందని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి మాట్లాడుతూ త్రైమాసిక పన్ను పెంపుపై ప్రభుత్వానికి అభ్యంతరాలను తెలిపామన్నారు.