పన్నులు పెంచితే పొరుగు రాష్ట్రాలకే
ABN , First Publish Date - 2023-01-18T03:11:11+05:30 IST
రాష్ట్రంలో పన్నులు పెంచితే పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతామని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తేల్చిచెప్పింది. లారీ యజమానులకు ప్రభుత్వ ప్రోత్సాహం దక్కకపోతే ఆంధ్రాలో ఉన్న లారీలు అడ్రస్ మార్చుకుని సరిహద్దు రాష్ర్టాలలోకి వెళ్లిపోతాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు లేఖ రాశారు.
అడ్రస్ మార్చుకుని సరిహద్దులు దాటిపోతాం
రవాణాకు ఏపీ ప్రోత్సాహకరంగా లేదు
విభజన తర్వాతా ‘ఉమ్మడి’ నాటి పన్నులా?
తగ్గించాలని మొత్తుకున్నా పట్టించుకోరేం
సీఎంకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ
అమరావతి, విజయవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పన్నులు పెంచితే పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతామని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తేల్చిచెప్పింది. లారీ యజమానులకు ప్రభుత్వ ప్రోత్సాహం దక్కకపోతే ఆంధ్రాలో ఉన్న లారీలు అడ్రస్ మార్చుకుని సరిహద్దు రాష్ర్టాలలోకి వెళ్లిపోతాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్రంలో రవాణారంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను జగన్‌కు వివరిస్తూ రాసిన ఈ లేఖ సంచలనం సృష్టిస్తోంది. రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను 25నుంచి 30శాతం పెంచేందుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం... ఇటీవల గజిట్ విడుదల చేసింది. రవాణా రంగ విజ్ఞప్తులు పట్టంచుకోకుండా ఫిబ్రవరి నుంచి బాదుడుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ లారీ యజమానులు మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కొవిడ్ అనంతరం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిన రవాణా రంగాన్ని డీజిల్ ధరలు, అదనపు సెస్‌లు దాదాపు నిర్వీర్యం చేస్తున్నాయంటూ ఈశ్వర రావు ఆ లేఖలో పేర్కొన్నారు.
కొవిడ్ సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు రెండు, మూడు త్రైమాసిక పన్నులు మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రూపాయి కూడా వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరిమానాలు వెయ్యి నుంచి ఏకంగా 20వేలకు పెంచిన జగన్ ప్రభుత్వం.. తాము ఎన్నిసార్లు వినతులిచ్చినా స్పందించడం లేదని ఈశ్వర రావు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల లారీల అద్దెలతో పోటీ పడలేక ఏపీలో లారీల యజమానులు నష్టాలపాలై ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు లారీ యజమాని అంటే గౌరవం ఉండేదని, ఇలాంటి దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను పెంచాలన్న ప్రాథమిక నోటిఫికేషన్ విరమించుకోవాలని, లేదంటే మిగిలిన అర కొర లారీలు సైతం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. కర్ణాటక కంటే రూ. 12, తమిళనాడు కంటే రూ. 4-5ల మేర డీజిల్ ధర ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు సెస్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అపరాధ రుసుములను రూ. వెయ్యి నుంచి రూ. 20వేల వరకు అనూహ్యంగా పెంచుతూ జారీచేసిన జీవో నంబర్ 21 మా పాలిట శరాఘాతంగా మారింది. రూ. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను రూ. 20 వేలకు పెంచుతూ జీవో నంబర్ 67ను జారీ చేయడం మరో పెను విఘాతం. ఈ రెండు జీవోలను సవరించాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినా స్పందన లేదు. తమిళనాడు, కర్ణాటకలో ఇప్పటికీ గ్రీన్‌ట్యాక్స్ కింద రూ. 200 - రూ.500 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా 23 జిల్లాలకు అప్పట్లో చెల్లించిన ట్యాక్స్‌లనే 13 జిల్లాలకు చెల్లించాల్సి వస్తోంది,. వాటిని తగ్గించమని అనేకమార్లు కోరినా ప్రభుత్వం తగ్గించలేదు.
రాష్ట్రంలోని 13 జిల్లాలకే ఫుల్ ట్యాక్స్ చెల్లిస్తూ తెలంగాణకు వెళ్లాలంటే అధికంగా పన్ను చెల్లించి టెంపరరీ పర్మిట్లు తీసుకోవటం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. విభజన జరిగి ఏడేళ్లు దాటినా ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయటం లేదు. సరిహద్దు రాష్ర్టాల కంటే కూడా ఏపీలో లారీ యజమానులపై పన్నుల రూపంలో సుమారుగా సాలీనా రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల మేర అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలోని సరుకురవాణా వాహన యజమానులు ఇప్పటికే ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ మీద 25 నుంచి 30 శాతం పెంచితే పన్నులు చెల్లించే పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో వేలాదిసంఖ్యలో లారీలను ఈఐఎంలు కట్టలేదని ఫైనాన్షియర్లు లాక్కుపోయారు. లారీ యజమానులు తమకు ఉన్న కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తోంది’’ అని ఈశ్వరరావు వాపోయారు. ఈ లేఖను ముఖ్యమంత్రితోపాటు రవాణాశాఖ మంత్రి, రవాణా -రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెట్రకరీ, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌లకు కూడా పంపించారు.