అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2023-06-22T05:02:12+05:30 IST
అరాచక శక్తులు, అవినీతిపరుల చేతుల్లోంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
ఒంగోలు నుంచి ప్రారంభమైన టీడీపీ జోన్-4 బస్సు యాత్ర
ఒంగోలు, బాపట్ల, జూన్ 21(ఆంధ్రజ్యోతి): అరాచక శక్తులు, అవినీతిపరుల చేతుల్లోంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా జోన్-4 పరిధిలోని కార్యక్రమం బుధవారం ఒంగోలు నుంచి ప్రారంభమైంది. టీడీపీ శాసనసభాపక్ష విప్, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, చిత్తూరు జిల్లా నేత పులిపర్తి నాని, పలువురు నేతలు బస్సు యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ఒంగోలులోని టీడీపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీని కొత్తపట్నం వరకు నిర్వహించారు. అద్దంకి బస్టాండు సెంటర్‌లోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. చింతల వద్ద నిర్మించి నిరుపయోగంగా ఉన్న టిడ్కో ఇళ్ల సముదాయం, బకింగ్‌హామ్ కాలువ బ్రిడ్జి వద్ద సెల్ఫీ చాలెంజ్ విసిరారు. రాత్రికి కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం కొండపి, 25న కనిగిరి, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. కాగా, బుధవారం కురిసిన వర్షాలకు చీరాల పట్టణం నీళ్లతో నిండిపోయింది. ఆ నీళ్లలోనే భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెక్క రిక్షాపై నేతలు ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, చీరాల టీడీపీ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, పిల్లి మాణిక్యాలరావు పాల్గొన్నారు.