Avinash: ముందే తెలుసు!
ABN , First Publish Date - 2023-05-27T03:02:43+05:30 IST
‘‘వైఎస్ వివేకానంద రెడ్డి మరణం గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా ఉదయం 6.15 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ... అంతకంటే చాలాముందే నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్‌కు సమాచారం అందింది.
హత్యకు ముందూ, తర్వాతా వాట్సాప్ కాల్స్‌లో అవినాశ్
జగన్‌కు సమాచారమివ్వడంలో ఆయన పాత్ర తేల్చాలి
అర్ధరాత్రి 1.30 గంటలకు వివేకా ఇంట్లోకి హంతకులు
ముందు, హత్య తర్వాత అవినాశ్ ఇంట్లో సునీల్ యాదవ్
విచారణకు సహకరించని ఎంపీ.. జవాబులు దాటవేత
కావాలనే విచారణకు గైర్హాజరు.. దర్యాప్తునకు ఆటంకాలు
22వ తేదీన అరెస్టు చేయాలనే కర్నూలుకు వెళ్లాం
ఆస్పత్రికి వెళ్లకుండా దారి మూసిన ఎంపీ అనుచరులు
శాంతిభద్రతల సమస్యపై ఆందోళన..
కర్నూలు ఎస్పీ సహకారం కూడా కోరాం
అరెస్టు చేసి ప్రశ్నిస్తేనే విస్తృత కుట్ర బయటపడేది
సంచలన విషయాలు వెల్లడించిన సీబీఐ
తెలంగాణ హైకోర్టులో అదనపు కౌంటర్ అఫిడవిట్
హైకోర్టుకు తెలిపిన సీబీఐ
తాడేపల్లిని టచ్ చేసి..
వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే ‘తాడేపల్లి’ తలుపు తట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ఇప్పుడు నేరుగా... జగన్మోహన్ రెడ్డి పేరునే బయటికి తెచ్చింది.
అవినాశ్‌కు నిద్రలేని రాత్రి..
సీబీఐ చెప్పిన ప్రకారం... 2019 మార్చి 14వ తేదీ అవినాశ్ రెడ్డి నిద్రలేని రాత్రి గడిపారు. అర్ధరాత్రి 12.27 నుంచి 1.10 వరకు వాట్సాప్ కాల్స్‌లో బిజీ! ఆ తర్వాత... తెల్లవారుజామున 4.10 మళ్లీ వాట్సాప్ సంభాషణలు షురూ!
టైమ్ అండ్ టైమింగ్...
వివేకా మరణించారన్న వార్త 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. అంతకంటే చాలా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందని సీబీఐ ఇప్పుడు వెల్లడించింది. అవినాశ్ ఫోన్ కాల్స్... జగన్‌కు సమాచారం అందిన టైమ్ ఇప్పుడు చాలా కీలకం!
గూగుల్ టేకౌట్... ఐపీడీఆర్
వివేకా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ‘లొకేషన్’ను సీబీఐ గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించింది. ఇప్పుడు... అవినాశ్ రెడ్డి ఫోన్ యాక్టివిటీని ‘ఐపీడీఆర్’ ద్వారా విశ్లేషించింది. ఐపీడీఆర్ అంటే... ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డ్. మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఉపయోగించి చేసే కాల్స్, బ్రౌజింగ్, మెయిల్, చాటింగ్ యాక్టివిటీ ఐపీడీఆర్‌లో నిక్షిప్తమవుతుంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి మరణం గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా ఉదయం 6.15 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ... అంతకంటే చాలాముందే నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్‌కు సమాచారం అందింది. ఇందులో అవినాశ్ పాత్ర ఏమిటో తేల్చాలి’’....ఇదీ సీబీఐ బయటపెట్టిన సంచలన విషయం! వివేకా హత్య కేసులో ‘విస్తృత కుట్ర’ను వెలికి తీసే క్రమంలో వెలుగు చూసిన కోణం! సొంత చిన్నాన్న వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని... ఆ రోజు తెల్లవారుజామున లోట్‌సపాండ్ ప్యాలె్‌సలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారికి ఈ విషయం చెప్పారని ‘ఆంధ్రజ్యోతి’ ఇది వరకే వెల్లడించింది. ఇదే అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంను కూడా సీబీఐ ప్రశ్నించింది. ‘బాబాయ్ ఇక లేరు అని జగన్ చెప్పడం నిజం. కారణం మేం అడగలేదు. ఆయన చెప్పలేదు. అప్పుడు ఎంతో నాకు టైమ్ గుర్తులేదు’ అని అజేయ కల్లం మీడియాకు ‘తప్పించుకునేలా’ చెప్పారు. కానీ... సీబీఐ ఈ ‘టైమ్ అండ్ టైమింగ్’పై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసులో సహ నిందితుడిగా ప్రకటించిన అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావని... ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టులో అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులోనే... నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అనేక సంచలన అంశాలను బయటపెట్టింది.
హత్యకు ముందూ, తర్వాత వాట్సాప్ ‘కాల్స్’
2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున (14వ తేదీ అర్ధరాత్రి తర్వాత) పులివెందులలోని తన సొంత ఇంట్లోనే వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. హత్యకు ముందూ... ఆ తర్వాత వైఎస్ అవినాశ్ రెడ్డి నుంచి అనేక వాట్సాప్ కాల్స్ వెళ్లాయని సీబీఐ తన అదనపు కౌంటర్ అఫిడవిట్‌లో వెల్లడించింది. అవినాశ్ రెడ్డి మొబైల్ ఫోన్ ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డ్)ను విశ్లేషించింది. ‘‘14వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12.27 నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్స్‌లో బిజీగా ఉన్నారు. నిందితులు రాత్రి 1.30 గంటల సమయంలో వివేకా ఇంటి ప్రహరీ దూకి లోపలికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4.11 గంటలకు మళ్లీ వాట్సాప్ సంభాషణలు చేసినట్లు ఐపీడీఆర్ విశ్లేషణలో స్పష్టమైంది. ఇక... ఈ కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ కూడా హత్యకు ముందూ, తర్వాతా అవినాశ్ రెడ్డి ఇంటి లోపలే ఉన్నట్లు మొబైల్‌ఫోన్ లొకేషన్ ద్వారా తేటతెల్లమైంది. వివేకా మరణం గురించి ఆయన పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి ద్వారా ఉదయం 6.15 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ... అంతకంటే చాలాముందే వివేకా మరణ సమాచారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమాచారం వెళ్లిందని మా దర్యాప్తులో తేలింది.. వైఎస్ వివేకా హత్యకు ముందూ, ఆ తర్వాతా అవినాశ్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో... ఈ హత్య గురించి జగన్‌కు సమాచారం అందించడంలో అవినాశ్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉంది’’ అని సీబీఐ తన అదనపు కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది.
అరెస్టు చేసి... ప్రశ్నించాల్సిందే...
అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును అభ్యర్థించింది. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర తేలాలంటే ఆయనను అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని స్పష్టం చేసింది. ‘‘కేసు దర్యాప్తులో అవినాశ్ రెడ్డి మాతో సహకరించలేదు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. అంతేకాదు... విస్తృత కుట్రను వెలికితీసేందుకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా, మాటిమాటికీ మాట మారుస్తూ వచ్చారు. ఆయన కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఇప్పటికే కోర్టుకు వివరించాం. ఒకవైపు రాత్రి 1.58 గంటల సమయంలో నిందితుడు సునీల్ యాదవ్ అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉండటం... మరోవైపు హత్యకు ముందూ, తర్వాతా అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్స్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించి అసలు వివరాలు రాబట్టాల్సిన అవసరముంది’’ అని సీబీఐ వెల్లడించింది.
హైకోర్టు దృష్టికి హైడ్రామా...
ఈనెల 16వ తేదీ నుంచి మూడుసార్లు విచారణకు గైర్హాజరై... కర్నూలులో కొనసాగించిన హైడ్రామాను కూడా సీబీఐ తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ‘‘16వ తేదీకి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా... ముందస్తు కార్యక్రమాలున్నాయని, నాలుగు రోజులు గడువు కావాలని కోరారు. దీంతో 19వ తేదీన విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చాం. కానీ... ఆరోజూ రాలేదు. పైగా... తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకున్నాకే విచారణకు వస్తానని సమాచారం అందించారు. ఆ రోజున అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ... తల్లికి అనారోగ్యం నెపంతో కావాలనే విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు రావాలని ఫోన్‌లో కోరినా... రాలేదు. ఆయన పులివెందులకు వెళ్తున్నట్లు సమాచారం అందడంతో... మేం వెంటనే కడప ఎస్పీని సంప్రదించాం. అవినాశ్‌ను సీబీఐ ముందుకు వచ్చేలా సహకరించాలని కోరాం. కానీ.. అవినాశ్ రెడ్డి పులివెందులకు కూడా వెళ్లలేదు. కర్నూలుకు చేరుకున్నారు. ఈసారి 22వ తేదీన విచారణకు రావాలని నోటీసు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా... ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన పులివెందుల నివాసంలోనూ లేరు. దీంతో అక్కడున్న ఆయన పీఏకు నోటీసు ఇచ్చాం. అవినాశ్‌రెడ్డికి ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసు పంపించాం. అయితే... తన తల్లి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెను దగ్గరుండి చూసుకోవాలని... విచారణను వారం వాయిదా వేయాలని ఆయన కోరారు’’ అని సీబీఐ తెలిపింది.
అరెస్టు చేసేందుకే వెళ్లాం...
ఈనెల 22వ తేదీన అవినాశ్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేసేందుకు వెళ్లినప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదని సీబీఐ వెల్లడించింది. అవినాశ్ అనుచరుల ఆగడాల గురించి ప్రస్తావించింది. ‘‘అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఈనెల 22వ తేదీన కర్నూలుకు వెళ్లాం. ఆయన అనుచరులు విశ్వభారతి ఆస్పత్రి ముందు పెద్దసంఖ్యలో గుమికూడారు. దారిని మూసేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో... అవినాశ్‌ను అరెస్టు చేసేందుకు కర్నూలు ఎస్పీ సహకారం కోరాం’’ అని సీబీఐ వివరించింది. జూన్ 30వ తేదీలోగా ఈ కేసులో దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేసింది. కానీ... అవినాశ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే విచారణకు గైర్హాజరవుతూ... దర్యాప్తునకు ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపింది. వీటన్నింటి నేపథ్యంలో... ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ అభ్యర్థించింది.