Share News

అమెరికాలో ఘోరం

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:26 AM

కోనసీమకు చెందిన ఆ దంపతులు అమెరికాలో ఉంటున్న కుమార్తె, అల్లుడు, వారి పిల్లలను చూసేందుకు వెళ్లారు.

అమెరికాలో ఘోరం

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఆంఽద్రులు దుర్మరణం

అమలాపురానికి చెందిన ఒకే కుటుంబం బలి

మృతులు ఎమ్మెల్యే పొన్నాడ చిన్నాన్న కుటుంబ సభ్యులు

దంపతులు, కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు కన్నుమూత

అల్లుడి పరిస్థితి విషమం.. ఆయన స్నేహితుడూ మృతి

టెక్సాస్‌ హైవేలో వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు

అమలాపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కోనసీమకు చెందిన ఆ దంపతులు అమెరికాలో ఉంటున్న కుమార్తె, అల్లుడు, వారి పిల్లలను చూసేందుకు వెళ్లారు. కొత్త ఏడాదిలో వారితో కలసి సొంతూరుకు తిరిగి రావాలనుకున్నారు. ఇంతలోనే ఘోరం జరిగింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఐదుగురు, విశాఖకు చెందిన మరో వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. మృతులను పొన్నాడ నాగేశ్వరరావు (68), ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె పోతాబత్తుల నవీనగంగ (38), ఆమె కుమారుడు కృతిక్‌ (11), కుమార్తె నిషిత (9)గా గుర్తించారు. నాగేశ్వరరావు అల్లుడు పోతాబత్తుల లోకేశ్‌(44) తీవ్రంగా గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోకేశ్‌ స్నేహితుడు, విశాఖకు చెందిన రిషీల్డ్‌ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌కు పొన్నాడ నాగేశ్వరరావు స్వయానా చిన్నాన్న అవుతారు. వారి మరణవార్తతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లోకేశ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు.

నవంబరు 7న పొన్నాడ నాగేశ్వరరావు-సీతామహాలక్ష్మి దంపతులు కుమార్తె కుటుంబాన్ని చూసేందుకు అమెరికా వెళ్లారు. మంగళవారం అందరూ కలసి జూకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా టెక్సాస్‌ రాష్ట్రం జాన్సన్‌ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన పోతాబత్తుల లోకేశ్‌ అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొన్నాడ సతీ్‌షకుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి అమెరికన్‌ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. కాగా పొన్నాడ నాగేశ్వరరావు పెంచుకున్న మనుమడు కాతాడి లోకేశ్‌వర్మ(19) గత ఏడాది మార్చి 1న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరుస విషాద సంఘటనలతో ఆ కుటుంబం బలైంది.

Updated Date - Dec 28 , 2023 | 03:26 AM