Share News

మద్యం మృతులు ఐదు లక్షల మంది

ABN , First Publish Date - 2023-11-10T03:43:07+05:30 IST

‘‘ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్‌లో ఏటా వెయ్యి మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 12వేల మందిలోపు మృతి

మద్యం మృతులు ఐదు లక్షల మంది

ఆర్‌డీఎక్స్‌ కన్నా ప్రమాదకరం ఏపీ మద్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైర్‌

కడప, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్‌లో ఏటా వెయ్యి మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 12వేల మందిలోపు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో జగన్‌ సర్కారు మందు తాగి ఐదులక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక అనధికారికంగా లెక్క వేసుకున్నా మొత్తం ఆరు లక్షల మంది జగన్‌ మందు తాగి చనిపోయారు. ఆర్‌డీఎక్స్‌ కన్నా ఏపీ మద్యం అత్యంత ప్రమాదకరం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించిన ఆమె కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ మద్యం తాగి రోజుకు 700 మంది చనిపోతున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా జగన్‌ ఒక్క మండలాన్ని కూడా కరువుగా ప్రకటించలేదని తెలిపారు. గాలేరు నగరి పనులు 80శాతం పూర్తయ్యాయని, బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయలేదన్నారు. పిల్లకాల్వలు పూర్తిచేయని కారణంగానే గండికోట నుంచి నీళ్లు రైతులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.

2లక్షల ఇళ్లకు కేంద్రం నిధులిస్తే.. నిర్మించింది 29వేలే..

ప్రధాని మోదీ రైతులకు ఇచ్చే కిసాన్‌ నిధి రూ.6వేలు తీసుకుని రూ.12,500 తామే ఇస్తున్నట్టు జగన్‌ చెప్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే కేవలం 29వేలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా రూ.30వేలు మాత్రమే కేటాయించి, మొత్తం తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.

Updated Date - 2023-11-10T03:43:17+05:30 IST