Share News

Lok Sabha candidates : అభ్యర్థులు అటూ ఇటూ

ABN , First Publish Date - 2023-10-23T01:56:24+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు ప్రారంభించారు. పలువురు మంత్రులు,

 Lok Sabha candidates : అభ్యర్థులు అటూ ఇటూ

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై జగన్‌ కసరత్తు

కొందరు సిట్టింగ్‌లను మార్చాలని పరిశీలన

అసెంబ్లీ టికెట్‌ కావాలంటున్న మరికొందరు

ఈసారి అభ్యర్థులు అటూ ఇటూ మార్పు

రాజమండ్రి ఎంపీ స్థానానికి కన్నబాబు?

నరసాపురం నుంచి కృష్ణంరాజు భార్య?

తెరపైకి బొత్స, ధర్మాన, చెల్లుబోయిన పేర్లు

మాధవ్‌కు టికెట్‌ డౌట్‌.. ఇక్బాల్‌కు చాన్స్‌

అసెంబ్లీపై భరత్‌, గీత, ఎంవీవీ, ఆదాల గురి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పలువురు వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుకుంటున్నారు. ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో భారీమార్పులు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి సిట్టింగ్‌ ఎంపీ మార్గాని భరత్‌ ఈసారి నిడదవోలు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పంపి.. తనకు కాకినాడ రూరల్‌ టికెట్‌ ఇవ్వాలని వేణుగోపాలకృష్ణ కోరుతున్నారు. ఇక కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ వంగా గీత తాను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కోరుతున్నారు. ఆమె స్థానంలో చలమలశెట్టి సునీల్‌ను రంగంలోకి దింపడంపై జగన్‌ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అమలాపురం ఎంపీ చింతా అనూరాధ మరోసారి పోటీకి సిద్ధంగా లేరు. ఆమె అమలాపురం ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ పనితీరు బాగాలేదని భావిస్తోన్న అధిష్ఠానం బోళ్ల రాజీవ్‌ పేరును పరిశీలిస్తోందని చెబుతున్నారు. నరసాపురంలో ఎంపీ రఘురామకృష్ణరాజు స్థానంలో కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలను పోటీ చేయించాలని ఎంపీ మిథున్‌రెడ్డి సంప్రదింపులు జరిపినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు తనయుడు గోకరాజు రామరాజు పేరు పరిశీలనలో ఉంది. ఇక విజయవాడ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పొట్లూరి వరప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చినా మరో అభ్యర్థి కోసం వైసీపీ వేట మొదలెట్టిందని అంటున్నారు. గుంటూరు స్థానం కోసం బలమైన అభ్యర్థి కనిపించడం లేదని చెబుతున్నారు. రాయపాటి సాంబశివరావు కుటుంబం నుంచి ఒకరిని రంగంలోకి దింపాలన్న యోచన ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును మార్చి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డిని బరిలోకి దింపడంపై వైసీపీ ఆలోచిస్తోంది. లిక్కర్‌ స్కామ్‌లో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేరని తెలుస్తోంది. కరణం బలరామకృష్ణమూర్తిని దింపే యోచన ఉందంటున్నారు. అదే జరిగితే టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అనంత ఎంపీ తలారి రంగయ్య స్థానంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని అధిష్ఠానం యోచిస్తోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్థానంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు చాన్స్‌ ఇవ్వాలని ఆలోచిస్తోంది. హిందూపురం అసెంబ్లీ నుంచి టీఎస్‌ దీపికను రంగంలోకి దింపనున్నారు. కర్నూలు సిట్టింగ్‌ ఎంపీ సింగారి సంజీవ్‌కుమార్‌కు బదులు కొత్తవారిని దింపాలన్న యోచనలో వైసీపీ ఉంది. కేఈ శ్యామ్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరునూ పరిశీలిస్తున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపుతారు. నెల్లూరు ఎంపీ టికెట్‌ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఇచ్చే వీలుందంటున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ను లోక్‌సభకు పోటీ చేయించాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మళ్లీ వారికే టికెట్లు!

తిరుపతి సిట్టింగ్‌ ఎంపీ గురుమార్తి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కడప ఎంపీ వైవీ అవినాశ్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ అభ్యర్థిత్వంలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చునని అంటున్నారు.

తెరపైకి మంత్రుల పేర్లు!

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావును రంగంలోకి దింపాలని జగన్‌ భావిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఆమదాలవలసకు చెందిన డాక్టర్‌ శ్రీధర్‌ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నా ఆయనకు టికెట్‌ దక్కకపోవచ్చని చెబుతున్నారు. విజయనగరం లోక్‌సభ స్థానానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు బదులు మంత్రి బొత్స సత్యనారాయణను నిలిపితే ఎలా ఉంటుందని జగన్‌ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బెల్లాన చంద్రశేఖర్‌ను మారిస్తే తన భార్య బొత్స ఝాన్సీకి టికెట్‌ ఇవ్వాలని బొత్స కోరుతున్నారు. అరకు సిట్టింగ్‌ ఎంపీ జి.మాధవికి టికెట్‌ ఇవ్వడంపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీమంత్రి అవంతి శ్రీనివా్‌సను బరిలోకి దింపే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ప్రభుత్వ విప్‌, మాడుగుల ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి ఆనంద కుమార్‌ పోటీకి సుముఖతను వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-23T01:56:24+05:30 IST