Chandrababu : జైలు నుంచి జనంలోకి
ABN , First Publish Date - 2023-11-01T02:51:34+05:30 IST
ముందుగా ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయమే లోకేశ్, బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.
52 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్‌పై బాబు విడుదల
వ్యక్తుల జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరుకు న్యాయస్థానానికి ఉన్న విచక్షణాధికారాన్ని ఆయా పరిస్థితులకు అనుగుణంగా పరిమితం చేయడానికి వీల్లేదు.
ప్రతి వ్యక్తీ సంపూర్ణ, సమగ్ర వైద్య
సాయం పొందే స్వతఃసిద్ధమైన హక్కు కలిగి ఉంటారు. కస్టడీలో ఉన్న వ్యక్తులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నప్పుడు వారికి సమర్థ చికిత్స అందించేందుకు అనుమతించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంది.
- హైకోర్టు
రాజమహేంద్రవరం జైలు పరిసరాలు కిటకిట
బెయిలు వార్త తెలియగానే తరలివచ్చిన జనం
మిన్నంటిన నినాదాలు, భావోద్వేగ వాతావరణం
మనవడిని హత్తుకుని చంద్రబాబు ఆనందం
అధినేతకు అపూర్వ స్వాగతం పలికిన శ్రేణులు
రోడ్డు మార్గంలో విజయవాడకు చంద్రబాబు
నేడు ఏఐజీ బృందంతో వైద్యపరీక్షలు
మధ్యాహ్నం హైదరాబాద్‌కు బాబు పయనం
ఓవైపు ఉద్వేగం... మరోవైపు ఉత్సాహం... ఎదురు చూస్తున్న వేల కళ్లు... నింగినంటుతున్న నినాదాలు! తరలివచ్చిన జన సంద్రం!
ఇలాంటి ఒక ఉద్వేగ భరిత వాతావరణం మధ్య.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి వచ్చారు. 52రోజుల అక్రమ నిర్బంధం అనంతరం తొలిసారి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టారు.
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
అక్రమ కేసులో అరెస్టయి... బయటికి వచ్చిన ‘అధినేత’కు అపూర్వ స్వాగతం లభించింది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మంగళవారం ఉదయం 4 వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఆ వెంటనే... టీడీపీ నేతలు, అభిమానులు రాజమహేంద్రవరం జైలుకు పోటెత్తారు. జైలు ప్రధాన గేటు ముందు, రోడ్డుమీద చంద్రబాబు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ‘జై బాబు... జైజై బాబు’ నినాదాలతో ఆ పరిసరాలను మార్మోగించారు.
గంభీరంగా నడుచుకుంటూ...
ముందుగా ఖరారైన షెడ్యూలు ప్రకారం మంగళవారం ఉదయమే లోకేశ్, బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటలకే ఎన్‌ఎ్‌సజీ కమెండోలు 7 వాహనాలతో కూడిన కాన్వాయ్‌తో అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది జైలు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈలోపు జైలు అధికారులు హైకోర్టు నుంచి వచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబు విడుదలకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. కోర్టు విధించిన షరతులు పాటిస్తానని చంద్రబాబుతో సెంట్రల్ జైలు అధికారులు సంతకం పెట్టించుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4.15 గంటలకు... మెయిన్ గేటు దాటి బయటికి వచ్చారు. విజయసంకేతంగా రెండు వేళ్లను చూపించారు. కాన్వాయ్‌లోని వాహనం ఎక్కకుండా గంభీరంగా నడుచుకుంటూ వచ్చారు. జైలు సిబ్బంది రెండో గేటు తీయగానే చంద్రబాబు... జైలు ఆవరణనుంచి బయటకు వచ్చారు. ఆయనను చూసిన వెంటనే అక్కడ గుమికూడిన జనం ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేశారు. పలువురు టీడీపీ నేతలు తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యారు. అప్పటికే అక్కడ నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ తదితరులు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి వాసు, పట్టాభి తదితరులు గేటువద్ద జనం మధ్యలో ఉన్నారు. చంద్రబాబు బయటకు రాగానే మనవడు దేవాన్ష్‌ను హృదయానికి హత్తుకున్నారు. అక్కడ బ్రాహ్మణి, దేవాన్ష్ టీడీపీ జెండాను చంద్రబాబుకు అందించారు. ఆ క్షణం అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అక్కడ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలను చంద్రబాబు పలకరించారు.
ఆనందం... ఆరాటం...
చంద్రబాబును దగ్గరి నుంచి చూడాలని, ఆయనను పలకరించాలని అంతా ప్రయత్నించడంతో జైలు ముందు తొక్కిసలాట వాతావరణం చోటు చేసుకుంది. ఎన్‌ఎ్‌సజీ కమెండోలు, పోలీసుల వలయాలు, రోప్‌వే ఉన్నప్పటికీ ముందుకు తోసుకు వచ్చారు. చంద్రబాబు అరెస్టుతో తాము పడిన బాధ, ఆవేదన గురించి ఆయనకు వివరించేందుకు చాలామంది ప్రయత్నించారు. ఇదంతా చూసి ఆయన కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఆయన రెండో ఎంట్రెన్స్ నుంచి అక్కడే ఉన్న రోడ్డు మీదకు రావడానికే అరగంట పట్టింది. అక్కడే ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు.