Lokesh Padayatra: 2024 మేలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం ఖాయం: లోకేశ్
ABN , First Publish Date - 2023-03-03T21:18:08+05:30 IST
నాలుగేళ్లుగా బయటికి రాని సీఎం జగన్ ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు
చిత్తూరు: ‘నాలుగేళ్లుగా బయటికి రాని సీఎం జగన్ ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు అనేక అనుకూలతలున్నా, ప్రతికూలత మాత్రం సీఎం జగనే’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 33వ రోజు సందర్భంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం (Punganur Constituency) పులిచెర్ల మండలం కొత్తపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి పరిశ్రమలు రావడం అటుంచితే, జగన్ వల్ల ఉండేవి కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. తాజాగా మేం తెచ్చిన ఫాక్స్‌కాన్ కంపెనీ నిన్న తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో లక్ష మందికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. 2024 మే నెలలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. 2025 జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ (Job Calendar)ను విడుదల చేయడం ఖాయం’ అని లోకేశ్ స్పష్టంచేశారు.
గంజాయి మోహన్‌రెడ్డిగా పేరు పెడుతున్నా
‘గూగుల్‌లో గంజాయి క్యాపిటల్ ఏదని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని వస్తోంది. పదో తరగతి పిల్లల్ని కూడా వైసీపీ నాయకులు గంజాయి డీలర్లుగా మార్చేస్తున్నారు. ప్రధాని నార్కోటిక్ బ్యూరో అధికారులకు ఏపీలో గంజాయి పరిస్థితుల గురించి లేఖ రాశాను. ఉలిక్కిపడిన తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ గంజాయి లేదని చెప్పారు. ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నప్పుడే చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల వద్ద గంజాయి లభించింది. దీనికి ఏం సమాధానం చెబుతావ్ మిస్టర్ ఎస్పీ? రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చేసిన సీఎంకు నేటి నుంచి గంజాయి మోహన్‌రెడ్డిగా పేరు పెడుతున్నా’ అని లోకేశ్ అన్నారు.
నోరుమెదపని వైసీపీ ఎంపీలు
రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా జగన్ పూర్తి చేయలేకపోయాడని లోకేశ్ విమర్శించారు. అప్పర్ తుంగభద్రపై కర్ణాటకలో ప్రాజెక్టు కడుతున్నారని గుర్తుచేశారు. అది పూర్తయితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు విప్పడం లేదని ఆరోపించారు.