Share News

Chandrababu : జైలులో లేను.. మీ గుండెల్లో ఉన్నా

ABN , First Publish Date - 2023-10-23T02:05:16+05:30 IST

అదే చెక్కు చెదరని విశ్వాసం.. తెలుగు నేల అభివృద్ధిని శ్వాసించే సంకల్పం.. ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అవకాశంగా మలుచుకునే ధీరత్వం.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu : జైలులో లేను.. మీ గుండెల్లో ఉన్నా

ఒక్క క్షణం కూడా ప్రజల నుంచి నన్ను దూరం చేయలేరు

సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించ లేవు..

జనమే నా బలం.. జనమే నా ధైర్యం

ఆలస్యం కావచ్చేమో.. కానీ అంతిమంగా గెలిచేది న్యాయమే!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..

ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

నేను జైలులో లేను. మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు.

- చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అదే చెక్కు చెదరని విశ్వాసం.. తెలుగు నేల అభివృద్ధిని శ్వాసించే సంకల్పం.. ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అవకాశంగా మలుచుకునే ధీరత్వం.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేరుతో ఆదివారం ప్రజలను ఉద్దేశించి విడుదలయిన బహిరంగ లేఖలో అక్షరమక్షరం ప్రతిఫలించిన చైతన్య రణన్నినాదం.. ములాఖత్‌ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన అభిప్రాయాలను, ఆలోచనలను చెప్పి ప్రజలకు లేఖ రూపంలో వాటిని తెలియజేయాలని చంద్రబాబు కోరారు. ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచి చంద్రబాబు పేరుతో కుటుంబ సభ్యులు లేఖ రూపంలో విడుదల చేశారు. కాగా, చంద్రబాబు సంతకంతో జైలు నుంచి ఆయన రాసిన లేఖగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అవుతున్న లేఖ కారాగారం నుంచి రాలేదని స్పష్టంచేస్తూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు తమతో చెప్పిన విషయాలను ఆయన పేరుతోనే లేఖ రూపంలో విడుదల చేశామని కుటుంబ సభ్యులు అప్పటికే స్పష్టం చేశారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు.

నేను జైలులో లేను. మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చోని ఆలోచిస్తూ ఉంటే.. 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం.

ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి, ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల నుంచి ఒక్క రోజు కాదు కదా.. ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు. కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్నాన్ని బంధించలేవు. జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయను. చేయనివ్వను.

ఈ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి, పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్‌ కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను.

ఎప్పుడూ బయటకు రాని స్వర్గీయ నందమూరి తారక రామారావు బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేడు అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజలోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని నేను కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వస్తోంది.

జనమే నా బలం. జనమే నా ధైర్యం. దేశవిదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ.. అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే! మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తాను. అంత వరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా.. నిలవదు. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా... కాల పరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో...

మీ నారా చంద్రబాబు నాయుడు

Updated Date - 2023-10-23T02:05:16+05:30 IST