Share News

Cm Jagan : పట్టు పోతోంది!

ABN , First Publish Date - 2023-12-13T04:10:16+05:30 IST

రాష్ట్రంలో తన సర్కారుపై ప్రతికూల వాతావరణం ఏర్పడడాన్ని సీఎం జగన్‌ సహించలేకపోతున్నారు.

Cm Jagan : పట్టు పోతోంది!

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులను దారిలో పెట్టలేక జగన్‌ సతమతం’

వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి పార్టీపై పట్టు కోల్పోతున్నారా..? క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకోకుండానే ఇన్‌చార్జులను మార్చేస్తున్నారా..? ప్రజల్లో ఎమ్మెల్యేలపైనే తీవ్ర వ్యతిరేకత ఉందని.. తనపై లేదని సమర్థించుకోవాలని చూస్తున్నారా..? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే బదులిస్తున్నాయి. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నా సరిదిద్దడానికి ఆయన ప్రయత్నించలేదు. కనీసం పిలిచి మందలించిన సందర్భాలూ లేవు. తప్పు చేసిన వారిని శిక్షించనూ లేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట ఏవో సర్వే నివేదికల సాకుతో వారికి మొండిచేయి చూపేందుకు యత్నిస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. సొంతూళ్లో గెలవలేని వారు వేరే ఊరికి వెళ్లి ఎలా నెగ్గుతారో అర్థం కాని పరిస్థితి.

సీఎం తీరుపై వారిలో తీవ్ర అసంతృప్తి

ఆయన తప్పులు తమపైనా అంటూ ఆవేదన

ఏకపక్షంగా ఇన్‌చార్జుల నియామకం

క్షేత్ర స్థాయి పరిస్థితులు

బేరీజు వేయకుండానే మార్పులు

నిర్ణయానికి ముందు ఆయా నేతలకు

పిలుపుల్లేవు.. బుజ్జగింపుల్లేవు

సమన్వయకర్తలనూ వాడని వైనం

పరస్పర కలహాల్లో కో-ఆర్డినేటర్లు

తలపట్టుకుంటున్న ప్రభుత్వ పెద్దలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో తన సర్కారుపై ప్రతికూల వాతావరణం ఏర్పడడాన్ని సీఎం జగన్‌ సహించలేకపోతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుపాల్జేసిన వ్యవహారం.. టీడీపీని, జనసేనను చేరువ చేస్తాయని ఆయన అసలు ఊహించలేదు. నాలుగున్నరేళ్లు అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులను పంటిబిగువున ఓర్చుకున్న టీడీపీ శ్రేణులు, విద్యావంతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్లపైకెక్కి బాబు అరెస్టును నిరసించిన తీరు ఆయనకు మింగుడుపడడం లేదు. తన ప్రభుత్వంపై జనంలో ఇంత వ్యతిరేకత గూడుకట్టుకుని ఉందని నమ్మలేకపోతున్నారు. నేనే పార్టీ.. నన్ను చూసే ప్రజలు ఓటేశారు.. ఓటేస్తారన్న అభిప్రాయం ఆయనలో నరనరానా విస్తరించి ఉందని.. అందుకే తమను లెక్కచేయడం లేదని.. క్షేత్ర స్థాయి నిజాలను చెవికెక్కించుకోవడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముగ్గురు మంత్రులు సహా 11 నియోజకవర్గాల ఇన్‌చార్జులను జగన్‌ ఉన్నపళంగా మార్చారు.

దీనిపై నిరసనలు పెల్లుబికాయి. తమ నేతలను పక్కనపెట్టి కొత్తవారిని బలవంతంగా తీసుకొచ్చి రుద్దడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేస్తున్నారు. మంత్రులు విడదల రజని(చిలకలూరిపేట), మేరుగ నాగార్జున(వేమూరు), ఆదిమూలపు సురేశ్‌(యర్రగొండపాలెం) తమ నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదని పీకే టీంతో పాటు వైసీపీ సొంత సర్వేల్లోనూ తేలింది. వీరికి టికెట్లు ఇవ్వకపోతే ప్రతికూలత వస్తుందన్న భయంతో వేరే నియోజకవర్గాలకు మార్చారు. ఆయా చోట్ల టీడీపీ బలంగా ఉండడం గమనార్హం. సొంత నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేని వీరు వేరేచోట గెలవగలరా అని వైసీపీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా ఇన్‌చార్జులను ఆకస్మికంగా మార్చారని అభిప్రాయపడుతున్నాయి. సన్నిహితులెవరో చెబితే ఇన్‌చార్జులుగా తీసేయడం.. కేడర్‌కు తెలియనివారిని నియమించడం వంటివి పార్టీపై ఆయనకు నియంత్రణ లేదన్న సంగతి రుజువు చేస్తున్నాయని అంటున్నాయి.

కొరవడిన సమన్వయం!

అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను పిలిచే బుజ్జగించే అలవాటు జగన్‌కు లేదు. సమన్వయకర్తలైనా ఆ పని చేయడం లేదు. ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాల్సిన వీరే.. కలహాల్లో మునిగి తేలుతున్నారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి పొసగడం లేదు. విశాఖలో తనవర్గాన్ని సుబ్బారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని విజయసాయిగుర్రుగా ఉండగా.. ఒంగోలులో విజయసాయిరెడ్డి తలదూర్చి.. తన వ్యతిరేక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని సుబ్బారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద నేతలే వర్గవిభేదాలతో సతమతమవుతుంటే.. ఇక తప్పుచేసిన ఎమ్మెల్యేలను వారెలా దారిలోకి తేగలరని ముఖ్య నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిచ్చే నివేదికల్లో నిజానిజాలెంతో తెలుసుకోకుండా జగన్‌ ఏకపక్షంగా ఇన్‌చార్జులను మార్చేస్తున్నారన్న ఆగ్రహం ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది.

కోరి తెచ్చుకున్న నిరసన!

గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం బూమరాంగ్‌ అయిందని వైసీపీ ఎమ్మెల్యేల్లో పలువురు నెత్తీనోరూ కొట్టుకున్నా ప్రాంతీయ సమన్వయకర్తలు వినలేదు. ఇది జగన్‌కు చేరిందో లేదో తెలియదని అంటున్నారు. ఓపక్క ఎలాంటి అభివృద్ధీ లేక ఊళ్లు అల్లాడుతున్నాయి.. ఓ రోడ్డు వేయలేదు.. ఓ మురుగుకాల్వ కట్టలేదు.. వీధి దీపాలు వెలగవు.. పింఛన్లు ఉన్నట్లుండి ఆగిపోతాయ్‌.. సర్పంచ్‌లకు అధికారాల్లేవు.. వారి నిధులన్నీ ప్రభుత్వం ఊడ్చేసింది.. ఇలాంటి పరిస్థితుల్లో జనంలోకి వెళ్తే నిలదీతలు తప్పవని.. ఏం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు వాపోయినా.. జగన్‌ అండ్‌ కో వినిపించుకోలేదు. సంక్షేమ పథకాలు 87శాతం ఇళ్లకు చేరినందున.. 175 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని జగన్‌ ఊదరగొట్టారు. మొదట్లో ఇది నిజమేనని కొందరు శాసనసభ్యులు నమ్మేశారు. గ్రామాలకు వెళ్తే గానీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలియలేదు. అభివృద్ధి పనులపై మహిళలు ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు నీళ్లునమలడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనకుంటే టికెట్లు ఇచ్చేది లేదని, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని జగన్‌ బెదిరించడం వల్లే వారు మొదట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వర్క్‌షాపులో కనీసం 58 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదన్నట్లుగా జగన్‌ పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో.. ఇక ఎంత చేసినా టికెట్లు ఇవ్వరని.. అలాంటప్పుడు తామెందుకు రిస్కు తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కనీసం 70మంది ఎమ్మెల్యేలను మార్చాలని.. లేదంటే రెండోసారి విజయం కష్టమేనని పీకే టీఎం నివేదికలిచ్చింది. ఇది కాకుండా జగన్‌ సొంతగా కొన్ని సర్వే సంస్థలను రంగంలోకి దింపారు. వాటిదీ అదే మాట కావడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు.

ఆ వ్యతిరేకత మీపైనే..!

గెలిస్తే తన ఘనత.. ఓడితే మీ బాధ్యత అన్నట్లుగా జగన్‌ వ్యవహార శైలి ఉందని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్ని సర్వేలూ చెబుతున్నాయి. ఈ నిజాన్ని అంగీకరించేందుకు జగన్‌ సిద్ధంగా లేరు. పైగా తనపై ఎలాంటి వ్యతిరేకతా లేదని.. ఎమ్మెల్యేలపైనే ఉందని వాదిస్తున్నారు. అభివృద్ధి చేయాల్సింది ప్రభుత్వమేనని.. రోడ్లు, నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత జగన్‌పైనే ఉందని జనం అనుకుంటున్నారని.. అయితే తమపై నెపం మోపాలని ఆయన చూస్తున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు. గడప గడపకూ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్‌ సహా పలు సంస్థలతో వైసీపీ అంతర్గత సర్వే చేయడం ప్రారంభించింది. వీటి నివేదికలు క్షేత్ర స్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని భావించిన పలువురు ఎమ్మెల్యేలు తాము కూడా సర్వేలు చేయించుకోవడం ప్రారంభించారు. జగన్‌ ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉందన్న నివేదికలను అధిష్ఠానం ముందు పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఐ-ప్యాక్‌ సర్వేల ప్రకారం ఓడిపోవడం ఖాయమనీ తేలింది.. టికెట్లు ఇవ్వరనీ తెలిసింది.. ఇలాంటప్పుడు హైరానా ఎందుకని చాలామంది నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. అందుకే తమ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను తెచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. సోమవారం ప్రకటించిన 11 నియోజకవర్గాలు గాక.. మరో 45-50స్థానాల ఇన్‌చార్జులను మారుస్తామని సీఎంవో వేదికగానే.. ముఖ్య నేతలు ప్రకటిస్తున్నా.. చలించడం లేదు. టికెట్‌ రాకపోయినా ప ర్వాలేదన్న భావనతో ఉన్నారు.

సజ్జలకు మత్స్యకారుల సెగ!

సామాజిక న్యాయం చేస్తున్నామంటూ బస్సుయాత్రలు చేస్తున్న వైసీపీకి .. మత్స్యకారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రేపల్లెలో తమ నేత మోపిదేవిని పక్కనపెట్టి గణేశ్‌కు ఎలా ఇస్తారని మత్సకార సమాఖ్య నేతలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. మంగళవారం విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో వారు ఆయన్ను కలిశారు. మోపిదేవిని రేపల్లె అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. మోపిదేవిని ప్రధాన ప్రచారకర్తగా నియమిస్తామని ఆయన చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు. ఈ అంశంపై సీఎంతో మాట్లాతానని మత్స్యకారులకు సజ్జల నచ్చజెప్పాల్సి వచ్చింది.

Updated Date - 2023-12-13T04:10:18+05:30 IST