Lokesh : జగన్ స్టిక్కర్ల సీఎం
ABN , First Publish Date - 2023-05-11T05:19:44+05:30 IST
గత ప్రభుత్వ పథకాలను కొనసాగించడం చేతగాని సీఎం జగన్ రెడ్డి.. స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం సిగ్గుపడటం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్టిక్కర్ల సీఎం అని విమర్శించారు. యువగళం

సిక్కర్లపై తప్ప నీళ్ల్లివ్వడంపై శ్రద్ధ లేదు
వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు శాపం
కష్టాల్లో ప్రజలు.. విలాసాల్లో జగన్
రాష్ట్రంలో తాలిబన్ తరహా పాలన
యువగళం పాదయాత్రలో లోకేశ్ విమర్శలు
1200 కిలోమీటర్లకు చేరిన పాదయాత్ర
నంద్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పథకాలను కొనసాగించడం చేతగాని సీఎం జగన్ రెడ్డి.. స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం సిగ్గుపడటం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్టిక్కర్ల సీఎం అని విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా 95వ రోజు బుధవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 17.9 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటి వరకు 1206.9 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో మూతపడిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను చూపిస్తూ, పేదల దాహార్తిని తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఎన్నో ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు. కానీ జగన్ అధికారంలోకొచ్చాక వాటిని పట్టించుకోకపోవడంతో పనికిరాకుండా పోయాయన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం స్టిక్కర్లు వేయడంపై పెడుతున్న శ్రద్ధ సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై చూపడం లేదని విమర్శించారు. సీమ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో తాలిబన్ తరహా పాలన కొనసాగుతోందన్నారు. ముస్లిం, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల కోసం గతంలో తాము అమలుచేసిన పథకాలను పునరుద్ధరిస్తామని లోకేశ్ హామీనిచ్చారు. అలాగే ఎస్టీలకు భూములు ఇస్తామని, పక్కా ఇళ్లు, పింఛన్లు అందజేస్తామని అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. అప్పులుచేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాగానే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే వచ్చేలా చూస్తామన్నారు. నందికొట్కూరు నుంచి వడ్డేమాను గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపడతామని, ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లను పునరుద్ధరిస్తామని లోకేశ్ హామీనిచ్చారు.
ఈ ఆరు సమస్యలకు సమాధానమివ్వాలి..
గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1100 రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యక్రమానికి పేరు మార్చి సీఎం జగన్ కలరింగ్ ఇస్తున్నాడని లోకేశ్ విమర్శించారు. నందికొట్కూరు పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు చేశారు. ‘జగనన్నకు చెబుదాం...’ శుద్ధ అబద్ధమన్నారు. ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లయితే తాను చెప్పే ఆరు సమస్యలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2.30లక్షల ఉద్యోగాల హామీ, బీసీ కార్పొరేషన్లకు నిధుల హామీ ఏమైందన్నారు. దళితుల కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. విపరీతంగా పెంచిన పన్నులు ఎప్పుడు తగ్గిస్తారని, తడిచిన ధాన్యం ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు.
1,200 కిలోమీటర్లు పూర్తి
యువగళం పేరిట లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో 1,200 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మిడుతూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి సాగు, తాగునీరు అందిస్తామన్నారు. మొత్తం 22 వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60 వేలమందికి తాగునీరు అందుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామంలో 1,200 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్రా, పత్తిపాటి పుల్లారావు, అఖిలప్రియ, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, మాండ్ర ఉమాదేవి, జగత్‌విఖ్యాత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15న పాదయాత్రకు 100 రోజులు
అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ యువ నేత లోకేశ్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర ఈ నెల 15వ తేదీ నాటికి వంద రోజుల మైలు రాయిని చేరుకోనుంది. ఆ రోజుకు ఆయన నంద్యాల నియోజకవర్గంలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర మొత్తం 400 రోజులు నడుస్తుందని అంచనా. వంద రోజుల మైలు రాయిని అధిగమిస్తుండటంతో దానికి రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావం తెలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు లోకేశ్ పాదయాత్రకు సంఘీభావ పాదయాత్రలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో 7కి.మీ. తగ్గకుండా ఈ యాత్ర జరపాలని సూచించారు.