Corporate Education : దగాచేసి.. దిగాలు!
ABN , First Publish Date - 2023-10-23T01:58:52+05:30 IST
ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. దళితులను ఉద్ధరిస్తున్నామంటూ డంబాలు పలికే సీఎం జగన్.. చేతల్లోకి వచ్చే సరికి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని దళిత వర్గాలకు చెందిన చిన్నారులకు
దళిత చిన్నారులకు కార్పొరేట్ విద్యను దూరం చేయాలనే కుట్రబెస్ట్ అవైలబుల్ స్కూళ్ల నిలిపివేత
‘అమ్మఒడి’ ఉందని వితండ వాదన
జగన్ సర్కారు నిర్ణయాన్ని సవాల్
చేస్తూ తల్లిదండ్రుల న్యాయ పోరాటం
సుప్రీంకోర్టు వరకు సాగిన పోరు
వైసీపీ ప్రభుత్వ నిర్ణయం కొట్టివేత
ఎట్టకేలకు వెనక్కి తగ్గిన సర్కారు
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు మళ్లీ ఓకే
తాజాగా జీవో 61 జారీ చేసిన ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువులకు గ్రీన్ సిగ్నల్
పోరాడి గెలిచిన ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు
నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ పదేపదే వారిని ఓన్ చేసుకునే సీఎం జగన్.. తెరచాటున ఆయా వర్గాలకు చెందిన చిన్నారులకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేయాలని ప్రయత్నించారు. దళిత, గిరిజన చిన్నారుల కార్పొరేట్ విద్యను కాలరాయాలని చూశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను మూసివేయాలని సంకుచితంగా ఆలోచించారు. అయితే, వైసీపీ ప్రభుత్వ సంకుచిత నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగి.. సర్కారును చిత్తుగా ఓడించారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. దళితులను ఉద్ధరిస్తున్నామంటూ డంబాలు పలికే సీఎం జగన్.. చేతల్లోకి వచ్చే సరికి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని దళిత వర్గాలకు చెందిన చిన్నారులకు కార్పొరేట్ తరహా విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను మూసివేయాలని కొన్నాళ్ల కిందట సర్కారు నిర్ణయించింది. ఈ స్కూళ్ల నిర్వహణకయ్యే సుమారు రూ.100 కోట్లను ఖర్చు చేయలేమని పేర్కొంటూ వాటిని మూసివేసే ప్రయత్నం చేసింది. అయితే, సుమారు 14 ఏళ్లుగా సాగుతున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్కారు నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అయితే, అక్కడ కూడా జగన్ సర్కారు వితండవాదానికి దిగింది. ఈ స్కూళ్లను కొనసాగించలేమని న్యాయస్థానాల్లోనూ అవిశ్రాంతంగా పోరాడింది. ఈ క్రమంలో ఎన్నో కోట్ల రూపాయలు సైతం ఖర్చు చేసింది. అయితే, జగన్ సర్కార్‌కు ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు పడ్డాయి. స్కూళ్లను కొనసాగించాలని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో వైసీపీ సర్కారు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను కొనసాగిస్తూ ఈ నెల 20న జీవో 61ని జారీ చేసింది.
విద్యార్థుల న్యాయపోరాటం
గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీంను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో సవాల్ చేశారు. విద్యార్థుల తరఫున మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ స్కీం నిలిపేయడం వల్ల కార్పొరేట్ తరహా విద్య దూరమవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొనసాగింపు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పదోతరగతి పూర్తయ్యే వరకూ కొనసాగించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దీంతో హైకోర్టు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో చదువుతున్న 49 వేల మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు స్కీం కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. అయితే దళిల విద్యార్థుల విద్యపై సర్కారు కత్తిగట్టినట్టు వ్యవహరించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే, అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.
2008 నుంచి అమల్లో ఉన్న పథకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీంను అమల్లోకి తెచ్చారు. 2019 వరకు ఈ స్కీం బాగానే అమలైంది. ఈ పథకం ద్వారా స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి, ఐదు, ఎనిమిదో తరగతుల్లో ప్రవేశాలు కల్పించేవారు. ఈ విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి నిధులు ఆపేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం కూడా అమల్లో ఉండరాదనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది.
పేద విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన కీలక పథకాలను రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్ సర్వీ్‌సకు సిద్ధమయ్యే వారికి ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందించింది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. అదే క్రమంలో విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను బుట్టదాఖలు చేసింది.
సర్కారు వితండ వాదం
రద్దు చేసిన పథకాల స్థానంలో జగన్ ప్రభుత్వం అమ్మఒడి, విద్యాదీవెన పథకాలను చూపిస్తోంది. అమ్మఒడి ఉంటే ఈ పథకాలన్నీ ఎందుకని వితండవాదం చేస్తోంది. అయితే, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను అన్ని సామాజిక వర్గాల్లోని అర్హులైన పేదలకు అందిస్తున్నారు. కానీ, కేవలం ఎస్సీ, ఎస్టీలకు పరిమితమైన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను రద్దు చేయడం, బీసీల అభ్యున్నతికి బాటలు వేసే ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ని అటకెక్కించడంతో ఆయా వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎట్టకేలకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తే తప్ప సర్కారు దిగిరాకపోవడం గమనార్హం.