ధర్మాన ‘మాస్టర్‌ ప్లాన్‌’

ABN , First Publish Date - 2023-08-05T03:11:45+05:30 IST

విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ధర్మాన ‘మాస్టర్‌ ప్లాన్‌’

సర్కారీ సొమ్ముతో మంత్రి భూమికి రోడ్డు

ఆ భూమి వరకే 60 అడుగుల రహదారి

మధురవాడలో ధర్మానకు 4.89 ఎకరాలు

కనెక్టవిటీ ఉండేలా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు

ప్రజలకు ఉపయోగం లేకున్నా నిర్మాణం

భూమి విలువ పెంచేందుకేనని విమర్శలు

ఆ భూమిపై గతంలో ఆరోపణలు

ధర్మాన కుమారుడి కంపెనీ పేరిట కొనుగోలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అదేమీపట్టని జీవీఎంసీ అధికారులు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చెందిన భూమి కోసం 60 అడుగుల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఆ భూమి వరకే రూ.16 లక్షల జీవీఎంసీ నిధులు వెచ్చించి రోడ్డు నిర్మిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఉందని చెబుతూ ఆ భూమి విలువ పెరిగేలా రోడ్డు పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపులుప్పాడ డంపింగ్‌యార్డు సమీపంలోని మధురవాడ సర్వే నంబర్‌ 187/1లో ధర్మాన ప్రసాదరావుకు 4.89 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని మాజీ సైనికుడికి ప్రభుత్వం కేటాయించిందని, అమ్మకానికి ఎన్‌ఓసీ ఇవ్వాలని కోరుతూ సదరు వ్యక్తి భార్య పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం (అప్పట్లో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు)లో జిల్లా కలెక్టర్‌కు ఒక దరఖాస్తు అందింది. ఆగమేఘాలపై ఎన్‌ఓసీ జారీ చేశారు. దీనివెనుక ధర్మాన చక్రం తిప్పారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అనంతరం ఆ భూమిని ధర్మాన కుమారుడికి చెందిన కంపెనీ పేరుతో కొనుగోలు చేయడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. అప్పట్లో దుమారం చెలరేగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోవడంతో అంతా మరిచిపోయారు.

మంత్రి ప్రోద్బలంతో...

మారికవలస రాజీవ్‌ గృహకల్ప కాలనీ నుంచి ధర్మానకు చెందిన భూమి మీదుగా కాపులుప్పాడ డంపింగ్‌యార్డు వరకూ 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని వీఎంఆర్‌డీఏ అధికారులు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. మంత్రి ప్రోద్బలంతోనే ఈ రహదారిని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించినట్టున్నారు. డంపింగ్‌ యార్డు ప్రాంతంలో ఏవైనా నిర్మాణాలు జరిగితే తప్ప, ప్రస్తుతానికి ఆ రోడ్డు అవసరం లేదు. అయినా జీవీఎంసీ అధికారులు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు తయారుచేశారు. ఆ వెంటనే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సర్వే చేసి ఆర్‌డీపీ (రోడ్డు డెవల్‌పమెంట్‌ ప్లాన్‌) తయారు చేయడం.. ఇంజనీరింగ్‌ అధికారులు రాజీవ్‌ గృహకల్ప కాలనీ నుంచి ధర్మాన భూమి వరకూ మాత్రమే సుమారు 200 మీటర్లు పొడవున 60 అడుగుల రోడ్డు నిర్మాణానికి సిద్ధమవడం చకచకా జరిగిపోయాయి.

యుద్ధప్రాతిపదికన పనులు

రోడ్డు నిర్మాణం కోసం తుప్పల తొలగింపు, కచ్చా రోడ్డు నిర్మాణం కోసం రూ.16 లక్షలు కేటాయించారు. ఆ వెంటనే ఇంజనీరింగ్‌ అధికారులు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ప్రస్తుతం తుప్పల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం మంత్రి ధర్మాన భూమికి విలువ పెంచేందుకే జీవీఎంసీ అధికారులు పనులు చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమైతే ఒకేసారి కాపులుప్పాడ డంపింగ్‌ యార్డు వరకూ 60 అడుగులు రోడ్డు నిర్మించాలి గానీ, మంత్రికి చెందిన భూమి వద్దకు వరకూ మాత్రమే నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద ప్రస్తావించగా.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆర్‌డీపీ తయారుచేసి ఇచ్చేశారని, దశల వారీగా కాపులుప్పాడ డంపింగ్‌ యార్డు వరకూ రోడ్డు నిర్మిస్తామని బదులిచ్చారు.

Updated Date - 2023-08-05T03:11:45+05:30 IST